రాబోయే రెండేళ్లలో 3.5 కోట్ల కొలువులు!.. కొత్త యువ ఉద్యోగులకు నెలకు 15వేలు.. ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోదీ
ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ‘మిషన్ సుదర్శన్ చక్ర’తో సహా రక్షణ, ఆర్థిక, ఉపాధి రంగాల్లో కీలక ప్రకటనలు చేశారు.

న్యూఢిల్లీ : గతంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలన్న నరేంద్రమోదీ.. ఈసారి రానున్న రెండేళ్లలో మూడున్నర కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనను ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎర్రకోటపై దేశ ప్రధానిగా వరుసగా 12వ సారి జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. రికార్డు స్థాయిలో 103 నిమిషాలు మాట్లాడారు. లక్ష కోట్ల రూపాయలతో చేపట్టే కొత్త స్కీమ్‌లో కొత్తగా ఉద్యోగస్తులైన యువతకు నెలకు 15వేలు ఆర్థిక సహాయంగా అందిస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద మూడు కోట్ల మంది యువతకు లబ్ధి కలుగుతుందని అంచనా. గతంలో ఏటా రెండున్నర కోట్లని ప్రకటించగా.. బజ్జీలు వేసుకునేవాళ్లు సైతం ఈ కోటా కిందకు వస్తారని ప్రభుత్వం చెప్పుకొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మూడున్నర కోట్ల ఉద్యోగాల సంగతి ఆచరణలోనే చూడాల్సి ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్వతంత్ర భారత్, సమృద్ధ భారత్ మధ్య వంతెనలా కొత్త పథకం ఉంటుందని చెబుతున్నారు. ఈ పథకాన్ని మోదీ అధ్యక్షతన జూలై 1, 2025న జరిగిన క్యాబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది.
సుదర్శన చక్ర
దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు.. దేశాన్ని శతృదేశాల ముప్పు నుంచి రక్షించేందుకు వీలుగా మిషన్ సుదర్శన్ చక్ర కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. వచ్చే పదేళ్లలో దేశీయ సాంకేతికతతో అధునాతన యుద్ద నైపుణ్యాలతో అభివృద్ధి చేయనున్న మిషన్ సుదర్శన్ చక్ర వ్యవస్థ.. కీలక ప్రదేశాలను కాపాడుతుందన్నారు. ప్రతి పౌరుడు దీని కింద సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారని ప్రధాని భరోసా ఇచ్చారు. మహాభారతంలోని శ్రీ కృష్ణుడి స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొన్నారు. పదేళ్ల క్రితం రక్షణరంగంలో స్వయంసమృద్ధిపై మన దేశం దృష్టిపెట్టిందని.. ఇప్పుడు దాని ఫలితాలను చూస్తోందని మోదీ తెలిపారు. సాంకేతికత అభివృద్ధి విదేశాలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించాలని అన్నారు. 2008 ముంబై దాడులు సమీకృత భద్రతా ప్రణాళిక అవసరాలను పెంచాయన్నారు. దేశంపై దాడులు జరిగినప్పుడు మాత్రమే స్పందించేలా కాకుండా.. ముందే సంసిద్ధతతో ఉండాలన్నారు. మిషన్ సుదర్శన్ చక్రతో పాకిస్తాన్ కు ప్రధాని గట్టి హెచ్చరికలు జారీచేశారు.
అణు బెదిరింపులకు భయపడే భారత్ కాదు
దేశ స్వాతంత్య్ర వేడుకలు 140 కోట్ల మంది సంకల్ప పండగ అని మోదీ అభివర్ణించారు. సమైక్య భావనతో దేశం ఉప్పొంగే సమయమిదని చెప్పారు. కోట్ల మంది త్యాగాలతో భారతావనికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన వీర జవాన్లకు సెల్యూట్ చేశారు. పహల్గామ్ దాడిపై దేశమంతా ఆగ్రహంతో రగిలిపోయిందని.. దాడి చేసిన ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్ తో గట్టి గుణపాఠం చెప్పామని గుర్తుచేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదులను ధైర్యంగా మట్టుబెట్టామన్నారు. శత్రుమూకలను ఎప్పుడు ఎలా మట్టుబెట్టాలో సైన్యం నిర్ణయిస్తుందని.. లక్ష్యం, సమయం ఎంచుకునే స్వేచ్ఛ త్రివిధ దళాలకే ఇచ్చామని తెలిపారు. అణుబాంబు బెదిరింపులకు భారత్ భయపడదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. నీరు, రక్తం కలిసి ప్రవహించవని మళ్లీ చెబుతున్నానన్న మోదీ.. సింధూ జలాల ఒప్పందంపై మరో మాట లేదని, వాటిని భారత భూభాగానికి మళ్లించాలన్న ఆలోచనలో మార్పు లేదని స్పష్టంచేశారు. సింధూజలాల ఒప్పందం పునరుద్ధరణ ఎప్పటికీ జరగబోదని తేల్చి చెప్పారు. దీనిపై ఎప్పటికీ చర్చల ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థ పరిరక్షణలో రాజీ పడబోం
దేశంలోని రైతులు, మత్స్యకారులు, పశుపోషకులకు నష్టం కల్గించే చర్యలకు తాను అడ్డుగోడగా నిలబడుతానని మోదీ హామీ ఇచ్చారు. మన ఆర్థిక వ్యవస్థకు రైతాంగం కీలకమని తెలిపారు. అమెరికా అగ్రి, డెయిరీ ఉత్పత్తులు భారత్ మార్కెట్‌లలో అనుమతించేందుకు సుంకాల పెంపుతో చేస్తున్న ఒత్తిళ్లకు లొంగేది లేదన్నారు. ప్రపంచంలో ఆర్థిక స్వార్థం పెరిగిపోయిందని.. ఈ పరిస్థితుల్లో తక్కవ ధరకు నాణ్యమైన ఉత్పత్తుల ఎగుమతితో మనం ప్రపంచ మార్కెట్‌ను పాలించాలని చెప్పారు. దేశంలోని వ్యాపారులు, దుకాణదారులు స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టిపెట్టాలన్నారు. ఇంధన రంగంలోనూ ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ప్రతి రంగంలోనూ స్వయంసమృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని తెలిపారు. స్వయంసమృద్ధి అంటే డాలర్లు, పౌండ్లు కాదని.. సమున్నతంగా నిలబడటమన్నారు. ఎగుమతి, దిగుమతులు, ఆదాయ వ్యయాలే స్వయంసమృద్ధి కాదన్నారు. మేకిన్ ఇండియా ఏంటో ఆపరేషన్ సిందూర్ చాటి చెప్పిందని తెలిపారు. భారత్‌లో తయారీ నినాదం రక్షణరంగంలో మిషన్ మోడ్‌లో పనిచేస్తోందన్నారు. ‘భారత్ సమున్నత శక్తిగా ఎదుగుతోంది. ఇవాళ ప్రపంచం భారత్‌ను విస్మరించలేదు. టెక్నాలజీ కోసమో, సాయం కోసమో భారత్ ప్రపంచాన్ని అర్థించట్లేదు. సెమీ కండక్టర్లు సహా అనేక విషయాల్లో సొంత కాళ్లపై నిలబడుతోంది. 50-60 ఏళ్ల క్రితమే వీటి తయారీ ఆలోచన ఉంది. త్వరలో మేడ్ ఇన్ ఇండియా చిప్‌లు మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి’ అని ప్రధాని మోదీ వివరించారు.
కొత్త పథకాలకు శ్రీకారం
దీపావళి లోపు ప్రజలపై జీఎస్టీ భారాన్ని తగ్గించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. సామాన్యులకు కొత్త తరం జీఎస్టీ సంస్కరణలు దీపావళి కానుకగా ఇస్తామన్నారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తామని తెలిపారు. చిన్న తరహా పరిశ్రమలకు, స్థానిక వ్యాపారులు, వినియోగదారులకు ఉపశమనం కల్గిస్తామని చెప్పారు. కొత్తగా నేషనల్ డీప్ వాటర్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్‌ను ప్రారంభించినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. దేశ యువత సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వైపు దృష్టి పెట్టాలని సూచించారు. విదేశీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై మనం ఎందుకు ఆధారపడాలని ప్రధాని మోదీ హితవు పలికారు. చొరబాట్లు, అక్రమ వలసల కారణంగా జనాభా అసమానతల ప్రమాదాన్ని ప్రధానంగా ప్రస్తావించిన మోదీ.. జాతీయ భద్రతా సవాళ్లను అధిగమించేందుకు, ఐక్యత, సమగ్రతలను పెంచేందుకు, భారతీయ పౌరుల హక్కులను కాపాడేందుకు హైపవర్డ్ డెమోగ్రఫీ మిషన్‌ను ప్రకటించారు. అణు విద్యుత్తు ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని మోదీ తెలిపారు. కొత్తగా పది అణు విద్యుత్ కర్మాగారాలు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. రానున్న రెండు దశాబ్దాల్లో పదింతలకు పెంచేందుకు ఈ మిషన్ ఉపయోగపడుతుందని తెలిపారు.
ఆరెస్సెస్‌పై ప్రశంసల జల్లు
బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను ప్రధాని మోదీ ప్రశంసల్లో ముంచెత్తారు. త్వరలో వందేళ్ల ప్రస్తానాన్ని ఆరెస్సెస్ పూర్తి చేసుకోబోతున్నది. ఆరెస్సెస్‌ను ప్రపంచంలోనే అతి పెద్ద స్వచ్ఛంద సంస్థగా మోదీ అభివర్ణించారు. జాతి నిర్మాణంలో వందేళ్లుగా ఆ సంస్థ పాత్ర పోషించిందని కొనియాడారు. ‘ఈ రోజు నేను గర్వంగా చెబుతున్నాను. వందేళ్ల క్రితం ఒక సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆవిర్భవించింది. వందేళ్లు దేశానికి సేవ చేయడం గర్వించదగిన విషయం. సువర్ణాధ్యాయం. వ్యక్తిత్వ నిర్మాణంతో దేశ నిర్మాణం అనే సంకల్పంతో పనిచేస్తున్నదన్నారు. భారత మాత సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్నదని, స్వయం సేవకులు తమ జీవితాలను మాతృభూమి సంక్షేమం కోసం అంకితం చేశారని కొనియాడారు.