ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో ప్రాణహాని..కొడుకు సంచలన ఆరోపణలు

ప్రేమ వివాహాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వల్ల తనకు, తన కాబోయే భార్య కుటుంబానికి ప్రాణహాని ఉందని కుమారుడు సంతోష్ గౌడ్ ఆరోపించి పోలీసు రక్షణ కోరారు.

నా తండ్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో నాకు ప్రాణహాని ఉందంటూ కుమారుడు సంతోష్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. నేను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడం ఇష్టం లేక మమ్నల్ని చంపాలని చూస్తున్నాడని సంతోష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. శ్రేస్య అనే యువతి, నేను ప్రేమించుకున్నామని, మా ప్రేమ పెళ్లికి అంగీకరించాలని తండ్రిని కోరగా అయిష్టంగానే ఒప్పుకున్నాడని, తాను యువతితో జూలై 8న నిశ్చితార్ధం కూడా చేసుకుని వారి ఇంట్లోనే ఉండటం జరుగుతుందని మీడియాకు వెల్లడించాడు.

మా ప్రేమను అంగీకరించలేకపోతున్న నా తండ్రైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన అనుచరులతో మేం ఉంటున్న ఇంటిపై దాడి చేయించారని, అప్పుల వాళ్లను ఎగదోసి తగాదాలు పెట్టించాడని, నన్ను, నా కాబోయే భార్యను, ఆమె తల్లిని చంపేందుకు ప్రయత్నిస్తున్నారని సంతోష్ గౌడ్ ఆరోపించారు. మమ్మల్ని ఎప్పుడైనా చంపే పరిస్థితి ఉందని, ఎమ్మెల్యేగా నా తండ్రి తన పలుకుబడితో పోలీసులను, వ్యవస్థలను మేనేజ్ చేసే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు, తనకు కాబోయే భార్య కుటుంబానికి ప్రాణహాని ఉందని పేర్కొంటూ, వెంటనే పోలీసు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ ప్రేమ వ్యవహారం ఫోక్సో కేసు వరకు వెళ్లిన వివాదం మరువకముందే.. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కొడుకు ప్రేమ వ్యవహారం రచ్చకెక్కడం ఆసక్తికరంగా మారింది.

Latest News