Mohammed Shami: మహ్మద్ షమీ ఓ క్రిమినల్.. పాపం చేశాడు: మౌలానా ఫైర్! నెటిజన్స్ కౌంటర్

విధాత, వెబ్ డెస్క్: టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమి (Mohammed Shami) ఓ క్రిమినల్ (Criminal)అంటూ ముస్లిం మత పెద్ద ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాబుద్ధీన్ రజ్వీ (Maulana Shahbuddin Razvi) ఫైర్ అయ్యాడు. రంజాన్ మాసంలో ఉపవాసం చేయకపోవడంపై ఆయన షమీని తప్పుబట్టారు. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా బౌలింగ్ స్క్వాడ్ లో ప్రధాన పేసర్ గా షమీ కీలకంగా వ్యవహరిస్తున్నారు. దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా vs ఆస్ట్రేలియా సెమీ-ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మహ్మద్ షమీ ఎనర్జీ డ్రింక్ తాగుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీనిపై ముస్లిం మతపెద్ధలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంజాన్ మాసంలో ముస్లింలు రోజా (ఉపవాస దీక్ష)లో భాగంగా నీళ్లు కూడా తాగరు. కాని షమి మ్యాచ్‌లో నీళ్లు తాగడం మౌలానా షాబుద్ధీన్ రజ్వీ ఆగ్రహానికి కారణమైంది. ఇస్లాంలో ఖచ్చితంగా రోజా(ఉపవాసం) పాటించాలని.. ఆరోగ్యవంతమైన పురుషుడు, మహిళలు ఒకవేళ ఉపవాసం ఉండకపోతే పెద్ధ పాపం చేసినట్లేనని స్పష్టం చేశాడు.
మహ్మద్ షమి మ్యాచ్ సందర్భంగా నీళ్లు, ఇతర పానీయాలు తాగాడని..అది అందరూ చూశారన్నారు. మ్యాచ్ ఆడుతున్నాడంటే అతను ఆరోగ్యంగా ఉన్నట్లేనని.. అయినప్పటికి అతను ఉపవాసం ఉండలేదని.. ప్రపంచమంతా అతన్ని చూసిందని.. ఇది తప్పుడు సందేశం అందిస్తుందని.. ఉపవాసం పాటించకుండా షమి నేరం చేశాడని మౌలానా షాబుద్ధీన్ రజ్వీ మండిపడ్డారు. షరియత్ ప్రకారం అతడో క్రిమినల్.. అతడు దేవుడికి సమాధానం చెప్పాలని రజ్వీ వ్యాఖ్యానించారు.
రజ్వీ వ్యాఖ్యలపై విమర్శలు
టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీని ఉద్దేశించి అల్ ఇండియా ముస్లిం జమాత్ చీఫ్ మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ చేసిన విమర్శల పట్ల క్రీడాభిమానులు, నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. దేశం కోసం అడుతున్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, మతాన్ని ఆపాదించడం సరైనది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు, బీజేపీ నేత ముఖార్ అబ్బాస్ నఖ్వీ జమాత్ చీఫ్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. కొందరు మనుషులు ” ఫత్వాలు జారీ చేసే దుకాణాలు” తెరుస్తున్నారు. కూరగాయల వలే ఫత్వాలను అమ్ముతున్నారు. అయితే, ఎవరూ కూడా వారి ఫత్వాలను కొనడం లేదు. వారంతా మూర్ఖులు” అని అన్నారు. షమిపై రజ్వీ చేసిన విమర్శలను పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు.