Under-14 Cricket Selections : ఐపీఎల్ తెచ్చిన క్రేజ్.. అండర్-14 సెలక్షన్ కు క్యూలైన్స్

ఐపీఎల్ ప్రభావంతో క్రికెట్ క్రేజ్ పెరిగింది. హైదరాబాద్‌లో అండర్-14 సెలక్షన్స్ కోసం యువ క్రికెటర్లు, తల్లిదండ్రులు బారులు తీరారు. నిర్వహణపైనా అసంతృప్తి వ్యక్తం.

Under-14 Cricket Selections : ఐపీఎల్ తెచ్చిన క్రేజ్.. అండర్-14 సెలక్షన్ కు క్యూలైన్స్

విధాత : భారత్ లో క్రికెట్ కు మొదటి నుంచి ఆదరణ ఎక్కువే. ఎంతగా అంటే పల్లెల్లో పొలాల గట్ల వెంట కూడా క్రికెట్ ఆడే యువతను చూస్తుంటాం. క్రికెట్ ఆటను చూసే కోట్లాది మంది జనాభా ఉన్న దేశంలో గతంలో ఈ ఆటను ప్రొఫెషనల్ గా ఎంచుకుని శిక్షణతో జాతీయ జట్టులో ఎంపిక కోసం పోటీపడే యువత పరిమితంగా ఉండేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. దేశంలో ఐపీఎల్ టోర్నమెంట్ రాకతో క్రికెట్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఐపీఎల్ జట్ల యాజమాన్యాలు క్రికెటర్లను వేలం పాటలో కోట్లు పోసి కొనుగోలు చేస్తుండటంతో..క్రికెట్ అంటే కేవలం జాతీయ జట్టు మాత్రమే అన్న ఆలోచనలు తొలగిపోయాయి.

ఐపీఎల్ జట్లకు సెలక్టయినా చాలు..క్రేజ్ తో పాటు డబ్బు కూడా సంపాదించవచ్చన్న ఆలోచనతో క్రికెట్ ను ప్రొఫెషన్ గా ఎంచుకుని సీరియస్ గా సాధన చేసే వారు పెరిగిపోయారు. లక్కు చిక్కితే..ఐపీఎల్ దారిలో కోట్ల జాక్ పాట్ కొట్టేయవచ్చన్న ఆలోచన క్రికెట్ పట్ల యువతలో, తల్లిదండ్రుల్లో ఆసక్తి పెంచేసింది. ఇందుకు నిదర్శనమన్నట్లుగా తాజాగా హైదరాబాద్ లో జరిగిన అండర్ -14 సెలక్షన్స్ ప్రక్రియ నిదర్శనంగా నిలిచింది.

అండర్ -14 సెలక్షన్స్ కోసం బారులు

సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో నిర్వహించిన అండర్ -14 సెలక్షన్స్ కోసం యువ క్రికెటర్లు..వారి తల్లిదండ్రులతో కలిసి బారులు తీరారు. జింఖానా గ్రౌండ్ వద్ద ఉదయం నుంచి ఎండలో నిరీక్షిస్తూ వారంతా తమ వంతు కోసం ఆశగా ఎదురు చూపులు పడ్డారు. అనూహ్యంగా వచ్చిన అంతమంది యువ క్రికెటర్లను, తల్లిదండ్రులను చూసిన నిర్వాహకులు, సెలక్షన్ కమిటీ సభ్యులు ఆశ్చర్యపోయారు. వారిని నియంత్రించడంలో తంటాలు పడ్డారు. భారీ సంఖ్యలో యువ క్రికెటర్లు, తల్లిదండ్రులు సెలక్షన్స్ కు హాజరైన తీరు…స్టార్ హీరో కొత్త సినిమా విడుదల తొలి రోజు థియేటర్ల వద్ద బారులు తీరే అభిమానుల సందడిని తలపించిందని నిర్వాహకులు చమత్కరించారు.

అయితే ఎండల్లో గంటల తరబడి క్యూలైన్లలో నిలబెట్టి తమను కనీసం గ్రౌండ్ లోకి వెళ్లేందుకు కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం ఏమిటని యువ క్రికెటర్లు, తల్లిదండ్రులు మండిపడ్డారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ వ్యవహారం అంతా రాజకీయాలు, అవినీతి రొచ్చులో కూరుకుపోయిందంటూ విమర్శలు గుప్పించారు. తల్లిదండ్రుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సెలక్షన్ కమిటీ సభ్యులు నీళ్లు నమిలారు.

ఇవి కూడా చదవండి :

Prabhas | జపాన్‌లో భూకంపం.. ప్ర‌భాస్ ఎలా ఉన్నాడ‌ని ఫ్యాన్స్‌లో టెన్ష‌న్.. మారుతి క్లారిటీ
Snake Jumps In Air To Hunt Bird : షాకింగ్ వీడియో..ఆకాశంలో పక్షిని వేటాడిన పాము!