Mohanlal: మ‌మ్ముట్టీకి కొల‌న్ క్యాన్స‌ర్‌?.. శబరిమలలో మోహ‌న్‌లాల్‌ పూజలు! నెట్టింట ర‌చ్చ‌

  • By: sr    news    Mar 26, 2025 5:39 PM IST
Mohanlal: మ‌మ్ముట్టీకి కొల‌న్ క్యాన్స‌ర్‌?.. శబరిమలలో మోహ‌న్‌లాల్‌ పూజలు! నెట్టింట ర‌చ్చ‌

Mohanlal | Sabarimala | Mammootty

మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఇటీవల తన రాబోయే సినిమా ఎల్‌2 : ఎంపూర‌న్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా శ‌బ‌రిమ‌ల ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అయితే.. ఈ సంద‌ర్భంగా మ‌ల‌యాళ స‌హ‌చ‌ర న‌టుడు మ‌మ్ముట్టి పేరిట ప్ర‌త్యేకంగా అర్చ‌న‌లు చేయించ‌డం ఆస‌క్తి రేపింది. మ‌మ్ముట్టి కొల‌న్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నాడ‌ని వ‌దంతులు వినిపిస్తున్నాయి. అందుకోస‌మే మోహ‌న్‌లాల్ పూజ చేయించాడ‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో గిట్ట‌నివాళ్లు దీనిని వివాదం చేసేందుకు కూడా ప్ర‌య‌త్నించారు. ముస్లిం అయిన మ‌మ్ముట్టి పేరుతో పూజ‌లు నిర్వ‌హించినందుకు మోహ‌న్‌లాల్ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని కొంద‌రు డిమాండ్ చేశారు.

శ‌బ‌రిమ‌ల ఆల‌యానికి మార్చి 18న‌ వెళ్లిన మోహ‌న్‌లాల్‌.. అక్క‌డి అర్చ‌కుల‌కు ఒక కాగితంపై మ‌మ్ముట్టి అస‌లు పేరైన ముహ‌మ్మ‌ద్ కుట్టి, అత‌ని జ‌న్మ న‌క్ష‌త్రం వైశాఖం అని రాసి, ఆయ‌న పేరు మీద పూజ చేయాల‌ని కోరాడు. దేవ‌స్థానంలో ఈ మేర‌కు తీసుకున్న రిసిప్ట్ ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. కొంద‌రు మోహ‌న‌ల్‌లాల్ గొప్ప‌త‌నంగా, అద్భుత‌మైన మ‌త సామ‌ర‌స్యానికి సంకేతంగా ప‌రిగ‌ణిస్తే.. మ‌రికొంద‌రు మాత్రం హిందూ పూజ‌ల్లో ముస్లింల పేరు ప్ర‌స్తావ‌న చేయ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. త‌న పేరిట పూజ‌లు నిర్వ‌హించాల‌ని మోహ‌న్‌లాల్‌ను మ‌మ్ముట్టి కోరిన‌ట్ట‌యితే అందుకు ఆయ‌న క్ష‌ప‌మాణ చెప్పాల‌ని సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌, ఒక వార్తాప‌త్రిక మాజీ ఎడిట‌ర్ ఓ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ఇస్లాం బోధ‌న‌ల ప్ర‌కారం ఇస్లాంను అనుసరించే వారు అల్లాను త‌ప్ప వేరెవ‌రినీ ప్రార్థించ‌కూడ‌ద‌నేది ఆయ‌న వాద‌న‌.

దీనిపై మోహ‌న్‌లాల్ గ‌ట్టిగానే రిటార్టిచ్చారు. సోష‌ల్ మీడియాలో త‌న‌పై, మ‌మ్ముట్టిపై ట్రోలింగ్ చేస్తున్న‌వారిపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. చెన్నైలో ఒక ఈవెంట్ సంద‌ర్భంగా మాట్లాడిన మోహ‌న్‌లాల్‌.. ‘ఆయన కోసం ప్రార్థించడంలో తప్పేముంది? ఆయ‌న బాగానే ఉన్నారు. ఏదో చిన్న ఆరోగ్య స‌మ‌స్య త‌లెత్తింది. అది ఎవ‌రికైనా స‌హ‌జ‌మే. దాని గురించి ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు’ అన్నారు. అంతేకాదు.. మమ్మూట్టి తనకు సోదరుడితో సమానమని చెప్పారు. పూజల కోసం ఇచ్చిన రిసిప్ట్‌ను దేవస్థానం బోర్డులో ఎవరో సోషల్ మీడియాకు లీక్ చేశారని ఆయన విమర్శించారు. అయితే.. రిసిప్ట్‌ను లీక్ చేశారన్న మోహన్‌లాల్ వ్యాఖ్యలను దేవస్థానం అధికారులు ఖండించారు. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఇదిలా ఉంటే.. శబరిమలలో పూజలు చేయడానికి ముందు మమ్ముట్టికి మోహన్‌లాల్ ఫోన్ చేశారని తెలుస్తున్నది. ప్రస్తుతం మమ్ముట్టి కొలన్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నాడని, చికిత్స నేపథ్యంలో తన వృత్తిపరమైన కమిట్‌మెంట్లకు కొంత విరామం ప్రకటించారని చెప్పుకొంటున్నారు. కానీ.. మమ్ముట్టి పీఆర్ టీమ్ మాత్రం ఈ వదంతులను కొట్టిపారేశారు. రంజాన్ నేపథ్యంలో ఉపవాస దీక్ష కారణంగా ఆయన సెలవులో ఉన్నారని పేర్కొన్నారు. రంజాన్ మాసం ముగియగానే మోహన్‌లాల్‌తో కలిసి నటిస్తున్న మహేశ్ నారాయణ్ రూపొందిస్తున్న సినిమా చిత్రీకరణలో పాల్గొంటారని వివరణ ఇచ్చారు. ఎల్‌2: ఎంపురాన్ చిత్ర ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ప్ర‌స్తుతం మోహ‌న‌ల్‌లాల్‌.. స‌హ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్‌తో క‌లిసి ఢిల్లీలో ఉన్నారు.