ఆపరేషన్ సిందూర్.. కీలక ఉగ్రవాదులు హతం! జాబితా ఇదే

  • By: sr    news    May 10, 2025 5:50 PM IST
ఆపరేషన్ సిందూర్.. కీలక ఉగ్రవాదులు హతం! జాబితా ఇదే

విధాత, న్యూ ఢిల్లీ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆర్మీ మే 7వ తేదీన నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దాడుల్లో హతమైన లష్కరే తొయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదుల వివరాలు తాజాగా ఓ ఆంగ్ల మీడియాలో వెల్లడయ్యాయి. పాక్, పీవోకేలలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ జరిపిన దాడుల్లో దాదాపు 100మంది ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే. ఇందులో పలువురు కీలక ఉగ్రవాదులు ఉన్నారు. తాజాగా వెల్లడైన జాబితాలో చనిపోయిన వారిలో జైష్ మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ ఇద్దరు బావమరుదులతో పాటు లష్యరే తొయిబాకు చెందిన కీలక ఉగ్రవాది సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారు.

లష్కరే తొయిబాకు చెందిన కీలక ఉగ్రవాది ముదస్సర్ ఖదాయిన్ ఖాస్ అలియాస్ అబు జుండాల్ హతమవ్వగా ఇతని అంత్యక్రియలను పాక్ ఆర్మీ లాంఛనాలతో నిర్వహించింది. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ అబ్ధుల్ రౌఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఆంత్యక్రియలకు పాక్ ఆర్మీ చీఫ్, పంజాబ్ ప్రావీన్స్ పోలీస్ సీఎం, ఐజీలు హాజరైనట్లుగా గుర్తించారు.
ఇక భారత దాడులలో హతమైన హఫీజ్ మహ్మద్ జమీల్ జైష్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ పెద్ద బావమరిది. ఈ ఉగ్రసంస్థలో హఫీజ్ కీలక సభ్యుడు. మసూద్ అజార్ మరో బావమరిది మహ్మద్ యూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్ జీ కూడా జైషే ముఠాలో కీలకంగా ఉన్నాడు. ఇతను కాందహార్ విమాన హైజాక్ ఘటనలో ప్రధాన నిందితుడు.

మరో ఉగ్రవాది ఖలీద్ అలియాస్ అబు అకాస లష్కరే తొయిబా కు చెందిన ప్రముఖుడు. ఇతని అంత్యక్రియలకు కూడా పాక్ ఆర్మీ అధికారులు హాజరయ్యారు. ఖలీద్ జమ్మూకశ్మీర్ లో పలు ఉగ్రదాడులలో కీలక పాత్ర వహించడంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయుధాల స్మగ్లింగ్ కొనసాగించేవాడు. మరో ఉగ్రవాది మహమ్మద్ హసన్ ఖాన్ జైషే మహ్మద్ సంస్థలో కీలక సభ్యుడు. పీవోకేలోని జైషే ఆపరేషనల్ కమాండర్ ముఫ్తి అస్గర్ ఖాన్ కశ్మీరీ కుమారుడు. జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులను పంపించడంలో కీలకంగా పనిచేశాడని సమాచారం.