సరిహద్దుల దిశగా పాక్ సైన్యం.. 26చోట్ల పాక్ డ్రోన్ల కూల్చివేత‌

  • By: sr    news    May 10, 2025 2:04 PM IST
సరిహద్దుల దిశగా పాక్ సైన్యం.. 26చోట్ల పాక్ డ్రోన్ల కూల్చివేత‌

విధాత, న్యూఢిల్లీ: పాకిస్తాన్ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతుందని భారత విదేశాంగ శాఖ, భారత ఆర్మీ వెల్లడించింది. శనివారం విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రీ, ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి, వైమానిక దళం వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ లు మీడియా సమావేశంలో ఆపరేషన్ సిందూర్.. భారత్ పాక్ పరస్పర దాడుల వివరాలను తెలియచేశారు. కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ పాక్ సైన్యం సరిహద్దుల వద్ద చొచ్చుకువస్తుందని..దీంతో పరిస్థితి మరింత జఠిలంగా మారుతుందని పేర్కొన్నారు. పశ్చిమ సరిహద్దుల్లో పాక్ నిరంతరం డ్రోన్లు, లాయిటరీ మ్యూనిషన్ ఫైటర్ జెట్ లను వాడి భారత మిలటరీ స్ధావరాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రార్థన మందిరాలపై దాడులకు పాల్పడుతుందని తెలిపారు.

అయితే పాక్ దాడులకు భారత్ తిప్పికొట్టిందన్నారు. అయితే 26చోట్ల పాక్ ఆయుధాలు భారత గగనతలంలోకి చొచ్చుకొచ్చాయని..ఉదంపూర్, భుజ్, పఠాన్ కోట్, భఠిండా వైమానిక స్థావరాల్లోని పరికరాలను ధ్వంసం చేసి..సిబ్బందిని గాయపరిచాయని తెలిపారు. అలాగే పాక్ హైస్పీడ్ మిస్సైల్స్ తో పంజాబ్ వాయుసేనా స్థావరాలపై దాడులు చేసిందని, శ్రీనగర్, అవంతిపుర, ఉదంపూర్ లలో ఆసుపత్రులపై దాడులకు పాల్పడిందని ఇది పూర్తిగా రెచ్చగొట్టే చర్య అని పేర్కొన్నారు.

పాక్ సైనిక స్థావరాలను ధ్వంసం చేశాం

పాక్ దాడులను భారత బలగాలు దీటుగా అడ్డుకోవడంతో పాటు పాక్ లోని మిలటరీ స్థావరాలు, రాడార్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లపై దాడులు కొనసాగించామని ఖురేషి తెలిపారు. రఫీకీ, చక్లాల, రహిమ్ యార్ ఖాన్, మురిద్, సుక్కుర్, చునియన్ స్థావారాలలో ఫైటర్ జెట్లతో ఖచ్చిత లక్ష్యాలను ఛేదించే ఆయుధాలను వాడి దాడులు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. సియాల్ కోట్ లోని ఏవీయేషన్ బేస్ ను, పస్రూర్ లో రాడార్ కేంద్రాన్ని ధ్వంసం చేశామని, తమ దాడుల సందర్భంగా పాక్ పౌరుల ప్రాణాలకు హానీ కల్గకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. భారత సైనిక స్ధావరాలు ధ్వంసం చేసినట్లుగా పాక్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ తమ స్థావరాలు సురక్షితంగా ఉన్నాయని వైమానిక దళం వింగ్ కమాండ్ వ్యోమికా సింగ్ డేట్ టైమ్ తో ఉన్న వీడియోలు, ఫోటోలు విడుదల చేశారు.

పాక్ అసత్య ప్రచారం

విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. భారత్ లోని కీలక సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లుగా పాక్ ఆర్మీ దుష్ప్రచారం చేస్తుందని ప్రజలు ఇటువంటి ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. భారత్ లోని 26ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులకు పాల్పడిందని..డ్రోన్లు, లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాప్టులతో దాడులకు పాల్పడుతుందని వివరించారు. ఉదంపూర్ లోని ఎస్ 400, బ్రహ్మోస్ మిస్సైల్ డిపో, ఇతర ఎయిర్ ఫీల్డ్ లు అన్ని ధ్వంసం చేసినట్లుగా పాక్ ప్రచారం చేసిందని..అవన్ని సురక్షితంగా ఉన్నాయని మిస్రీ ప్రకటించారు.