పవన్ కళ్యాణ్ గన్ సరెండర్ వెనుక అసలు కథ ఎంటీ ?

పవన్ కళ్యాణ్ గన్ సరెండర్ అంశం మరోసారి రాజకీయ చర్చకు దారి తీసింది. అప్పట్లో గన్ సరెండర్ వెనుక అసలు కారణం ఏమిటి? తాజా వ్యాఖ్యలతో ఎందుకు వివాదం చెలరేగింది? తెలుసుకోండి.

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా హైదరాబాద్ లో పార్టీ తలపెట్టిన తెలంగాణ నవనిర్మాణ సభ అనుమతి నిరాకరణపై స్పందిస్తూ పెట్టిన ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. పవన్ చెప్పిన మాటల్లో ఇప్పుడు ఓ అంశం హాట్ టాపిక్ గా మారింది. ప్రెస్ మీట్ లో నేను వైఎస్సార్ ఉన్నప్పుడే నా తుపాకీని సరెండర్ చేసి రాజకీయాల్లోకి వచ్చాను అని, నేను వైఎస్సార్ బెదిరింపులకే భయపడలేదంటూ చెప్పుకొచ్చాడు. నిజానికి పవన్ అప్పట్లో తన తుపాకీని ఎందుకు సరేండర్ చేయాల్సి వచ్చిందన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పవన్ నిజంగా వైఎస్సార్ బెదిరింపులకు కౌంటర్ గా తన తుపాకీ సరెండర్ చేశారా? లేక మరెదైనా కారణం ఉందా అన్న చర్చ నెట్టింటా కొనసాగుతుంది.

అసలు వాస్తవం ఎంటీ ?

పవన్ కల్యాణ్ అప్పట్లో తుపాకీ సరెండర్ చేయడం వెనుక అసలు కథను ఇప్పుడు వైఎస్సార్ అభిమానులు, వైసీపీ నాయకులు వీడియోలతో సహా గుర్తు చేస్తున్నారు. తుపాకీ సరెండర్ సందర్బంగా పవన్ మాట్లాడిన మాటల మేరకు…
మా అన్న చిరంజీవి కూతురు “శ్రీజ ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ, మా కుటుంబం నుండి ప్రాణహాని ఉందంటూ మీడియా ముందుకు రావడం నన్ను తీవ్రంగా బాధించింది. నాకు ఎలాంటి ప్రైవేట్ సైన్యాలు, రౌడీ మూకలు లేవు. నేను నా గన్‌ను సరెండర్ చేస్తున్నా. 1998లో మద్రాస్ రైఫిల్ క్లబ్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఈ లైసెన్స్‌డ్ గన్ తీసుకున్నాను. కొత్త జంటకు మా నుండి ఎలాంటి హానీ జరగదని నేను హామీ ఇస్తున్నాను” అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీడియాతో 2007లో మాట్లాడారు.

ఆ తర్వాత చిరంజీవి కూడా స్పందిస్తూ.. తండ్రిగా నా కూతురి నిర్ణయం నాకు షాక్ ఇచ్చినప్పటికీ, నా కుమార్తె ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వివాదాన్ని ముగించారు. కాలక్రమేణా శ్రీజ, శిరీష్ భరద్వాజ్ మధ్య విభేదాలు రావడంతో 2011లో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శ్రీజ తిరిగి మెగా కుటుంబం చెంత‌కు చేరింది. దురదృష్టవశాత్తూ శిరీష్ భరద్వాజ్ జూన్ 2024లో ఊపిరితిత్తుల సమస్యతో మరణించారు.

పవన్ మాటల మేరకు..కుటుంబంలో జరిగిన ఒక అంతర్గత సమస్య, ఆరోపణల నేపథ్యంలో ఆనాడు పవన్ కళ్యాణ్ ఆత్మరక్షణ కోసం తీసుకున్న గన్‌ను సరెండర్ చేశారు. కానీ నేడు రాజకీయ వేదికలపై దాన్ని ప్రస్తావిస్తూ.. తాను వైఎస్సార్ హయాంలోనే గన్ సరెండర్ చేసి రాజకీయాల్లోకి వచ్చానని, నాడే వైఎస్సార్ ను ఎదిరించానని చెప్పుకోవడంపై విడ్డూరంగా ఉందంటూ రాజకీయ వర్గాలు, విశ్లేషకులు భావిస్తున్నారు.

కుటుంబంలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటనను, మీడియా ట్రోలింగ్‌ను తట్టుకోలేక చేసిన గన్ సరెండర్ వ్యవహారాన్ని.. నేడు ఏదో వైఎస్సార్‌ను ఎదిరించడానికి చేసిన వీరకృత్యంగా కలరింగ్ ఇవ్వడం నేటి తరానికి తప్పుడు సంకేతాలు పంపడమే అవుతుందని వైసీపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నాయి. రాజకీయ పలకుబడి కోసం, క్యాడర్‌లో సెంటిమెంట్ రగల్చడం కోసం ఇలాంటి నాటి పాత కథలను వ‌క్రీక‌రించి మ‌రీ వాడుకోవ‌డం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నిస్తున్నారు.

Latest News