Tirumala | శ్రీవారికి తలనీలాలు సమర్పించి.. అన్నదానం చేసిన పవన్ కల్యాణ్ సతీమణి

విధాత: సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంతో తన కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి కొణిదెల అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు లెజినోవా టీటీడీ డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. సామాన్య భక్తులతో కలిసి పద్మావతి కళ్యాణకట్టలో తలనీలాల సమర్పించారు. తమ కుమారుడి ఆరోగ్యం బాగుంటే శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధికి వచ్చి తలనీలాలు ఇస్తానన్న మొక్కులో భాగంగా అన్నా కొణిదెల తలనీలాలు సమర్పించుకున్నారు.
సోమవారం వేకువజామున వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోని ప్రవేశించి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీమతి అన్నా కొణిదలకు వేద పండితులు వేదాశీర్వచనం అందించి, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద హారతులు ఇచ్చారు. స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.
అనంతరం తిరుమల శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి కుమారుడు మార్క్ శంకర్ పేరు మీద రూ.17 లక్షల విరాళం అందించారు. స్వయంగా భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. భక్తులతో కలసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.