Robert Vadra | రాజకీయల్లోకి రాబర్ట్ వాద్రా!

  • By: sr    news    Apr 14, 2025 8:17 PM IST
Robert Vadra | రాజకీయల్లోకి రాబర్ట్ వాద్రా!

Robert Vadra |

విధాత: రాజకీయాల్లోకి వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కోరితే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. పార్లమెంటులో విభజన శక్తులకు వ్యతిరేకంగా నిలబడేందుకు మరొన్నొ గొంతుకలను తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తే రాజకీయ ప్రపంచంలోకి తాను అడుగు వేస్తానని తెలిపారు. ‘నేను రాజకీయాల్లో ఉండాలని కాంగ్రెస్ భావిస్తే నా కుటుంబం ఆశీర్వాదంతో ఆ అడుగు వేయాలని భావిస్తున్నా’ అని మీడియాతో అన్నారు. తన భార్య ప్రియాంక, తన బావ రాహుల్ గాంధీ వల్ల రాజకీయాలపై తనకు అవగాహన పెరిగిందని చెప్పారు. వాళ్లు పార్లమెంట్‌లో చాలా చక్కగా పనిచేస్తున్నారని.. నేను ఎప్పుడూ ప్రియాంక పార్లమెంట్‌లో ఉండాలని కోరుకున్నానని.. ఇప్పుడు ఆమె ఎంపీగా ఉందని.. చాలా కష్టపడి పనిచేస్తోందని వాద్రా చెప్పుకొచ్చారు.

గాంధీ కుటుంబంలో సభ్యుడిని కావడం వల్లనే తనను పలు పార్టీలు రాజకీయాల్లోకి లాగుతున్నాయని రాబర్ట్ వాద్రా ఆరోపించారు. చాలా కాలంగా చాలా పార్టీలు తన పేరును వాడుకుంటున్నాయని విమర్శించారు. ‘ప్రతిసారీ ఎన్నికలప్పుడు వారికి నా పేరు గుర్తుకు వస్తుంది. వారు తప్పు చేయాలనుకునే ప్రతిసారీ నా పేరును ప్రతీకార రాజకీయాలక కోసం గుర్తు చేసుకుంటారు’ అని అన్నారు.

బ్యాంక్‌ రుణాల ఎగవేత కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి, దేశం నుంచి పారిపోయిన వ్యాపారవేత్త మెహుల్ ఛోక్సీని బెల్జియంలో అరెస్ట్‌ చేయడంపై రాబర్ట్ వాద్రా తనదైన రీతిలో స్పందించారు. మెహుల్‌ను అరెస్ట్ చేయడం మన ‘దేశానికి చాలాపెద్ద విషయం’. అయితే అరెస్ట్ చేయడం ముఖ్యమైనదే అయినప్పటికీ, అతను దోచుకున్న సొమ్మును తిరిగి వసూలు చేయడం, నష్టపోయిన వ్యక్తులకు తగిన విధంగా పరిహారం అందించడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం దీనిపై ఆలోచన చేయాలన్నారు. నీరవ్ మోదీ సహా, ఆర్థిక నేరస్థులను తిరిగి భారతదేశానికి రప్పించాలని.. నష్టపోయిన ప్రజలకు పరిహారం అందించేలా చూడాలి’ అని రాబర్ట్ వాద్రా డిమాండ్ చేశారు.