త్యాగరాయ గానసభలో.. పురాణపండ విష్ణు సహస్రనామ గ్రంధం ఉచితం

త్యాగరాయ గానసభలో.. పురాణపండ విష్ణు సహస్రనామ గ్రంధం ఉచితం

  • By: raj |    news |    Published on : Jan 06, 2026 10:51 AM IST
త్యాగరాయ గానసభలో.. పురాణపండ విష్ణు సహస్రనామ గ్రంధం ఉచితం

సికింద్రాబాద్: ఈ దేశంలో అన్ని భాషల్లోనూ , అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు , మఠాలు , దేవస్థానాలు , ధార్మిక మండళ్ళూ , ట్రస్ట్ లు, ధార్మిక పరిషత్ లూ ఉన్నాయి . అయితే .. వీటిల్లో నలభైశాతం సంస్థలకు కోట్లాది రూపాయల నిధులున్నా ఆ యా సంస్థలు పవిత్ర ధార్మిక ఆధ్యాత్మిక గ్రంధాల ప్రచురణ, విక్రయాలను వ్యాపారాత్మకంగా చేస్తున్నాయనేది మనకన్నులముందు కనిపిస్తున్న కఠిన సత్యం. ఏమైనా అడిగితే గుడులూ, గోపురాలు.. ఆశ్రమాల డెవలప్మెంట్ కి అని ఎన్నో విషయాలతో దాటవేస్తారు. కనీసంలో కనీసంగా కూడా ఉచితంగా దైవీయ గ్రంధాలను ఉచితంగా ఇవ్వరు గాక ఇవ్వరు. అవకాశం ఉన్నా కూడా తొంభైశాతం ఇవ్వవు సరికదా కరపత్రాలో, బ్రోచెర్లో ఉచితంగా చేతుల్లో పెడతారు. అయితే జీవితంలో అడుగడుగునా కష్టాల కడలిలో పెనుతుఫాన్ లు ఎదుర్కొన్న పురాణపండ శ్రీనివాస్ అనే ఒక ప్రముఖ రచయిత, అమోఘమైన నాలెడ్జి తో సంచరించే అద్భుత వక్త , తనకి కీడు చేసిన వారికి కూడా మేలు చేసే ఒక మంత్ర పరిమళం లాంటి అక్షరచైతన్యం సుమారు ఇరవై ఏళ్లుగా చేస్తున్న నిస్వార్ధ ధార్మిక ఆధ్యాత్మిక సేవతో పాటు మనస్సుని గాఢ రస భక్తితో హత్తుకునే అందమైన భాషాశైలికి వేల కొలది ఫాన్స్ హాట్స్ ఆఫ్ చెబుతుండటం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్.

దైవబలాన్ని మించిన మహాబలం సృష్టిలో లేదని ఢంకా బజాయించి మరీ చెప్పే పురాణపండ శ్రీనివాస్ భారతదేశ చరిత్రలో తొలిసారిగా అతి అరుదైన ఐదువందల ఆంజనేయ స్వామివార్ల శిల్పాలతో , వర్ణ చిత్రాలతో , మంత్ర తంత్ర యంత్ర విశేషాలతో , పరమ రమణీయ వ్యాఖ్యానాలతో రూపొందించిన ‘ నేనున్నాను ‘ అఖండ గ్రంధాన్ని భారతదేశ హోమ్ శాఖామంత్రి అమిత్ షా ఆవిష్కరించడం మూడేళ్లనాడు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని ఇప్పటికీ సాహితీ ప్రముఖులు , ఆధ్యాత్మిక వేత్తలు పురాణపండ శ్రీనివాస్ పై వేనోళ్ళ ప్రశంసలు వర్షించడం గమనార్హం. ఈ అఖండ గ్రంధాన్ని ఈగ వంటి సంచలనాత్మక చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నిర్మించి జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి ప్రచురించి ఇంచుమించుగా యావత్తు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దర్శక నిర్మాతలకు, ముఖ్య సాంకేతిక నిపుణులకు నాడు దీపావళి కానుకగా సమర్పించడం వారాహి చలన చిత్ర చరిత్రలో హైలైట్ గానే పేర్కొనాలి. ఆ తరువాత మంత్రశక్తుల మహా కలశంగా రచించి సంకలనీకరించిన మరో అద్భుత ‘ మహామంత్రస్య ‘ ఐదువందల ఇరవై పేజీల గ్రంధాన్ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించడం … తరువాత అమోఘ రచనా సంకలనాలుగా వెలువడిన ఏడు వందల పేజీల శ్రీపూర్ణిమ మంగళ గ్రంధాన్ని విఖ్యాత ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు ఆవిష్కరించి శ్రీనివాస్ ధైర్యం వెనుక అమ్మవారి అనుగ్రహం పుష్కలంగా ఉందని చెప్పారు.

పురాణపండ శ్రీనివాస్ లేఖిని నుండి జాలువారిన మరొక అపురూప వైదిక నిధుల నాలుగు వందల పేజీల గ్రంధం ‘ శ్రీమాలిక ‘ ఋషి వైభవం సృష్టిస్తున్న పవిత్ర సంచలనం ఇంతా అంతాకాదు. ఇప్పటికి ఇరవై ఐదు ఎడిషన్స్ అందిందంటే ఎంతటి గొప్ప గ్రంధమో తెలుస్తోందని యువతరం సైతం ఎక్కువ ఆసక్తి కనబరచడం మరొక విశేషంగానే పేర్కొనాలని హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో అధిక శాతం ముక్త కంఠంతో ఎలుగెత్తారు కూడా ! ఈ ఉత్సాహంలో ప్రధాన పాత్ర తీసుకున్న మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు , కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, శ్రీమతి భువనేశ్వరి దంపతులు సైతం అభినందించినట్లు మీడియా కోడై కూసింది. పరమపవిత్రమైన మరొక ముఖ్యాంశమేంటే ఈ శ్రీమాలిక వైదిక గ్రంధాన్ని కాంచీపురం యతీంద్రులు , కంచి కామకోటి పీఠం పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు ఆవిష్కరించి శ్రీనివాస్ పై అనుగ్రహాన్ని వర్షించటం ఒక ముఖ్య ఘట్టమే ! ఇలా ఎంతో ఎంతెంతో మహా వైభవం శ్రీనివాస్ చుట్టూ ఉండటం మామూలు విషయమా ! ఇలానే యుగే … యుగే , అమ్మణ్ణి , శరణు .. శరణు , నన్నేలు నా స్వామి , భద్రే … రుద్రే , శంకర…శంకర , జయం … జయం వంటి ఆర్ష వైభవ గ్రంధాలు వేల వేల పూజాపీఠాల ముందుకు చేరాయంటే శ్రీనివాస్ నిర్విరామ కృషికి దైవబలం ఎంతగా ఉందోనని ఆలయాల అర్చకులు పండితులు సైతం చెప్పుకోవడం కనిపిస్తుంది. వీటి వెనుక ఎంతోమంది స్పాన్సర్స్ సౌజన్య హృదయం కూడా ఉంది.

ఇప్పటి అంశం ఏమంటే … పచ్చ కర్పూరపు పలుకుల్లాంటి చక్కని అందమైన ముందుమాటలతో అందించిన శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రమ్, శ్రీ రామరక్షాస్తోత్రమ్ తో కూడిన పరమ భాగ్యాల శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రమ్ నూట ఇరవై ఎనిమిది పేజీల మల్టీ కలర్ గ్రంధాన్ని హైదరాబాద్ చిక్కడపల్లి లోని చారిత్రాత్మక త్యాగరాయగానసభ శ్రీ వైకుంఠ ఏకాదశినుండి వందల కొలది భక్తులకు ఉచితంగా పంచుతూనే ఉంది. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మనకి ఉపయోగపడతాడంటేనే విజిటింగ్ కార్డు కూడా ఆలోచించి ఇస్తున్న ఈరోజుల్లో ఒక బుక్ కాదు…. ఎన్నో విలువైన గ్రంధాలను రచించి, సంకలనీకరించి ఏ స్వార్ధం లేకుండా ఉచితంగా ఇవ్వడం ఒక్క పురాణపండ శ్రీనివాస్ కే చెల్లిందని , ఇది నిర్మాణాత్మకంగా కనిపిస్తోందని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ఎమ్. వెంకయ్య నాయుడు ఒక పుస్తకావిష్కరణ సభలో అన్నమాటలు ఉత్తుత్తిమాటలు కావని కఠిన సత్యాలని కాలం నిరూపిస్తూనే ఉండటం ఒక యదార్ధం. జంట నగరాల విష్ణు భక్తులూ త్యాగరాయగానసభ కార్యాలయంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర దివ్య గ్రంధాన్ని ఈ ఉగాది పర్వదినం వరకూ ఉచితంగా పొందవచ్చని త్యాగరాయగానసభ కార్యవర్గం సంతోషంతో ప్రకటించింది.