TTD: అన్ని రాష్ట్రాలు, దేశాల్లో ఆలయాలు.. టీడీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు

విధాత : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సోమవారం జరిగిన పాలక మండలి సమావేశంలో 2025-26వ సంవత్సరం వార్షిక బడ్జెట్‌ను రూ.5258.68 కోట్లతో మండలి ఆమోదం తెలిపింది. పాలకమండలిలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. వివాదానికి కారణమైన ముంతాజ్ హోటల్ నిర్మాణానికి వేరే చోట భూమి కేటాయించాలని సీఎం చంద్రబాబు టీటీడీని ఆదేశించారని తెలిపారు. అలిపిరి వద్ద ఉన్న 35.24 ఎకరాలతో పాటు 15ఎకరాల టూరిజం భూమిని టీటీడీ స్వాధీనం చేసుకొని.. ప్రత్యామ్నాయంగా 50ఎకరాల భూమిని మరో ప్రదేశంలో ప్రభుత్వానికి కేటాయిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబు సూచనలు మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని.. ఇప్పటికే పలువురు సీఎంలు ఆలయ నిర్మాణాలకు ఆమోదం తెలిపారని.. ఇంకా ఆమోదం తెలపని రాష్ట్రాల జాబితాను సీఎంకి ఇచ్చి.. చంద్రబాబు ద్వారా వారికీ లేఖలు రాస్తామన్నారు. మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా శ్రీవారి ఆలయాల నిర్మాణాలు చేస్తామని.. శ్రీవాణి ట్రస్టుతో పాటు నూతనంగా ఏర్పాటు చేయబోయే ట్రస్టు ద్వారా వచ్చే విరాళాలతో ఆలయాలను నిర్మిస్తామన్నారు. శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేకంగా కమిటీని నియమిస్తున్నామని, శ్రీవారి ఆస్తులకు సంబంధించి న్యాయస్థానాల్లో పెండింగ్ లో వున్న కేసులను త్వరగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
టీటీడీలో హిందువులే పని చేసేలా తీర్మానం చేశామన్నారు. టీటీడీలో అన్యమత ఉద్యోగస్తులను తొలగిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో పలు చోట్ల నిలిచిపోయిన దేవాలయాలను పునర్నిర్మించాలని నిర్ణయించామన్నారు. పోటు కార్మికులకు జీఎస్టీ భారం లేకుండా జీతం 43 వేలు చెల్లించేలా నిర్ణయించడంతో పాటు సైన్స్ సిటికి టీటీడీ కేటాయించిన 20 ఎకరాలు భూమిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. టీటీడీ ఉద్యోగులకు మూడు నెలలకు ఒక్క సారి సుఫథం ద్వారా దర్శనం జారీ చెయ్యాలని నిర్ణయించామన్నారు. లైసెన్స్ లేని హకర్ల నిర్మూలనకు రెవెన్యూ, విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్‌ల ఏర్పాటుపై అధ్యయనం చెయ్యడంతో పాటు విఐపి బ్రేక్ దర్శనాలు గతంలో లాగానే ఉదయం 6 గంటలకు ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
తిరుపతిలోని గంగమ్మ ఆలయం, తలకోన, కర్నూలు జిల్లాలో బుగ్గ, అనకాపల్లి లోని ఉపమాక, ధర్మవరం, కొడంగల్, సికింద్రాబాద్, కరీంనగర్‌లలో నూతనంగా ఆలయాలు నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. 180 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు జీత భత్యాల పెంపు పై కమిటీని నియమించామన్నారు. వికలాంగులు, వృద్ధులకు ఆఫ్‌లైన్లో టికెట్స్ జారీపై అధ్యయనం చెయ్యాలని అధికారులను ఆదేశించమన్నారు. గతంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో పాత ఆగమ సలహా మండలిని రద్దు చేసి.. త్వరలోనే నూతన కమిటీని నియమిస్తామన్నారు. శ్రీనివాసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి కోటి రూపాయలు నిధులు మంజూరు చెయ్యడంతో పాటు.. తిరుమలలోని 1500 గదుల మరమ్మతుల కోసం 26 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. గూగుల్ సంస్థ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని వినియోగిస్తామన్నారు.