Telangana: వడదెబ్బ.. రాష్ట్ర విపత్తు! మృతులకు ప్రభుత్వం రూ.4లక్షల పరిహారం

విధాత: వడదెబ్బను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విపత్తుగా గుర్తించింది. వడదెబ్బ మృతులకు అందించే నిధులను రూ.50వేల నుంచి రూ.4లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ డీఆర్ఎఫ్ నిధుల నుంచి బాధిత కుటుంబాలకు సహాయం అందించనుంది. ఎండలు దంచుకొడుతున్న సందర్భంలో ప్రభుత్వం వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా గుర్తించడంతో పాటు ఎక్స్ గ్రేషియాను పెంచడం ప్రజల నుంచి అభినందనలు వ్యక్తమవుతున్నాయి.
వడదెబ్బ మరణాల దృవీకరణ విధానాలు
వడదెబ్బ మరణాల దృవీకరణకు మండలానికి ఒక త్రిసభ్య కమిటీ ఉంటుంది. ఇందులో తహశీల్ధార్, ఎస్సై, వైద్యాధికారి సభ్యులుగా ఉంటారు. ఎవరైనా వడదెబ్బతో మరణిస్తే ముందుగా కమిటీకి సమాచారం అందించాలి. ఆ వ్యక్తి వడదెబ్బతో మృతి చెందినట్లు ముందుగా వైద్యాధికారి ధ్రువీకరించాలి. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తారు. పోస్టుమార్టం నివేదికను వైద్యాధికారి పోలీస్ స్టేషన్‌కు అందజేస్తే ఎఫ్‌ఐఆర్ ఆధారంగా వడదెబ్బ మృతిగా నిర్ధారిస్తారు. ఈ నివేదికను తహశీల్దార్ ద్వారా ఆర్డీఓకు అక్కడి నుంచి కలెక్టర్ కు పరిశీలనకు వెలుతుంది. కలెక్టర్ ఆ నివేదికను పరిశీలించిన తర్వాత పరిహారాన్ని బాధిత కుటుంబానికి విడుదల చేస్తారు. .
పోస్టుమార్టం తప్పనిసరి
వడదెబ్బతో మరణిస్తే తప్పనిసరిగా పోస్టుమార్టం నిర్వహించాలి. కేసు లేకుండా, పోస్టుమార్టం లేకుండా ఎలాంటి పథకం వర్తించదు. ఎక్కువగా వడదెబ్బకు రైతులు, రైతు కూలీలు, వృద్ధులు, కార్మికులు గురవుతున్నారు. వారు రోజంతా ఎండల్లో పనిచేస్తుండటంతో వారు వడదెబ్బ పట్ల జాగ్రత్తలు పాటించాల్సిఉంది.