Gautam Ghattamaneni: తాత‌కు త‌గ్గ మ‌నుమ‌డు..గౌత‌మ్! తండ్రినే మించి పోయేలా ఉన్నాడుగా.. యాక్టింగ్‌ వీడియో వైరల్‌

  • By: sr    news    Mar 21, 2025 1:46 PM IST
Gautam Ghattamaneni: తాత‌కు త‌గ్గ మ‌నుమ‌డు..గౌత‌మ్! తండ్రినే మించి పోయేలా ఉన్నాడుగా.. యాక్టింగ్‌ వీడియో వైరల్‌

Gautam Ghattamaneni:

విధాత: దివంగత సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ నట వారసత్వం మరో తరానికి చేరుతుంది. కృష్ణ తర్వాత ఆయన నట వారసుడిగా మహేశ్‌ బాబు విజయవంతంగా రాణించి స్టార్ హీరోగా ఎదిగి సూపర్ స్టార్ అనిపించుకున్నారు. ఇక ఇప్పుడు మహేష్ కుమారుడు ఘట్టమనేని గౌతమ్ కూడా సినిమాల్లో పూర్తి స్థాయి నటుడిగా రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నారు. న్యూయార్క్‌లో యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్న మహేశ్‌బాబు తనయుడు గౌతమ్‌ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నట శిక్షణలో భాగంగా ఓ యాక్ట్‌లో పాల్గొన్న గౌతమ్‌ ఎక్స్ ప్రెషన్స్ ఆకట్టుకున్నాయి. ఇది చూసిన మహేష్ అభిమానులు గౌతమ్‌ యాక్టింగ్‌కు ఫిదా అయ్యారు. గతంలో మహేష్ బాబు హీరోగా నటించిన “వన్ నేను ఒక్కడినే” సినిమాలో మహేష్ చిన్నప్పటి పాత్రలో గౌతమ్ బాల నటుడిగా నటించాడు. భవిష్యత్తులో పూర్తి స్థాయి నటుడిగా ఏంట్రీకి గౌతమ్ నటనలో రాటుదేలుతున్నాడు.

నట వారసత్వంలో వీరిదే జోరు

సినీ పరిశ్రమలో నట వారసత్వం కొనసాగించడంలో నందమూరి, అక్కినేని, ఘట్టమనేని, కొణిదెల, ఉప్పలపాటి, మంచు కుటుంబాలు ముందున్నాయి. రెండో తరం, మూడో తరం కూడా చలన చిత్ర రంగంలో రాణించడంలో నిమగ్నమయ్యారు. సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా బాలకృష్ణ, హరికృష్ణలు రాణించగా.. హరికృష్ణ కుమారులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు నందమూరి నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. త్వరలో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తెరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అక్కినేని నాగేశ్వర్ రావు నట వారసులుగా నాగార్జున, ఆయన కుమారులు నాగ చైతన్య, అఖిల్ లు కొనసాగుతున్నారు.

ఘట్టమనేని కృష్ణ నట వారసులుగా మహేష్ బాబు రాణిస్తుండగా, త్వరలో ఆయన కుమారుడు గౌతమ్ రాబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కొణిదెల ప్యామిలీ నుంచి ఆయన సోదరులు నాగబాబు, పవన్ కల్యాణ్ లతో పాటు కుమారుడు రామ్ చరణ్ లు నట వారసత్వం కొనసాగిస్తున్నారు. ఇక మంచు మోహన్ బాబు నట వారసులుగా మంచు విష్ణు, మనోజ్, మంచు లక్ష్మిలు కొనసాగుతుండగా.. తాజాగా భక్త కన్నప్ప ఈవెంట్ లో విష్ణు కొడుకు సినిమాల్లోకి వస్తాడని మోహన్ బాబు ప్రకటించారు. రెబల్ స్టార్ ఉప్పలపాటి కృష్ణంరాజు నట వారసుడిగా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్న సంగతి తెలిసిందే.