Bumrah: టీమ్‌ ఆఫ్‌ది ఇయర్‌ కెప్టెన్‌ బుమ్రా

  • By: sr    news    Jan 04, 2025 6:43 PM IST
Bumrah: టీమ్‌ ఆఫ్‌ది ఇయర్‌ కెప్టెన్‌ బుమ్రా

విధాత‌: టీమ్‌ ఇండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా(Jasprit Bumrah)కు అరుదైన గౌరవం లభించింది. ప్రతి ఏటా క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించే టీమ్ ఆఫ్ ది ఇయర్ కెప్టెన్‌గా భారత సూపర్ పేసర్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. బుమ్రాతో పాటు ఈ జట్టులో టీమిండియా యువ బ్యాటర్‌, ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌కు కూడా చోటు దక్కింది. ఈ కేలండర్ ఇయర్ లో బుమ్రా ఈ ఏడాది 84 వికెట్లు పడగొట్టాడు. అతడి తర్వాత రెండో స్థానంలో ఉన్న హసరంగ కేవలం 64 వికెట్లు మాత్రమే తీసుకోగా ఇద్దరి మధ్య 22 వికెట్ల తేడా ఉండటమే బుమ్రా సత్తా ఎంతో తెలుపుతుంది. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాను గెలిపించాడు. అంతేకాదు.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా తొలి మ్యాచ్‌లో జట్టుకు కెప్టెన్ గా పెర్త్‌ వికెట్‌పై ఏకంగా 295 పరుగుల భారీ విజయాన్ని అందించాడు.

ఈ సిరీస్‌ మొత్తంలో ఇప్పటి వరకు 30 వికెట్లను బుమ్రా పడగొట్టగా.. మరోవైపు ఆసీస్‌ సారథి కమిన్స్‌ కేవలం 20 వికెట్లనే తీసుకొన్నాడు. మ‌రోవైపు 2024 సీజన్‌లో జైస్వాల్‌ బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. మొత్తం 15 మ్యాచ్‌లు ఆడి 1478 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 214 పరుగులు. ఈ ఏడాది మూడు సెంచరీలు సహా 9 హాఫ్ సెంచరీలతో అత్యధిక పరుగులు చేసిన జో రూట్‌ తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ టీమ్ లో ఇంగ్లండ్ కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కగా ఆసీస్, భారత్, న్యూజిలాండ్ చెందిన ఇద్దరు శ్రీలంక, సౌతాఫ్రికాలకు చెందిన ఒక్కో ప్లేయర్ కు చోటు దక్కింది.

క్రికెట్‌ ఆస్ట్రేలియా 2024 జట్టు:

జైస్వాల్‌ (భారత్‌), బుమ్రా(కెప్టెన్‌), బెన్‌ డకెట్‌, జోరూట్‌, హారీ బ్రూక్‌ (ఇంగ్లండ్‌), రచిన్‌ రవీంద్ర, మాట్‌ హెన్రీ (న్యూజిలాండ్‌) కమింద్‌ మెండిస్‌ (శ్రీలంక) (న్యూజిలాండ్‌) , అలెక్స్‌ కేరీ, హేజిల్‌వుడ్‌ (ఆస్ట్రేలియా), కేశవ్‌ మహరాజ్‌ (దక్షిణాఫ్రికా).

 

ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ రేసులో

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ‘ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. ఇంగ్లండ్‌ ప్లేయర్లు జోరూట్‌, హారీ బ్రూక్‌, శ్రీలంక ఆటగాడు కమిందు మెండీస్‌.. బుమ్రాతో రేసులో నిలిచారు. మరోవైపు, ప్రతిష్టాత్మక ఐసీసీ అత్యుత్తమ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు ‘సర్‌ గ్యార్‌ఫీల్డ్‌ సోబర్స్‌ పురస్కారానికి’ కూడా జస్ప్రీత్ బుమ్రా నామినేట్ అయ్యాడు. ఈ అవార్డు రేసులో బుమ్రాతో పాటు జో రూట్, హ్యారీ బ్రూక్, ట్రావిస్‌ హెడ్ నిలిచారు. ఈ మేరకు నామినేట్ అయిన ఆటగాళ్ల పేర్లను ఐసీసీ ఇటీవల వెల్లడించింది.

రేటింగ్ లోనూ..

త‌న కెరీర్‌లోనే అద్భుత ఫాంలో దూసుకుపోతున్న భారత స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ ర్యాంకుల్లోనూ హవా కొనసాగిస్తున్నాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో నాలుగు టెస్టుల్లో 30 వికెట్లతో టాప్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్న బుమ్రా మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ బౌలర్ల ర్యాంకుల రేటింగ్‌లో ఆల్ టైమ్ మై రికార్డున్న అశ్విన్‌ను వెనక్కి నెట్టేశాడు. గతంలో అశ్విన్ అత్యుత్తమంగా 904 ఎలో రేటింగ్ పాయింట్లు సాధించాడు. ఇప్పుడు జస్‌ప్రీత్ బుమ్రా 907 పాయింట్లు సాధించి అశ్విన్‌ను అధిగమించి సరికొత్త రికార్డుతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్‌ 2016లో తన బెస్ట్‌ను నమోదు చేయగా.. తాజాగా బుమ్రా ఈ రికార్డును అధిగమించాడు. తాజాగా ప్రకటించిన ఐసిసి ర్యాంకుల్లో 907 పాయింట్లతో బుమ్రా తొలి స్థానంలో నిలవగా.. గత టెస్టులో ఆడని ఆసీస్‌ పేసర్ జోష్‌ హేజిల్‌వుడ్ (843) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. పాట్ కమిన్స్ (837), కగిసో రబాడ (832), మార్కో యాన్సెన్ (803) టాప్‌ -5లో చోటు దక్కించుకున్నారు.

దూసుకొచ్చిన నితీశ్ 

మెల్‌బోర్న్‌ టెస్టులో అద్భుత బ్యాటింగ్ తో అలరించిన యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, నితీశ్‌ కుమార్‌ ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లోనూ దూసుకొచ్చారు. మెల్ బోర్న్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగులు చేసిన యశస్వి (854 పాయింట్లు) ఒక ర్యాంక్‌కు ముందుకొచ్చి నాలుగో స్థానానికి చేరగా.. ఇక బాక్సింగ్‌ డే టెస్టులో తొలి సెంచరీ నమోదు చేసిన తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి (528 పాయింట్లు) ఏకంగా 20 స్థానాలు ఎగబాకి 53వ స్థానంలో నిలిచాడు. టెస్టు బ్యాటింగ్‌ విభాగంలో జోరూట్ (895 పాయింట్లు), హ్యారీ బ్రూక్ (876), కేన్ విలియమ్సన్ (867) తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.

టీ20ల్లో టాప్ ప్లేయర్లు వీరే..

ఐసీసీ అప్ డేట్ చేసిన టీ20 విభాగం ర్యాంకుల్లో బ్యాటర్ల జాబితాలో ట్రావిస్ హెడ్ (855), ఫిల్ సాల్ట్ (829), తిలక్ వర్మ (806), సూర్యకుమార్ యాదవ్ (788), జోస్ బట్లర్ (717) టాప్‌ -5లో కొనసాగుతున్నారు. బౌలింగ్‌ విభాగంలో భారత్‌ నుంచి రవి బిష్ణోయ్ (666), అర్ష్‌దీప్‌ సింగ్ (656) మాత్రమే టాప్‌ -10లో ఉన్నారు. బిష్ణోయ్ 6వ స్థానం, అర్ష్‌దీప్ ఎనిమిదో స్థానంలో నిలిచారు.