Telangana Cabinet Expansion: ముగ్గురు కొత్త మంత్రుల ప్రమాణం

– రాష్ట్రంలో 17 నెలల ఉత్కంఠకు తెర
– అడ్లూరి, వివేక్, వాకిటి చేత గవర్నర్ ప్రమాణస్వీకారం
– ముదిరాజ్ కోటాలో వాకిటి, మాదిగ కోటాలో అడ్లూరి
Telangana Cabinet Expansion: విధాత, హైదరాబాద్ః రాష్ట్రంలో ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన ఉత్కంఠకు తెరపడింది. ముందుగా లీకులు ఇచ్చినట్టుగానే గడ్డం వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రివర్గంలో చోటు దక్కింది. రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం హాజరయ్యారు. మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని.. కొందరి శాఖలు మారుస్తారని.. కొందరు మంత్రులకు ఉద్వాసన ఉంటుందని ఊహాగానాలు వచ్చినా అధిష్ఠానం వాటి జోలికి వెళ్లలేదు. కొత్తగా ముగ్గురికి అవకాశం కల్పించింది. ఆదివారం సాయంత్రం నాటికి వారికి శాఖలు కేటాయించే అవకాశం ఉంది.
అనుకున్నది సాధించిన వివేక్..
వివేక్ వెంకటస్వామి చివరకు పంతం నెగ్గించుకున్నారు. మంత్రి మండలిలో చోటు దక్కించుకున్నారు. ఆయన కుటుంబంలో ఇప్పటికే కుమారుడికి ఎంపీ పదవి, సోదరుడికి ఎమ్మెల్యే పదవి ఉండటంతో వివేక్ మంత్రి పదవి దక్కుతుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ చివరకు అధిష్ఠానం ఇచ్చిన హామీ మేరకు ఆయన మంత్రి పదవి దక్కింది. ఆయనకు మంత్రి పదవి కాకుండా ఇంకేదైనా పదవి ఇవ్వాలని అధిష్ఠానం భావించిందట. కానీ మంత్రి పదవి మాత్రమే కావాలంటూ వివేక్ పట్టుబట్టుడంతో ఆయనకు చోటు దక్కింది. అనేక పార్టీలు మారిన వివేక్ చివరకు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి దక్కించుకోవడం గమనార్హం.
అడ్లూరిని వరించిన అదృష్టం
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అడ్లూరిని అదృష్టం వరించిందని చెప్పొద్దు. మాదిగ కోటాలో ఆయనకు అవకాశం దక్కింది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ధర్మపురి నియోజకవర్గం నుంచి గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌పై 2,229 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ముదిరాజ్ కోటాలో వాకిటి..
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మరో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని కూడా అదృష్టం తలుపు తట్టిందని చెప్పొచ్చు. గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టుగానే ఆయనకు క్యాబినెట్ లో చోటు దక్కింది. ముదిరాజ్ కోటాలో ఆయనను ఈ పదవి వరించింది. వాకిటి శ్రీహరి 1972లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జన్మించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డిపై 17,522 ఓట్ల తేడాతో గెలిచారు.