BC Reservations 42% GO | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. ఉత్తర్వులు జారీ.. నేడో రేపో నోటిఫికేషన్

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. దీంతో రేపోమాపో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కానున్నదని సమాచారం విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

  • By: TAAZ    news    Sep 26, 2025 9:27 PM IST
BC Reservations 42% GO | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. ఉత్తర్వులు జారీ.. నేడో రేపో నోటిఫికేషన్

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విధాత ప్రతినిధి)

BC Reservations 42% GO | రాష్ట్రంలో అణచివేతకు గురైన బీసీ కులాలకు రాజకీయంగా మరిన్ని అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం తీపి కబురు చెప్పింది. విద్య, ఉపాధి, రాజకీయ రంగంలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసిన విధంగానే తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ కులాలకు సమాజంలో సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే ఈ ఉత్తర్వులు (జీఓ ఎంఎస్ నెంబర్ 09) జారీ చేసినట్లు పేర్కొంది. భారత రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా సమానత్వం, సామాజిక న్యాయం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నదని వెల్లడించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఒకటి రెండు రోజుల్లో బీసీ రిజర్వేషన్లను ప్రకటించి, స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైందని సమాచారం.

అప్పుడూ, ఇప్పుడూ కాంగ్రెస్ సర్కార్ లోనే ఎక్కువ శాతం రిజర్వేషన్లు…

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించింది. 23 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లడంతో తాము రాజకీయంగా నష్టపోయామని బీసీ సంఘాలు చెబుతున్నాయి. 2013లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఆదేశంతో బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయ రంగంలో రిజర్వేషన్లను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే తెలంగాణ బీసీ కమిషన్ కు చైర్మన్, సభ్యులను నియమించడంతో పాటు రిటైర్డు ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వర్ రావు నాయకత్వంలో డెడికేషన్ కమిషన్‌ను నియమించారు. రిజరేషన్ల పెంపుపై ఈ ఏడాది మార్చి నెలలో అసెంబ్లీ, కౌన్సిల్‌లో అన్ని పార్టీల మద్ధతుతో బిల్లులను ఆమోదించి, గవర్నర్‌కు పంపించింది. ఆయన ఆ తరువాత రాష్ట్రప్రతికి పంపించారు. ఇదే కాకుండా పంచాయతీ చట్టం ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే నిబంధనను సవరిస్తూ జూలై 10న ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఆర్డినెన్స్ కూడా గవర్నర్ కు పంపించింది. ఆ తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేలా ఢిల్లీలో ధర్నా కూడా నిర్వహించారు. 42 శాతం పెంపుపై బీఆర్ఎస్ కేంద్రంలోని బీజేపీపై ఒత్తిడి తేవడం లేదని రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు గురిపెట్టారు. అయితే ఇప్పటి వరకు రాష్ట్రపతి నుంచి, గవర్నర్ నుంచి ఈ బిల్లులుకు ఆమోదం లభించకపోవడం తెలంగాణ ప్రభుత్వమే తనకున్న అధికారాలతో రంగంలోకి దిగింది. ఈ మేరకు శుక్రవారం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో 34 శాతం ఉన్న రిజర్వేషన్లను పెంచుతూ 42 శాతం చేసి ఉత్తర్వులు ఇవ్వడం ఆ పార్టీకి కలిసివచ్చే అవకాశమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయంగా ఈ నిర్ణయం బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఇబ్బందేనని అంటున్నారు.

ఇదీ పెంపుదల నేపథ్యం….

రాజ్యాంగంలోని ఆర్టికల్ 40, 243 డీ (6), 243 టీ (6) ప్రకారం గ్రామ పంచాయతీ, మునిసిపాలిటీలలో రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. కోటా పెంపుపై మాజీ ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన్ మెన్ డెడికేషన్ కమిషన్ గత ఏడాది తన నివేదికను ప్రభుత్వానికి అందచేసింది. రిజర్వేషన్లపై లోతుగా అధ్యయనం చేసి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌ పెంచాలని సిఫారసు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తెలంగాణ బీసీ కమిషన్ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలపై కుల గణన శాస్త్రీయ విధానంలో ప్రారంభించి పూర్తి చేసింది. న్యాయ పరంగా చిక్కులు రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నది కూడా. కుల గణన నివేదికను అధ్యయనం చేసిన బీసీ డెడికేషన్ కమిషన్.. ఈ ఏడాది మార్చి నెలలో ప్రభుత్వనికి రిజర్వేషన్ల పెంపును సమర్ధిస్తూ సిఫారసు చేసింది. రాష్ట్రంలో బీసీ కులాల జనాభా 56.33 శాతం ఉందని, కనీసం 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు చేయాలని సిఫారసు చేసింది. బీసీ డెడికేషన్ కమిషన్ సిఫారసు ప్రకారం స్థానిక సంస్థల్లో ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్లను సవరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కమిషన్ సిఫారసులను ఆమోదిస్తూ, గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు నిర్ణయిస్తూ ‘ద తెలంగాణ బ్యాక్ వర్డ్ క్లాసెస్ (రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్) బిల్ –2025’ను అసెంబ్లీ, కౌన్సిల్ లో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇదే విషయాన్ని మళ్లీ డెడికేషన్ కమిషన్ కు తెలియచేయగా, సరైన నిర్ణయం అంటూ కమిషన్ మళ్లీ ఆగస్టు నెలలో తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందచేసింది. ఈ నివేదిక ఆధారంగా బీసీ సంక్షేమ శాఖ శుక్రవారం పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో 42 శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

శనివారం కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం

స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటికే సన్నద్ధంగా ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం కీలక సమావేశం నిర్వహించనున్నది. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీపీజీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు పాల్గొననున్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల నోటిఫికేషన్, పోలింగ్ ఏర్పాట్లు, సిబ్బంది, శాంతి భద్రతలు వంటి అంశాలపై చర్చించనున్నారు.

చారిత్రాత్మక నిర్ణయం, బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం చారిత్రాత్మకమని బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్ అన్నారు. తెలంగాణలో బీసీ కల నెరవేరిందని చెప్పారు. ప్రభుత్వం పట్టుదలను అభినందించారు.