Free Bus Scheme | మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్‌ కార్డే కావాలా?

ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మరింత వెసులుబాట్లు కల్పించింది. ఇప్పటి వరకూ ఆధార్‌ కార్డు చూపించి జీరో టికెట్‌ పొందుతుండగా.. ఇకపై పరిధిని పెంచారు.

  • By: TAAZ    news    May 08, 2025 6:00 PM IST
Free Bus Scheme | మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్‌ కార్డే కావాలా?

Free Bus Scheme | అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణించే సదుపాయాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం కల్పించిన విషయం తెలిసిందే. ఆధార్‌ కార్డు చూపించి, జీరో టికెట్‌పై నిర్దిష్ట బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేందుకు ఈ పథకం వీలు కల్పిస్తున్నది. 2023 డిసెంబర్ 9న ఈ పథకం ప్రారంభించారు. మహిళల భద్రత, స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహించేందుకు దీనిని ఉద్దేశించారు. ఆర్టీసీకి చెందిన నగర, గ్రామీణ, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో ఈ సేవలు పొందవచ్చు. ప్రతిరోజూ 40 లక్షల మంది వరకూ దీనిని ఉపయోగించుకుంటున్నట్టు తెలుస్తున్నది.

ఈ పథకంపై టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గురువారం కీలక ప్రకటన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, తదితర గుర్తింపు కార్డులు ఉంటే మహిళలు కండక్టర్‌కు చూపించి జీరో టికెట్ పొందవచ్చని సజ్జనార్ తెలిపారు. కాగా ఇప్పటి వరకు ఆధార్ మాత్రమే మహాలక్ష్మి జీరో టికెట్ పొందేందుకు ప్రామాణికంగా ఉంది. అయితే సజ్జనార్ చెప్పినట్లుగా ఆధార్ మాత్రమే కాకుండా రాష్ట్రానికి చెందిన పౌరులుగా నిరూపించే ఇతర ఐడీ కార్డులను కండక్టర్లు అనుమతిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.