Pahalgam | జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రదాడి.. 25మంది మృతి

  • By: sr    news    Apr 22, 2025 7:47 PM IST
Pahalgam | జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రదాడి.. 25మంది మృతి

Pahalgam |

విధాత : జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులకు తెగబడటంతో 20మంది మృతి చెందగా, 9మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాంలో పర్యటిస్తున్న పలువురు పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంటుంది. ట్రెక్కింగ్‌కు వెళ్లిన పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు జరుపడంతో 20మంది మృతి చెందగా..10 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.

కాల్పుల శబ్దం వినిపించడంతో స్థానిక పోలీసులు వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలను అక్కడకు తరలించారు. గాయపడిన వారిని హెలికాప్టర్‌ ద్వారా ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో ఉగ్రవాదుల జాడ కోసం బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. ఐడీ కార్డులు చెక్ చేసి, ముస్లిం కాని వాళ్లపై కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు కన్నీరు పెట్టుకున్నారు. పక్కా వ్యూహం ప్రకారమే ఆర్మీ యూనిఫామ్‌లో ఏడుగురు ఉగ్రవాదులు వచ్చి దాడికి పాల్పడినట్టు సమాచారం. ట్రెక్కింగ్‌ టూర్‌కు వెళ్లిన టూరిస్టులను చుట్టుముట్టి వారి ఐడీ కార్డులు చెక్‌ చేసి ముస్లిం కాని వాళ్లపై కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు కన్నీరు పెట్టుకున్నారు.

జులై 3 నుంచి ప్రారంభం కానున్న అమర్‌నాథ్‌ యాత్ర లక్షల మంది యాత్రికులతో రెండు మార్గాల్లో కొనసాగనుంది. 38 రోజుల పాటు సాగే యాత్ర అనంత్‌నాగ్‌ జిల్లాలో పహల్గాం మార్గంలోనే 48 కి.మీ మేర కొనసాగాల్సి ఉంది. 14కిలోమీటర్ల మార్గం గండేర్బల్‌ జిల్లా నుంచి ఉంటుంది. ఈ నేపథ్యంలో పర్యటకులపై ఉగ్రవాదులు దాడికి తెగబడటం ఆందోళన కలిగిస్తోంది.

ఉగ్ర ఘటనపై ప్రధాని మోదీ సీరియస్

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడిని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. సౌదీ పర్యటనలో ఉన్న ఆయన.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఫోన్‌లో మాట్లాడారు. దాడి ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్షణమే ఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితి సమీక్షించాలని ఆదేశించారు. కాగా పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అమిత్‌ షా స్పష్టం చేశారు. అత్యవసర భద్రతా సమీక్ష కోసం శ్రీనగర్‌ వెళ్తున్నానని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.

దాడి హేయం: సీఎం ఒమర్‌

పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిని జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఖండించారు. దీనిని హేయమైన చర్యగా పేర్కొన్నారు. దాడికి పాల్పడినవారు మానవ మృగాలని, ఘటనను ఖండించేందుకు మాటలు రావడం లేదంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.