PM MODI | ఉగ్ర లింకులు పాక్‌లో.. ఇవిగో ఆధారాలు..

  • By: sr    news    Apr 26, 2025 10:30 PM IST
PM MODI | ఉగ్ర లింకులు పాక్‌లో.. ఇవిగో ఆధారాలు..
  • ఇద్దరు ఉగ్రవాదుల డిజిటల్‌ సిగ్నేచర్లు
  • వాటిని ట్రేస్‌ చేస్తే.. పాక్‌లో లొకేషన్లు
  • 13 దేశాల అధిపతులకు మోదీ వెల్లడి
  • ఢిల్లీలో విదేశీ రాయబారులతో భేటీలు

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదల దారుణ మారణకాండలో పాకిస్తాన్‌ ప్రమేయం ఉన్నదనేందుకు తమకు విశ్వసనీయ ఆధారాలు లభించాయని భారత ప్రభుత్వం వివిధ విదేశీ ప్రభుత్వాల అధినేతలకు, రాయబారులకు తెలియజేసిందని ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొన్నది. శుక్రవారం వివిధ దేశాల రాయబారులతో భారత విదేశాంగ శాఖ దేశరాజధాని ఢిల్లీలో విస్తృత వరుస సమావేశాలు సమావేశాలు నిర్వహించింది. పహల్గామ్‌లో ఇటీవలి దాడిలో పాకిస్తాన్‌ లింక్‌ ఉన్నదనేందుకు విశ్వసనీయ సమాచారం, సాంకేతిక గూఢచార సమాచారం లభ్యమైందని భారత అధికారులు విదేశీ ప్రభుత్వ వర్గాలకు తెలియజేసినట్టు ఆ వార్త సారాంశం.

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 13 మంది దేశాధినేతలతో మాట్లాడారని, విదేశాంగ శాఖ ఢిల్లీలో విదేశీ రాయబారులతో వరుస సమావేశాలు నిర్వహించి, ఈ సమాచారాన్ని అందజేసినట్టు తెలిపింది. ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్‌ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల ఎలక్ట్రానిక్‌ సిగ్నేచర్లు ట్రేస్‌ చేయగా.. పాకిస్తాన్‌లోని రెండు లొకేషన్లు చూపించాయని తెలియజేసినట్టు విదేశాంగ శాఖ వర్గాలను ఉటంకిస్తూ పేర్కొన్నది.

పహల్గామ్‌ దాడిలో పాల్గొన్న కొందరు ఉగ్రవాదులను వారి పాత యాక్టివిటీస్‌ ఆధారంగా గుర్తించినట్టు విదేశా ప్రభుత్వాలకు భారత్‌ తెలిపింది. వారు పాకిస్తాన్‌ నుంచి భారత భూభాగంలో రహస్యంగా దాక్కున్నారని నిర్ధారణ అయిందని వెల్లడించాయి. పహల్గామ్‌ ఘటన తర్వాత తీవ్రంగా స్పందించిన భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై కఠినమైన దౌత్యపర ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇందులో సింధు నదీ జలాల ఒప్పందం రద్దు కూడా ఒకటి.