పహల్గామ్ దాడితో.. మాకు సంబంధం లేదు: TRF ! పాక్ ఆర్మీ చీఫ్ సూచనలతోనేనా?

  • By: sr    news    Apr 26, 2025 4:14 PM IST
పహల్గామ్ దాడితో.. మాకు సంబంధం లేదు: TRF ! పాక్ ఆర్మీ చీఫ్ సూచనలతోనేనా?

ఏప్రిల్ 22న జ‌మ్ముక‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గామ్‌లో ఉగ్ర‌వాద దాడికి త‌మదే బాధ్య‌త అని ప్ర‌క‌టించుకున్న ది రెసిస్టెంట్ ఫ్రంట్ (TRF).. ఇప్పుడు మాట మార్చింది. 27 మంది టూరిస్టులు చ‌నిపోయిన ఈ దాడి తాము చేసింద‌ని కాద‌ని ప్ర‌క‌టించింది. ప‌హ‌ల్గామ్ దాడిపై తీవ్రంగా స్పందించిన భార‌త్‌.. పాకిస్థాన్‌పై ప‌లు ఆంక్ష‌లు విధించిన నేప‌థ్యంలో టీఆరెఫ్ తాజా ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు ఆన్‌లైన్‌లో ఒక పోస్టును టీఆరెఫ్ పెట్టింది. పాకిస్తాన్ కేంద్రంగా ప‌నిచేస్తున్న నిషేధిత ల‌ష్క‌రే తాయిబా ఉగ్ర‌వాద సంస్థ‌ను కేంద్ర హోం శాఖ చ‌ట్ట‌వ్య‌తిరేక కార్య‌క‌లాపాల నివార‌ణ చ‌ట్టం కింద నిషేధించిన సంగ‌తి తెలిసిందే. దీనికి టీఆరెఫ్ అనుబంధ సంస్థ‌గా భావిస్తున్నారు. అయితే.. ఈ దాడిని త‌మకు ఆపాదించ‌డం త‌ప్పుడు, తొంద‌రపాటు చ‌ర్య‌గా శ‌నివారం (ఏప్రిల్ 26)న ఆన్‌లైన్‌లో చేసిన పోస్టులో పేర్కొన్న‌ది.

వాస్త‌వానికి ఈ దాడికి త‌మ‌దే బాధ్య‌త‌ని గ‌తంలో టీఆరెఫ్ గ‌ర్వంగా ప్ర‌క‌టించుకున్న‌ది. అయితే.. పాకిస్తాన్‌లోని వారిని ‘నడిపించే శక్తులు’ ఒత్తిడి చేసిన నేపథ్యంలో మాటమార్చిందని తెలుస్తున్నది. గతంలో ఈ దాడికి తమదే బాధ్యత అని వచ్చిన ప్రకటన అధికారికమైనది కాదని ఆ పోస్టులో తెలిపింది. తమ డిజిటల్ చానళ్లలోకి ఎవరో చొరబడ్డారని ఆరోపించింది.

దాడికి తమదే బాధ్యతని ప్రకటించుకోవడం, తర్వాత ప్లేటు తిప్పేయడం పాకిస్తాన్ కూడా గతంలో చేసిందే. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతం ఇస్తూనే.. 2019 పుల్వామా ఉగ్ర దాడి సందర్భంగా తమకేమీ సంబంధం లేదని తప్పించుకునేందుకు ప్రయత్నించింది. పహల్గామ్ దాడికి తమదే బాధ్యత అని ముందు చేసిన ప్రకటనను టీఆరెఫ్ ఉపసంహరించుకునేలా చూడాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసి మునీర్.. లష్కరే తాయిబా నాయకత్వానికి వ్యక్తిగతంగా సూచించినట్టు వార్తలు వస్తున్నాయి.

టీఆరెఫ్ అనేది ఏదో చిల్లర సంస్థ కాదు. లష్కరే తాయిబాకు అనుబంధంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ. ఈ సంస్థ కశ్మీర్‌లోని జర్నిస్టులపై బెదిరింపులకు పాల్పడిన తర్వాత దానిని భారత హోం శాఖ 2023లో నిషిద్ధ సంస్థగా ప్రకటించింది. ఇటీవలి కాలంలో టీఆరెఫ్ తోపాటు.. పీఏఎఫ్‌ఎఫ్ (పీపుల్స్ యాంటి ఫాసిస్ట్ ఫ్రంట్‌), యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ (యూఎల్‌ఎఫ్‌) వంటివి ఇస్లామిస్ట్ పేరిట ఆవిర్భవించాయి. పైకి కనిపించడానికి సెక్యులర్ గా అనిపించినా.. లష్కరే జిహాదీ గ్రూపుల మార్గాన్నే అనుసరిస్తూ ఉంటాయి.