Nagababu: అసలు ఆడవాళ్లు.. ఏం తప్పు చేశారు
నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఎమ్మెల్సీ నాగబాబు ఘాటుగా స్పందించారు. ఆడపిల్లల దుస్తులపై మగవారు నిర్ణయం తీసుకునే హక్కు లేదని, ఇది మోరల్ పోలీసింగ్ అని ఆయన ఖండించారు.
నటుడు శివాజీ (shivaji) హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో, ఏపీ ఎమ్మెల్సీ నాగబాబు (nagababu) ఘాటుగా స్పందించారు. శివాజీ తన వ్యక్తిగత లక్ష్యం కాదని స్పష్టం చేసిన నాగబాబు, అయితే “ఆడపిల్లల డ్రెస్ వల్లే వారిపై దాడులు జరుగుతున్నాయి” అన్న భావన వచ్చేలా మాట్లాడడం మాత్రం పూర్తిగా తప్పని ఖండించారు.
ఆడపిల్లలు ఏ దుస్తులు ధరించాలి, ఎలా ఉండాలి అనే నిర్ణయం మగవాళ్లు తీసుకునే హక్కు ఎవరికీ లేదని ఆయన తేల్చిచెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు నిస్సందేహంగా మోరల్ పోలీసింగ్‌కు ఉదాహరణలేనని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఈ రకమైన ఆలోచనలను సమర్థించే మహిళలను చూసి బాధ కలుగుతోందని, మహిళలంతా ఒక్కటై బయటకు వచ్చి తమ గళాన్ని వినిపించాలని పిలుపునిచ్చారు.
సమాజంలో “ఆడపిల్లలు ఇలానే ఉండాలి” అంటూ నియమాలు విధించే వారిని నిలదీయకపోతే, మహిళలే తమ స్వేచ్ఛను తామే కోల్పోయినట్లవుతుందని ఆయన హెచ్చరించారు. ఒక తండ్రిగా, సోదరుడిగా మాట్లాడుతున్నానని పేర్కొన్న నాగబాబు, ఆడపిల్లల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. వారిని అణచివేసే, నియంత్రించే చాదస్తపు మెంటాలిటీని సమాజం వెంటనే వదిలేయాలని స్పష్టం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram