కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తులో చెన్నూరు టికెట్ తేలలేదు. ఇరు పార్టీల చర్చలు ఫలించి, ఖరారైనట్లు అధికారిక ప్రకటనా వెలువడనే లేదు.

- కాంగ్రెస్, వామపక్షాల మధ్య తేలని టికెట్

- సీపీఐకి ఖరారైందంటూ ప్రచారం

- హస్తం శ్రేణుల్లో నిరసనలు

- ఇరు పార్టీల్లోనూ అయోమయం

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తులో చెన్నూరు టికెట్ తేలలేదు. ఇరు పార్టీల చర్చలు ఫలించి, ఖరారైనట్లు అధికారిక ప్రకటనా వెలువడనే లేదు. అంతలోనే మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజవర్గ టికెట్ సీపీఐకి కేటాయించినట్లు ప్రచారం ఊరూరా ఊపందుకుంది. దీంతో స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. పార్టీ అధిష్టానానికి నిరసనల సెగనూ చూపారు. కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల అభ్యర్థులను మాత్రమే తొలి జాబితాలో ప్రకటించింది. చెన్నూరు నియోజకవర్గానికి అభ్యర్థిని పెండింగ్ పెట్టారు. పొత్తులో భాగంగానే సీపీఐకి కేటాయిస్తున్నారని ప్రచారం కొనసాగుతోంది.


రామకృష్ణాపూర్ లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ, టికెట్ ను సీపీఐకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. పరోక్షంగా బీఆర్ఎస్ అభ్యర్థి చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కు సహకరించినట్లే అని ప్రచారం తెరపైకి వచ్చింది. సీపీఐకి నియోజకవర్గంలో బలమైన క్యాడర్ లేదని, ఇక్కడ ఆపార్టీకి టికెట్ ఇవ్వడం మూలంగా కాంగ్రెస్ శ్రేణులు నిరాశకు గురవుతున్నారు. గెలిచే అవకాశాలున్న సీటుపై ఇప్పటికైనా రెండు పార్టీల అధిష్టానాలు పునరాలోచించాలని కోరుతున్నారు. టికెట్ ను కాంగ్రెస్ పార్టీకి కేటాయిస్తే విజయకేతనం ఎగరవేసే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ క్యాడర్ మనోభావాలకు విలువ ఇవ్వకుండా, సీపీఐకి చెన్నూర్ టికెట్ కేటాయిస్తే పార్టీకి రాజీనామా చేస్తామని రెండు రోజుల క్రితం కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు నల్లరిబ్బన్లతో నిరసన వ్యక్తం చేశారు.

సీపీఐకి ‘సింగరేణి’ భయం

సీపీఐ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీకి సింగరేణి లో కొంత బలమైన కేడర్ ఉంది. అయినప్పటికీ అది రామకృష్ణాపూర్, మందమర్రి ప్రాంతాలకు మాత్రమే పరిమితమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏఐటీయూసీ నాయకులు సైతం ఇక్కడ టికెట్ అత్యవసరం కాదని తీర్మానం చేసి సీపీఐ అధిష్టానానికి పంపినట్లు సమాచారం. చెన్నూరు నియోజవర్గంలో సీపీఐ అభ్యర్థికి టికెట్ కేటాయిస్తే, ఎన్నికల్లో ఓటమిపాలైతే... రాబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో దాని ప్రభావం ఏఐటీయూసీపై పడే అవకాశాలు ఉన్నాయని సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ సీటు కాంగ్రెస్ కు ఇచ్చి, రాబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీకి మద్దతు కోరుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా బెల్లంపల్లి టికెట్ కావాలని ముందు నుండి సీపీఐ కోరుతోంది. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఆపార్టీకి మంచి క్యాడర్ ఉంది.


గతంలో గుండా మల్లేష్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో సీపీఐ బెల్లంపల్లి టికెట్ ఆశించినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అప్పటికే మాజీ మంత్రి గడ్డం వినోద్ కు టికెట్ కేటాయించింది. బెల్లంపల్లికి బదులుగా కాంగ్రెస్ పార్టీ చెన్నూరు టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం. టికెట్ విషయమై రెండు పార్టీలు ఒక అవగాహనకు వచ్చినట్లు ధ్రువీకరించే సమాచారం లేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మాత్రం చెన్నూరు టికెట్ సీపీఐకి ఇస్తున్నట్లు అసత్య ప్రచారం కొనసాగుతోంది. చెన్నూరు టికెట్ సీపీఐకి కేటాయించడం మూలంగా ఇక్కడ బాల్క సుమన్ సునాయాసంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.


ఈ తతంగం వెనుక పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు మంచిర్యాల జిల్లాలో ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జైపూర్ మండల అధ్యక్షుడు ఫయాజ్, సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ కు చెన్నూరు సీటు విషయంలో ఫోన్ చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నూరు టికెట్ కాంగ్రెస్ కు వస్తే బాగుంటుందని, సీపీఐ తీసుకోవడం మూలంగా ఆపార్టీ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కు సహకరించినట్లేనని ఆడియోలో పేర్కొనడం జరిగింది. వారం రోజుల నుండి మంచిర్యాల జిల్లాలో చెన్నూరు టికెట్ రోజూ చర్చనీయాంశంగా మారుతోంది. కాంగ్రెస్, సీపీఐ నాయకులు మరొకసారి సమావేశమై, క్షేత్రస్థాయిలో బలాబలాలు పున:సమీక్షించుకొని నిర్ణయం తీసుకోవాలని చెన్నూరు కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నారు.

Vidhaatha Desk

Vidhaatha Desk

Next Story