తెలంగాణ మీ అయ్య జాగీరా? అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కచ్చితంగా ఇక్కడున్న నాలుగు కోట్ల మందితెలంగాణ భూమి పుత్రుల జాగీరే అని, ఇందులో ఎవరికీ అనుమానం కూడా అక్కర్లేదు అని, 100% ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్లు, ఈ నేల కోసం పోరాటాలు చేసినవాళ్లు, ఈ నేల కోసం త్యాగాలు చేసినవాళ్లు ముమ్మాటికీ తెలంగాణ భూమి పుత్రులేనని, వారి నెత్తురుతో తడిచిన నేల ఇది అని కేటీఆర్ స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడారు. పవన్ కల్యాణ్ ను తెలంగాణకు రావద్దని ఎవరు అనలేదని, మీరు రండి ఇక్కడే ఉండండి, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయి… ఉండండి, ఎవరొద్దన్నారు? అని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రం విడిపోయిన 12 ఏళ్లలో ఎక్కడైనా చిన్న సమస్య వచ్చిందా? అని, ప్రాంతాలుగా విడిపోయినా.. ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నాం అన్నారు.
ప్రాంతీయ వాదంపై పవన్ మాటలు అర్థరహితం
పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతీయవాదాన్ని తప్పుబడుతు చేసిన వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయని, ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం అన్నారని, మరి.. మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేర్పడాలని పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేశారు, అది కూడా ప్రాంతీయవాదం అంటారా? అని పవన్ కల్యాణ్ ను కేటీఆర్ ప్రశ్నించారు. ప్రధాని మోదీరు ఇవాళ ఆయన ప్రాంతం మీద అభిమానంతో, ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను గుజరాత్ పట్టుకొని పోతున్నాడని, మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? ఏది కరెక్టు? అని ప్రశ్నించారు. అంటే ప్రధానమంత్రి గుజరాత్‌కే ప్రధానమంత్రిగా వ్యవహరించడం కరెక్టా? దీనికి పవన్ కల్యాన్ సమాధానం చెప్తారా? అని నిలదీశారు. ఇంకొన్ని రోజులైతే జనగణమన పాడరు అని పవన్ అన్నారని…జనగణమన మాకు నేర్పించాల్సింది ఏమీ లేదు అని, దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ నేల ఆనాడు నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల. కమ్యూనిస్టులు కదంతొక్కిన నేల ఇది. కాబట్టి మాకు పోరాటాలు కొత్తగాదు, మాకు యుద్ధాలు కొత్తగాదు, త్యాగాలు కొత్తగాదు అన్నారు. మాకు ఆది నుంచి జాతీయ భావన ఉందని, దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణకు ‘ఓజీ’ కేసీఆర్
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా పవన్ ను గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే హైదరాబాదీ బిర్యానీ పెడతాం. కానీ, వచ్చి మా సెక్రటేరియట్‌లో కూర్చొని పెత్తనం చేస్తాం అంటే ఒప్పుకోబోమని కేటీఆర్ తేల్చి చెప్పారు. 60 ఏళ్లు పోరాటం చేసి 2014లో మొన్న వేరుపడ్డాం అన్నారు. అంత కష్టపడి విడిపోతే మళ్లీ మీ పెత్తనం ఎందుకు? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ది ఈ మధ్యనే ‘ఓజీ’ అని సినిమా వచ్చిందని, మాకు ఇక్కడ అసలైన తెలంగాణ ఓజీ మా కేసీఆర్ ఉన్నారని, ఆయన చాలు మాకు అని, ఆయనే తెలంగాణను కాపాడుకుంటారు అన్నారు.
ఎవరైనా దేశంలో ఎక్కడైనా పోటీ చేయవచ్చు..
ఈ దేశంలో ఏ నాయకుడైనా, ఏ నాయకురాలైనా పార్టీ పెట్టవచ్చు. పార్టీ పెట్టి ఎక్కడైనా పోటీ చేయవచ్చు అని, ఏ ప్రాంతంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా నిరభ్యంతరంగా పోటీ చేయవచ్చు అని కేటీఆర్ గుర్తు చేశారు. అది ప్రజాస్వామ్య భారతదేశంలో అందరికీ ఉన్న హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కు. ఇందులో ఏమీ అనుమానం పడక్కర్లేదన్నారు. కానీ, ఏ ప్రాంతంలోనైతే మీరు పోటీ చేయాలనుకుంటున్నారో, ఆ ప్రాంత ఆకాంక్షలు, ఆ ప్రాంత పరిస్థితులు, ఆ ప్రాంత ప్రజలు, వారియొక్క మనోభావాలు, వారియొక్క పోరాటాలు, వారియొక్క త్యాగాలు కూడా మీరు తెలుసుకోవాలి, వారి మీద అభిమానం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ వెనుక చంద్రబాబు, మోదీ, కేసీఆర్ ఉన్నారనుకుంటున్నారన్న ప్రశ్నకు కేటీఆర్ స్పందిస్తూ పవన్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని నేను అనుకుంటున్నానని, ఆయన డైవర్షన్ రాజకీయాల లో భాగంగానే ఇదంతా జరిగిండోచ్చన్నారు. రేవంత్ పరిపాలన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికే ఇదంతా చేస్తుండవచ్చని, తెలంగాణను అభిమానించి, ప్రేమించి, గౌరవించేవాళ్లు ఇక్కడ పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారు, లేకపోతే ఏం చేయాలో ప్రజలకు తెలుసు అన్నారు.
పవన్ కళ్యాణ్ పార్టీ తెలంగాణ కొత్తగా పోటీ చేసేదేముంది?
పవన్ కళ్యాణ్ జనసేన తెలంగాణలో కొత్తగా పోటీ చేసేదేముంది? అని, 2018లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, 2023లో పోటీ చేయలేదా మీరు? చేశారు కదా అసెంబ్లీ ఎన్నికల్లో. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా 350 వార్డుల్లో, కొత్తగా చేసేదేముంది? అని కేటీఆర్ గుర్తు చేశారు. మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? అప్పుడు ప్రజలే మిమ్మల్ని అడ్డుున్నారన్నారు. 2018లో చంద్రబాబు నాయుడు వచ్చారు, పోటీ చేశారు. 2023లో మీరు పోటీ చేశారు. పోటీ చేయండి, ఎవడొద్దంటున్నాడు? అని కేటీఆర్ తేల్చి చెప్పారు. కానీ, మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు, ఇదేదో ఆశామాషీగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు. ఇదేదో అనాయాసంగా వచ్చిన రాష్ట్రం కాదు. వేల మంది బలిదానాలతో, రక్తంతో తడిసిన నేల తెలంగాణ అని గుర్తుంచుకోవాలన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు, ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడాలని స్పష్టం చేశారు.
తెలంగాణ ఏర్పాటు బాగాలేదంటూ..ఆవిర్భావం రోజు మీటింగ్ అవసరమా..?
పవన్ కల్యాణ్ తెలంగాణలో మీటింగ్ పెడదాం అనుకుంటే, అడ్డుకున్నదెవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమన్నా అనాలనుకుంటే వాళ్లననాలని కేటీఆర్ సూచించారు. పవన్ కళ్యాణ్ గతంలో నేను తెలంగాణ ఏర్పడ్డప్పుడు నాకు ఆ విభజించిన పద్ధతి నచ్చలేదు అన్నాడని, తల్లిని చంపి బిడ్డను బతికించారని మరోకాయన మోదీ అన్నారని, ఇప్పుడేమో తెలంగాణ అంటే నాకు ప్రాణం అంటాడని..తెలంగాణ ఏర్పాటుపై ఇష్టం ఉందో లేదో సీదా సీదా చెప్పక, ఉల్టా పుల్టా మాట్లాడుతున్నారని విమర్శించారు. విభజన పద్దతి బాగాలేకపోతే, 11 రోజులు అన్నం ముట్టకుండా ఉంటే, మళ్లీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. గతంలోనూ సెక్షన్ 8ని అడ్డం పెట్టుకుని హైదరాబాద్ నికేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ప్రయత్నం కూడా కొంతకాలం కుట్ర జరిగిందని కేటీఆర్ ఆరోపించారు.లోయర్ సీలేరును, ఏడు మండలాలను ఏపీలో కేంద్రం కలిపిందని, విభజన హామీలు అమలు చేయకుండా అన్యాయం చేసిందన్నారు. మళ్లీ కేంద్ర పాలిత ప్రాంతం కుట్ర చేస్తే తెలంగాణ కంటే పెద్ద ఉద్యమమే వస్తుందన్నారు.
తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే!
1968 నుంచి 1971 వరకు తొలి తెలంగాణ ఉద్యమం జరిగితే.. 370 మంది తుపాకీ ఎక్కుపెట్టి బలి తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అని, 1971లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాలకు 11 స్థానాలు తెలంగాణ ప్రజా సమితి పార్టీకి ఇచ్చి.. మాకు తెలంగాణ కావాలనే ఆకాంక్షను ప్రజలు తెలియజేసినా…ఆ ఉద్యమాన్ని కర్కశంగా అణచివేసింది నాటి కాంగ్రెస్ అధినాయకత్వం అని,ఆనాడైనా.. ఈనాడైనా.. ఏనాడైనా, తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే అని కేటీఆర్ విమర్శించారు. వందలాది విద్యార్థుల బలిదానాలకు కారణమైంది ఇదే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. ఆనాడు ఆంధ్రాతో బలవంతపు పెళ్లి చేసి తెలంగాణ గొంతు నులిమింది కాంగ్రెస్ అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సహాయం అవసరం లేకుండా కేసీఆర్ తెలంగాణను తీర్చిదిద్దారని, కేసీఆర్ పాలనలో తెలంగాణ స్వయం పోషకంగా ఎదిగింది అని, దేశంలోనే 84% రాష్ట్ర ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచిందని కేటీఆర్ చెప్పారు. “తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అన్నట్లుగా కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శనీయంగా నిలిచిందన్నారు.
అనేక అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందించిన నాయకుడు కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. కేంద్రం కేసీఆర్ పథకాలను కాపీ కొట్టిందన్నారు. 3శాతం తెలంగాణ జనాభా 5 శాతం జీడీపీ ఇచ్చిందన్నారు.దేశంలోనే తెలంగాణ కేసీఆర్ పాలనలో అభివృద్ది, సంక్షేమంలో నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి వచ్చాక తెలంగాణ ఆర్ధిక వ్యవస్థను పాతాళానికి తొక్కేసాడన్నారు. రేవంత్ పాలనలో ‘మందు’గమనం ఒక్కటే జోరుగా ఉంది.. మిగతావన్నీ మందగమనమే అని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అందరికీ ఒకేలా ఉండాలి
బాల్క సుమన్ ఆస్తుల విధ్వంసపు వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ ఆయన అలా మాట్లాడితే అది పొరపాటు అనడంలో ఏ మాత్రం అనుమానం లేదు అన్నారు. రేవంత్ రెడ్డి మా జెండా దిమ్మలు కూల్చివేయాలని అన్నాడు, హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ తగలబెడతా అన్నారు, గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేశారు మరి వీళ్ళను ఎందుకు అరెస్టు చేయరు? అని, రాష్ట్రంలో అందరికి చట్టం ఒకటే తీరుగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రోత భాష మీద కేసులుండవా..? మా జెండా దిమ్మెలు కూల్చాలని సీఎం పిలుపునివ్వడం హింస కాదా..? కేసీఆర్ చావు కోరుకుంటూ, కేసీఆర్ మీద మాట్లాడే దరిద్రపు భాష మీద ఎన్ని కేసులు పెట్టాలి..? అని ప్రశ్నించారు. గతంలో ఒక కార్యక్రమంలో జెన్ Gen Z ఉద్యమం వస్తుందని అంటే అందరూ నవ్వారు అని, ఈరోజు సీజేఐ అన్న ఒక మాటను పట్టుకుని కాక్రోచ్ జనతా పార్టీ అని పెడితే సోషల్ మీడియాలో బీజేపీ కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. కచ్చితంగా యువతలో బీజేపీ ప్రభుత్వంపై నిరాశ ఉందన్నారు.
2027లో పాదయాత్ర చేస్తా..
కేంద్ర రాష్ట్రాలలోకి బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలను ఎప్పుడు ఉదృతం చేయాలో..మా గుర్తు కారు అని..మాకు ఎప్పుడు గేర్ మార్చాలో తెలుసు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2027లో తెలంగాణ వ్యాప్తంగా నేను పాదయాత్ర చేస్తానని కేటీఆర్ పునరుద్ఘాటించారు. తనపై వస్తున్న ‘అహంకారి’ అనే విమర్శలపై కేటీఆర్ స్పందించారు. ఇది తన బాడీ లాంగ్వేజ్ సమస్య లేదా ‘మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్’ కావచ్చునని ఆయన వ్యాఖ్యానించారు. కడుపులో కత్తులు పెట్టుకుని, పెదవులపై చిరునవ్వు పెట్టుకునే అలవాటు నాకు లేదు, తనకు లేని నవ్వులు నటించడం రాదని, నిఖార్సైన నిజాలు మాట్లాడటమే తన శైలి అని చెప్పారు. తాను ఎక్కడ అహంకారం చూపించానో ఎవరూ నిరూపించలేదని, ఈ విమర్శలు తనకు అలవాటైపోయాయని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలపై నిలదీసే క్రమంలో నపుంసకులా మీరు? అంటే అహంకారం అంటారు! అని, మూడు నెలల్లో బిడ్డ పుట్టడు మాకు తెలుసు అని, 30 నెలల్లో కూడా పుట్టకపోతే ఏమనాలి? అని ప్రశ్నించారు. నిన్న రేవంత్ రెడ్డి ఆవిర్భావ దినోత్సవ వేడుకల నుండి ఎండ తీవ్రత అని తప్పించుకుని పోయాడని, కానీ రైతులు ప్రభుత్వం పంట కొనడంలేదని ఎర్రటి ఎండలో ధర్నాలు చేస్తున్నారని, రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం అన్నారు.
రేవంత్ రెడ్డి మాటలను నమ్మడం లేదు
మోటార్లకు మీటర్లు పెట్టం అని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఎవరు నమ్మబోరని, రేవంత్ సర్కార్ వస్తే మీటర్లు పెట్టడం ఖాయం అన్నారు. పైన మోదీ ప్రభుత్వం ఇక్కడ జోడీ ప్రభుత్వం, మోదీ రేవంత్ లు కలిసే సాగుతున్నారన్నారు. రైతు డిస్కమ్ పేరుతో మరో కొత్త నాటకం వేస్తున్నాడని రేవంత్ తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి స్థాయికి మేము చాలు.. మా నాయకుడు కేసీఆర్ అవసరం లేదు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. విగ్రహాల ఏర్పాటుపై రాజకీయ రగడ సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాల్లో భాగమే అని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టడం రేవంత్ డైరక్షన్ రాజకీయంగానే మేం చూస్తున్నామని, రాజీవ్ విగ్రహాన్ని మేం అధికారంలోకి వచ్చాక గాంధీభవన్ పంపించడం ఖాయం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
సవాళ్లపైన కాంగ్రెస్ మంత్రులు నిలబడాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించిన తర్వాతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడగాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గతంలో నకిరేకల్‌లో స్వయంగా చేసిన ఈ ప్రకటనకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్‌ను కేటీఆర్ ప్రెస్ మీట్‌లో ప్రదర్శించారు. ఇచ్చిన సవాల్‌ను నెరవేర్చకపోతే మంత్రి ఇంట్లోనే కూర్చోవాలని ఘాటుగా విమర్శించారు. తుమ్మిడిహట్టి అనేది రేవంత్ రెడ్డి డైవర్షన్ గేమ్ అని, ఇప్పుడు అతను కూర్చుంటున్న ఆఫీసులోనే గతంలో మహారాష్ట్ర ప్రభుత్వాలు తుమ్మిడిహట్టి ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తుకు పెంచడానికి ఒప్పుకోము అని రాసిన లేఖలు ఉన్నాయని, కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు ఒప్పించలేకపోయారు అని కేటీఆర్ గుర్తు చేశారు. అంత పట్టుదల ఉంటే పోయి మహారాష్ట్ర సీఎం ఇంటి ముందు నిరహార దీక్ష చేయండని రేవంత్ కు సూచించారు.
ఫ్యూచర్ సిటీ కాదు..అది ఫార్మాసిటీనే
ఫ్యూచర్ సిటీ అనేది అక్కడేం లేదని, అక్కడ ఫార్మాసిటీ కోసం భూములను సేకరించామని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫార్మాసిటీ లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామని, వంతారాకు ఇస్తామని, జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. అందుకే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ పునరుద్దరిస్తామని, ప్రభుత్వమే హైకోర్టులో అక్కడ ఫార్మాసిటీ ఉందని పేర్కొందని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే లేని ఫ్యూచర్ సిటీ కాకుండా.. పేట్ బషీరాబాద్, బద్వేల్, మంచిరేవుల వంటి ప్రాంతాల్లో ఇవ్వవచ్చన్నారు.
