మాజీ సీఎం కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు!

బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆరోపణలపై మంత్రి సీతక్క కేసీఆర్‌కు లీగల్ నోటీస్ జారీ చేశారు. 48 గంటల్లో పోస్టులు తొలగించకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు హెచ్చరిక.

విధాత, ప్రత్యే కప్రతినిధి: బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ కు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి,స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అల్టిమేటమ్ జారీ చేసింది. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తను అవినీతికి పాల్పడ్డట్టు చేసిన ఆరోపణలపై ఆమె తీవ్రంగా ప్రతిస్పందించారు. ఈ పోస్టులను 48 గంటల్లో తొలగించకుంటే సివిల్, క్రిమిల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు మంత్రి సీతక్క ఆదివారం లీగల్ నోటీసు జారీ చేయడం సంచలనంగా మారింది. అంగన్వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో నిరాధార ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అంటూ కేసిఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు జారీ చేశారు. రిజిస్టర్ పోస్టు ద్వారా కేసీఆర్ కు లీగల్ నోటీస్ ను మంత్రి సీతక్క తన తరుపు అడ్వకేట్ నాగులూరి కృష్ణ కుమార్ ద్వారా పంపించారు.
రాష్ట్రంలో అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిందని, టెండర్ ఇవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారం కాంట్రాక్ట్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని నోటీసులో మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మొత్తం టెండర్ విలువ రూ. 44 కోట్లే ఉన్నప్పటికీ, అందులో రూ. 30 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం అసంబద్ధం, ఆధారాలు లేని ఆరోపణగా మంత్రి పేర్కొన్నారు. బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి కెసిఆర్ బాధ్యత వహించాలని సీతక్క డిమాండ్ చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. 48 గంటల్లో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు తొలగించి కెసిఆర్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని లీగల్ నోటీసులో మంత్రి సీతక్క పేర్కొన్నారు.

సీబీఐ విచారణ జరిపించాలి : క్రిశాంక్

మరోవైపు తప్పుచేయకుంటే ఆవేశమెందుకు సీతక్కా..! అంటూ బీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌ డిమాండ్‌ చేశారు. చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించండని కోరారు. రూ.44 కోట్ల టెండర్ అని సీతక్క అంటుంది.. పబ్లిక్ డొమైన్ లో రూ.54 కోట్లని ఉంది అని, రూ.54 కోట్లను 38,310 ఫోన్లతో డివైడ్ చేస్తే ఒక్కో ఫోన్ ధర రూ.14 వేలు వస్తుంది.. ఈ విషయం చిన్న పిల్లోడైనా చెప్తాడని పేర్కొన్నారు. కానీ సీతక్క ఒక్కో ఫోన్ ను రూ.11,650 కి తీసుకున్నామని అంటుంది.. ఈ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలని, ఆధారాలు చూపిస్తామన్నారు. మేం ఫోన్ల గురించి మాట్లాడితే మీరు చెప్పుల గురించి మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ విచారణకు లేఖ రాస్తే..ఎవరి వాదన నిజమో తేలిపోతుందన్నారు.

ఇవి కూడా చదవండి :

కొత్త చరిత్ర లిఖించబోతున్న భారత పార్లమెంట్: ప్రధాని మోదీ
పాదయాత్రలో కేటీఆర్ వాస్తవాలు చెప్పాలి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

Latest News