If Your Heart Beats, We’ll Find You: CIA’s Secret ‘Ghost Murmur’ Stuns the World
- CIA రహస్య సాంకేతికతతో ఇరాన్‌లో ఎయిర్మన్ను రక్షంచిన అమెరికా
విధాత టెక్ డెస్క్ | హైదరాబాద్:
Ghost Murmur | ఏప్రిల్ 2026లో ఇరాన్ గగనతలంలో జరిగిన సంఘటన ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అమెరికా వైమానిక దళానికి చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్ క్షిపణి దాడిలో ఇరాన్ భూభాగంపై కూలిపోయింది. జెట్‌లో ఉన్న ఇద్దరు ఎయిర్‌మెన్ ప్రాణాలతో తప్పించుకున్నారు. వారిలో ఒకరిని వెంటనే రక్షించగా, రెండో వ్యక్తి – వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్( Dude 44 Bravo) – దక్షిణ ఇరాన్‌లోని పర్వతప్రాంతాల్లో పడి, గాయాలతో రెండు రోజుల పాటు కొండ పగుళ్లలో దాక్కుని బతికాడు. అతని కోసం ఇరాన్ సైన్యం, IRGC బలగాలు కూడా తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అతని తలపై బహుమతి కూడా ప్రకటించారు.
ఈ సమయంలో అమెరికా భారీ రక్షణ ఆపరేషన్(CSAR) ప్రారంభించింది. వందలాది సైనికులు, 150కి పైగా విమానాలు, పదుల సంఖ్యలో హెలికాప్టర్లు, డ్రోన్లు రంగంలోకి దిగాయి. రెండు రెస్క్యూ విమానాలు ఇరుక్కుపోయినప్పటికీ, వాటిని ధ్వంసం చేసి సిబ్బందిని సురక్షితంగా తీసుకువచ్చారు. ఈ సంక్లిష్ట ఆపరేషన్‌ను అధికారులు “గడ్డివాములో గుండుసూదిని వెతికినట్లుగా అభివర్ణించారు. కానీ, ఈ మిషన్ విజయానికి అసలు కారణం — CIA వినియోగించిన “(ఘోస్ట్ మర్మర్ –Ghost Murmur)” అనే రహస్య సాంకేతికత.
గుండె చప్పుడే చిరునామా: ‘ఘోస్ట్ మర్మర్’ ఎలా పనిచేస్తుంది?
“Ghost Murmur” అనేది క్వాంటమ్ మాగ్నటోమెట్రీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలయికతో రూపొందించిన అత్యాధునిక వ్యవస్థ. మనిషి గుండె ప్రతి సారి కొట్టుకునే సమయంలో చాలా సూక్ష్మమైన విద్యుదయస్కాంత తరంగాలు ఉత్పత్తి అవుతాయి. సాధారణంగా ఈ సంకేతాలను గుర్తించాలంటే వైద్య పరికరాలు ఛాతీకి దగ్గరగా ఉండాలి. కానీ ఈ టెక్నాలజీ మాత్రం అదే సిగ్నల్‌ను మైళ్ల దూరం నుంచే గుర్తిస్తుంది.
ఈ వ్యవస్థలో ఉపయోగించే క్వాంటమ్ సెన్సర్లు కృత్రిమ వజ్రాల(Synthetic Diamonds)లోని “నైట్రోజన్-వేకెన్సీ” నిర్మాణాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి అత్యల్ప అయస్కాంత మార్పులను కూడా పసిగడతాయి. ఆ తర్వాత ఆ డేటాను AI విశ్లేషించి, సాధారణంగా భూమిపై ఉండే రణగొణధ్వనుల నుంచి నిజమైన గుండె చప్పుడును విడదీస్తుంది. ఒక మాట చెప్పినట్టు — “వెయ్యి చదరపు మైళ్ల ఎడారిలో ఒక్క మనిషి గుండె చప్పుడు వినడం లాంటిది… కానీ మీరు బతికే ఉంటే, మేము మిమ్మల్ని కనుగొంటాం.”
ఈ టెక్నాలజీని Lockheed Martin సంస్థకు చెందిన Skunk Works అభివృద్ధి చేసింది. ఇంతకు ముందు బ్లాక్‌హాక్ హెలికాప్టర్లపై విజయవంతంగా పరీక్షించబడింది. భవిష్యత్తులో F-35 ఫైటర్ జెట్లలో కూడా వినియోగించే ప్రణాళికలు ఉన్నాయి. ఈ సాంకేతికత వచ్చే రోజుల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్లు, స్పెషల్ ఆపరేషన్లను చాలా సులభం చేస్తుంది. ఇంకా చాలా వివరాలు రహస్యంగానే ఉన్నాయి.
ఇప్పుడు కూడా ఈ ఆపరేషన్‌లో అదే బ్లాక్‌హాక్ హెలీకాప్టర్లల నుండే ఘోస్ట్ మర్మర్ను ప్రయోగించారు.
Ghost Murmur అనే పేరే ఎందుకు?
- Ghost → ఎవరైనా పూర్తిగా అదృశ్యమైపోయినా (దయ్యాల్లాగా) వాళ్లను కనుగొనడం.
- Murmur → వైద్య పరిభాషలో గుండె లయ (heart rhythm) ను “murmur” అంటారు.
కాబట్టి, పేరు ఉద్దేశపూర్వకంగానే పెట్టారు.
ఇరాన్‌లో ఎలా ఉపయోగించారు? ఇకముందు పరిస్థితి ఏంటి?
ఆ ఎయిర్‌మన్ తన Combat Survivor Evader Locator (CSEL) బీకన్‌ను ఆన్ చేసినప్పటికీ, అతని ఎక్కడున్నాడో ఖచ్చితమైన స్థానం తెలియలేదు. అతను బీకన్ సిగ్నల్ పంపేందుకు కొద్దిసేపు బయటకు రావాల్సి వచ్చినప్పుడు, ఆ ప్రాంతాన్ని స్కాన్ చేస్తున్న Ghost Murmur అతని గుండె తరంగాలను గుర్తించింది. దక్షిణ ఇరాన్ ఎడారి ప్రాంతం ఈ సాంకేతికతకు అనుకూలంగా ఉండటం — తక్కువ ఎలక్ట్రోమాగ్నెటిక్ అంతరాయం, నిర్మానుష్యంగా ఉండటం, రాత్రివేళ ఎడారి చల్లదనం – మనిషి శరీరంలోని వేడి.. ఈ తేడా — ఇవన్నీ కలిసి లొకేషన్‌ను ఖచ్చితంగా గుర్తించడంలో సహాయపడ్డాయి.
ఈ విజయంపై అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ, 40 మైళ్ల దూరం నుంచే అతన్ని గుర్తించామనీ… ఇది నిజంగా గడ్డివాములో గుండుసూది వెతికినట్టేనంటూ వ్యాఖ్యానించారు. CIA డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ కూడా ఈ ఆపరేషన్‌లో టెక్నాలజీ కీలక పాత్ర పోషించిందని సంకేతాలు ఇచ్చారు.
అయితే ఈ టెక్నాలజీకి పరిమితులు కూడా ఉన్నాయి. ఇది ప్రధానంగా తక్కువ శబ్దం ఉన్న ప్రాంతాల్లోనే బాగా పనిచేస్తుంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న పట్టణాల్లో లేదా ఎలక్ట్రానిక్ అంతరాయం ఉన్న చోట్ల పనితీరు గణనీయంగా తగ్గుతుంది. డేటా ప్రాసెసింగ్‌కు కూడా సమయం పడుతుంది. అయినప్పటికీ, భవిష్యత్తులో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లు, స్పెషల్ ఫోర్సెస్ మిషన్లు, విపత్తుల సమయంలో రక్షణ చర్యల్లో ఇది కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ ఘోస్ట్ మర్మర్, తమ వారిని రక్షించేందుకే కాకుండా చేతికి చిక్కకుండా దాక్కున్న శత్రువులను కూడా పసిగట్టడానికి వాడే అవకాశముంది. “Ghost Murmur” కేవలం ఒక సాంకేతికత కాదు—ఇది యుద్ధాల రూపాన్ని మార్చే సంకేతం. ఇప్పటివరకు “దాక్కోవడం” ఒక రక్షణ వ్యూహంగా ఉండేది. ఇప్పుడు అది కూడా పోయినట్లే.
