WhatsApp | ప్రైవసీపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో మెటా కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్‌లోని మెటా ఏఐ చాట్‌బాట్ కోసం ప్రత్యేకంగా ఇన్‌కాగ్నిటో మోడ్‌ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. వాట్సాప్ పర్సనల్ చాట్‌కు ఉన్న ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్‌ను చాట్‌బాట్‌కు కూడా ఎక్స్‌టెండ్ చేశామని తెలిపింది. దీనివల్ల మెటా ఏఐ చాట్‌బాట్‌తో ఏం చాట్ చేశారనేది ఆయా యూజర్లకు తప్ప ఎవరికీ తెలియదని పేర్కొంది.
మెటా వెల్లడించిన వివరాల ప్రకారం.. వాట్సాప్‌లోని Meta AIతో పర్సనల్‌గా చాట్ చేసేటప్పుడు కొత్తగా కనిపించే ప్రత్యేక ఐకాన్‌ను ట్యాప్ చేస్తే Incoginto మోడ్ ఆన్ అవుతుంది. అందులో చేసే చాట్‌ను ఇతరులు ఎవరూ చూడలేరు. ఈ ఫీచర్‌ను వాట్సాప్‌తో పాటు Meta AI యాప్‌లో కూడా అందుబాటులో రానుంది. ఈ ఫీచర్‌ను దశలవారీగా యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని మెటా వెల్లడించింది. ఇన్‌కాగ్నిటో సెషన్‌లో చాట్ చేసిన మెసేజ్‌లు సేవ్ కావని మెటా తెలిపింది. చాట్ మూసివేసిన వెంటనే మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయని పేర్కొంది. అంతేకాదు ఫోన్‌ను లాక్ చేసినా.. వాట్సాప్ యాప్‌ను క్లోజ్ చేసినా ఆ సెషన్ పూర్తవుతుంది. ఆ చాట్‌కు సంబంధించిన సమాచారం Meta AI వద్ద కూడా ఉండదని స్పష్టం చేసింది. మొత్తంగా ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు మరింత గోప్యంగా AIతో సంభాషించే అవకాశం దొరుకుతుందన్నమాట.
ప్రస్తుతం ఏ చిన్న సందేహం వచ్చినా ప్రజలు అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పైనే ఆధారపడుతున్నారని వాట్సాప్ ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్ అలీస్ న్యూటన్ రెక్స్ అన్నారు. ఆరోగ్య, ఆర్థిక సమస్యల, పర్సనల్ రిలేషన్‌షిప్‌లో సమస్యలపై కూడా సలహాల కోసం ఏఐని సలహాలు అడుగుతున్నారని.. అలాంటి సమయంలో వినియోగదారులు కాస్త ప్రైవసీ ఉండాలని అనుకుంటున్నారని తెలిపారు. అందుకే వారి ప్రైవసీకి ప్రాధన్యతనిస్తూ ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.
ఈ ఇన్‌కాగ్నిటో చాట్స్ కోసం మెటా కంపెనీ ఇటీవల విడుదల చేసిన Muse Spark అనే తాజా ఏఐ మోడల్‌ను ఉపయోగించనున్నట్లు తెలిపింది. త్వరలోనే సైడ్ చాట్ అనే మరో ఫీచర్‌ను కూడా వాట్సాప్ తీసుకురానుంది. దీని ద్వారా గ్రూప్ చాట్‌లో ఇతరులకు తెలియకుండా మెటా ఏఐని ఉపయోగించి వ్యక్తిగతంగా ప్రశ్నలు అడగవచ్చు. ఇప్పటికే కొన్ని దేశాల్లో గ్రూప్ చాట్‌లో ఏఐని ఉపయోగించే సదుపాయం ఉంది. గ్రూప్‌లో ఫ్రెండ్స్ చేసిన మెసేజ్‌ను మెటా ఏఐకి ట్యాగ్ చేయడం ద్వారా, వాటికి ఎలాంటి సమాధానం ఇవ్వొచ్చో సలహా తీసుకోవచ్చు. కానీ అది అందరికీ కనిపిస్తుంది. కానీ సైడ్ చాట్ అనే కొత్త ఫీచర్‌తో ఎవరికీ తెలియకుండానే ఏఐ సాయం పొందే అవకాశం ఉంది.
Read More:
ఏజీఐతో కుప్పకూలనున్న ఆర్థిక వ్యవస్థ : ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్
