Xiaomi 17T | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ మరో రెండు ప్రీమియం ఫోన్లను పరిచయం చేసింది. Xiaomi 17T, Xiaomi 17T Pro మొబైల్‌ను అధికారికంగా విడుదల చేసింది. గతంలో వచ్చిన 15T సిరీస్‌కు కొనసాగింపుగా ఈ కొత్త మోడళ్లను తీసుకొచ్చింది. Leica ట్యూన్ చేసిన కెమెరా సిస్టమ్, 1.5K AMOLED డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.
Xiaomi 17T మొబైల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్ ఇవ్వగా.. 17T Pro మొబైల్‌లో మరింత శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌ను అమర్చింది. ఈ రెండు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 16 ఆధారిత Hyper OS3పై పనిచేస్తాయి.
డిస్‌ప్లే
షావోమీ 17టీ మొబైల్‌లో 6.59 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 1.5K రిజల్యూషన్, 120 Hz రీఫ్రెష్ రేట్, HDR 10+, Dolby Vision సపోర్టుతో వస్తుంది. అంతేకాకుండా 100 శాతం DCI-P3 కలర్ గామట్ కవరేజ్ , గరిష్టంగా 3500 నిట్స్ బ్రైట్‌నెస్ కూడా వస్తుంది. ఇక 17T Pro మొబైల్‌లో మరింత 6.83 అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇందులో 144Hz వరకు రీఫ్రెష్ రేటు లభిస్తుంది.
కెమెరా ఫీచర్లు
ఈ రెండు ఫోన్లలోనూ Leica Complete Camera సిస్టమ్‌ను అందించారు. ఇందులో 50మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా, 5x ఆప్టికల్ జూమ్, 12మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ప్రధాన కెమెరా విషయానికి వస్తే Xiaomi 17Tలో 50 మెగాపిక్సెల్ Light Fusion 800 సెన్సార్ ఉండగా.. 17T Proలో 50మెగాపిక్సెల్ Light Fusion 950 సెన్సార్‌ను అమర్చారు. వీటితో 4K HDR 10 వీడియోలను 60fps వరకు రికార్డ్ చేసే సామర్థ్యాన్ని కల్పించారు. సెల్ఫీలు, వీడియోకాలింగ్ కోసం రెండు ఫోన్లలోనూ 32మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీపైనా ఫోకస్
బ్యాటరీ విషయంలోనూ షావోమీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. Xiaomi 17T మొబైల్‌లో 6500mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని ఇచ్చింది. 67W ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్ సపోర్టు ఉంది. ఇక 17T Pro మొబైల్‌లో 7000mAh భారీ బ్యాటరీని అందించారు. దీనికి 100W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో పాటు 50W వైర్‌లెస్ చార్జింగ్ సదుపాయం ఇచ్చారు. వీటిలో ఆస్ట్రో కమ్యూనికేషన్ ఫీచర్‌ను అందించారు. దీని ద్వారా ఎంపిక చేసిన పరిస్థితుల్లో 1.3కిలోమీటర్ల దూరం వరకు ఆఫ్‌లైన్ కమ్యూనికేషన్ సాధ్యమవుతుందని షావోమీ కంపెనీ తెలిపింది.
ధరలు ఎలా ఉన్నాయంటే..!
Xiaomi 17T మొబైల్ 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర యూరప్ మార్కెట్‌లో 749 యూరోలుగా ఉంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.83,500. అదే 12జీబీ ర్యామ్+512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 799 యూరోలు (సుమారు రూ.89,000)గా నిర్ణయించారు. ఇది బ్లాక్, బ్లూ, ఓపల్ వైట్, వైలెట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఇక Xiaomi 17T Pro మొబైల్ 12జీబీ ర్యామ్+512జీబీ స్టోరేజ్ ధరను 899 యూరోలు(సుమారు రూ.1.02లక్షలు)గా నిర్ణయించారు. దీనికంటే అధిక వేరియంట్ల ధరలు 999 యూరోల నుంచి 1099 యూరోల వరకు ఉంది. ప్రస్తుతం ఈ రెండు ఫోన్లు యూకే సహా కొన్ని యూరప్ దేశాల్లో మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉంది. భారత్‌లో ఈ మొబైల్‌ను ఎప్పుడు లాంచ్ చేస్తారనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.