Asia Cup 2025 | ఆసియాకప్ మళ్లీ మనదే – ఫైనల్లో పాకిస్తాన్‌ను మట్టికరిపించిన భారత్
భారత్ 9వ సారి అసియా కప్ గెల్చుకుంది. మొదటిసారి పాకిస్తాన్ ప్రత్యర్థిగా ఫైనల్ మ్యాచ్ ఆడిన ఇండియా ఈ లోస్కోరింగ్ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో తడబడ్డా నిలబడి గెలిచి కప్‌ను ముద్దాడింది.

కప్పు గెల్చుకుంటాం అని బీరాలు పలికిన పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్‌లో బొక్కబోర్లాపడింది. భారత బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లందరూ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 146 పరుగులకే కథ సమాప్తమైంది. అ స్పల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ కూడా అష్టకష్టాలు పడింది. ఆఖరి థ్రిల్లర్ ఓవర్లో 6 బంతులకు 10 పరుగులు కావాల్సిన దశలో సిక్స్‌కొట్టిన తిలక్ వర్మ, విన్నింగ్ షాట్‌గా ఫోర్ కొట్టిన రింకూ భారత్‌కు 9వ సారి ఆసియాకప్‌ను సగర్వంగా సమర్పించారు.
ఆసియా కప్ భారత్‌కు ఎలా దక్కిందంటే…
టాస్ గెల్చిన భారత్ మరో ఆలోచన లేకుండా పాక్‌కు బ్యాటింగ్ అప్పగించింది. అయితే వారి ఆశలను అడియాసలు చేస్తూ ఓపెనర్లు పర్హాన్(57), ఫఖర్ జమాన్(46)లు ధాటిగా ఆడటం ప్రారంభించారు. తొలి వికెట్‌కు మంచి(84 పరుగులు) ఆరంభాన్నిచ్చిన వీరిద్దరిని వరుణ్ చక్రవర్తి పెవిలియన్‌కు పంపాడు. అంతే… అక్కడినుండీ ఇక పాక్ కోలుకోలేకపోయింది. బౌలర్ల దెబ్బ మీద దెబ్బకు ఒకరి వెనుక మరొకరు వస్తూ పోతూ ఉన్నారు. రెండో వికెట్‌గా సయీమ్ అయూబ్ జట్టు పరుగులు 113 వద్ద ఉన్నప్పుడు ఔటయ్యాడు. మిగిలిన 8 వికెట్లు 33 పరుగుల వ్యవధిలో కూలిపోయి, పాక్ జట్టు 146 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో కుల్దీప్ 4 వికెట్లు తీసుకుని పాక్ వెన్ను విరవగా, బుమ్రా, వరుణ్, అక్షర్ తలా రెండు వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించారు.
చిన్న లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన భారత్‌కు ఆదిలోనే భారీ దెబ్బ తగిలింది. ఈ టోర్నమెంటంతా అర్థశతకాలతో మెరుపులు మెరిపించిన అభిషేక్ శర్మ స్వల్పస్కోరు(5)కే వెనుదిరిగాడు. కెప్టెన్ సూర్య తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ ఒక్క పరుగుకే వెనుదిరగగా, కాసేపటికే శుభమన్ గిల్(12) అష్రఫ్ బౌలింగ్‌లో రౌఫ్‌కు క్యాచ్ ఇచ్చి భారత శిబిరంలో ఆందోళనకు తెర లేపాడు. 20 పరుగులకే ఇండియా మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో కూరుకుపోయింది. తర్వాత వచ్చిన సంజూతో తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. 77 పరుగుల వద్ద సంజూ(24) అవుట్ కాగా, శివమ్ దూబే రంగంలోకి దిగాడు. ఈ ఇద్దరూ కలిసి భారత్‌ను గెలుపు బాట పట్టించారు. ఆట చివర్లో దూబే 33 పరుగులు(22 బంతులు, 2 సిక్స్‌లు, 2 ఫోర్లు) పెవిలియన్ చేరగా, రింకూతో కలిసి తిలక్ 69 నాటౌట్(53 బంతులు, 4 సిక్స్‌లు, 3 ఫోర్లు) భారత్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. 147 పరుగుల లక్ష్యానికి గానూ, భారత్ 19.4 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించింది. నిజానికి ఈ మ్యాచ్‌లో తిలక్‌వర్మ పోరాటం అనన్యసామాన్యం. ఓ వైపు వికెట్లు పడుతున్నా, పట్టుదల చెదరకుండా నాలుగు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. తన ఏకాగ్రత ఏమాత్రం చెదిరినా కప్ పాకిస్తాన్ ఖాతాలోకి వెళ్లిపోయేది.
టోర్నమెంట్ మొత్తంలో ఇదే మ్యాచ్‌లో దిగిన రింకూసింగ్ ఒకే బాల్ ఆడి విన్నింగ్ షాట్‌గా ఫోర్ సాధించి, అరుదైన జీవితకాలపు మధుర స్మృతిని అందుకున్నాడు.