IND into WWC Finals | జయహో..  జెమీమా – ప్రపంచకప్​ ఫైనల్లో భారత్​

జెమిమా రోడ్రిగ్స్‌ (127 నాటౌట్‌) చారిత్రాత్మక పోరాటం, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (89) అద్భుత ఇన్నింగ్స్‌లతో భారత్‌ 339 పరుగుల రికార్డ్‌ లక్ష్యాన్ని చేధించి, ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో గెలిచి 3వ సారి ప్రపంచకప్​ ఫైనల్‌కు చేరింది.

  • By: ADHARVA |    sports |    Published on : Oct 31, 2025 12:22 AM IST
IND into WWC Finals | జయహో..  జెమీమా – ప్రపంచకప్​ ఫైనల్లో భారత్​

emimah Rodrigues’ masterclass powers India to record chase and Women’s World Cup 2025 final

  • జగజ్జేతను మట్టికరిపించిన టీమిండియా
  • రికార్డు చేధనతో ఆస్ట్రేలియా విజయపరంపరకు తెర
  • జెమిమా సంచలన శతకం : చారిత్రాత్మక పోరాటం
  • నవంబర్​ 2న జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో అమీతుమీ
  • ఈసారి కొత్త విజేత చేతుల్లో ప్రపంచకప్​

(విధాత స్పోర్ట్స్​ డెస్క్​)

అటుపక్క ఏడుసార్లు జగజ్జేత, నిరుటి విజేత, వరుసగా పదహారు మ్యాచుల్లో అపజయమే ఎరుగని ఆస్ట్రేలియా. ఇటు ఆఖర్న సెమీస్లో అడుగుపెట్టి, అట్టడుగున నిలిచి డిఫెండింగ్ ఛాంపియన్తో సెమీస్ పోరాటానికి దిగిన భారత్. సెమీస్లో ఆసీస్తో పడిందనగానే సగటు భారతీయ అభిమాని నిరాశపడిపోయాడు. ఇంకేముంది? అయిపోయిందనుకున్నారంతా. మొదటి సెమీస్లో దక్షిణాఫ్రికా పోరాటపటిమను చూసి ఆశ్చర్యపోయినవారు, ఇండియా కూడా ఇలాగే ఆడి కంగారూలను ఇంటికి పంపితే బాగుండు అని ప్రార్థనలు చేసారు. నేడు ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేసి, 338 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచగానే అందరూ టీవీలు కట్టేసారు. ఎందుకంటే 300లకు పైగా పరుగుల లక్ష్యాన్ని ఇంతవరకూ ఎవరూ చేధించలేదు మరి..!

emimah Rodrigues remains unbeaten on 127 off 134 balls as India chase down 339 to reach the Women’s World Cup 2025 final against Australia

కానీ, కళ్లముందు అద్భుతమే జరిగింది.. 339 పరుగుల కొండంత లక్ష్యం భారత నారీమణుల ఆత్మవిశ్వాసం, అసమాన పోరాటం ముందు చిన్నబోయింది. ఒక పొట్టమ్మాయి పోరాటానికి లొంగిపోయింది. ఓడిపోవడానికి అసలే ఇష్టపడని ఒక పట్టుదలకు సలాం చేసింది. ఆ పట్టుదల పేరు జెమీమా రోడ్రిగ్స్. ఒక దశలో జట్టులో స్థానమే అనుమానంగా ఉన్న స్థాయి నుండి మొండి పట్టుదలతో జట్టును ఫైనల్కు చేర్చిన ప్రయాణం.  339 పరుగులు మంచులా కరిగి,  పరుగులెత్తి అలసిన ఆ అమ్మాయి కాళ్లు కడిగాయి.

ఏమా పట్టుదల? ఏంటా పోరాటం? ఎంత ప్రశాంతత? ఎలాంటి నిగ్రహం?.. జెమీమా రోడ్రిగ్స్. ఈ పేరు ఇక భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. తన ఈ ఆట భవిష్యత్ క్రికెట్ పాఠాలలో ఒక ప్రత్యేకమైన చాప్టర్గా ఉండిపోతుంది.


నవి ముంబయి:
IND into WWC Finals | మహిళల వన్డే వరల్డ్‌కప్‌ 2025లో భారత్‌ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాపై అద్భుత ప్రదర్శన కనబరుస్తూ, 339 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి, ఐదు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరింది. జెమిమా రోడ్రిగ్స్‌ (127 నాటౌట్‌) ఆడిన ఇన్నింగ్స్‌ ఈ టోర్నమెంట్‌లోనే కాదు, భారత మహిళా క్రికెట్‌ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచింది. భారత్​ ప్రపంచకప్​ ఫైనల్లో ప్రవేశించడం ఇది మూడోసారి(2005, 2017, 2025).

India women celebrate historic win over Australia in the Women’s World Cup 2025 semi-final at Navi Mumbai

ఆస్ట్రేలియా – అదిరిన బ్యాటింగ్​

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 338 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఫీబీ లిచ్‌ఫీల్డ్‌ (119 బంతుల్లో 119) అద్భుత శతకం సాధించగా, ఎలీస్‌ పెర్రీ (77) అండగా నిలబడింది. ఇద్దరి మధ్య రెండో వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. చివర్లో అష్లీ గార్డ్నర్‌ (45 బంతుల్లో 65) వేగంగా ఆడుతూ స్కోరును 338/10కి చేర్చింది.
భారత బౌలర్లలో యువ స్పిన్నర్‌ శ్రీ చరణి (10 ఓవర్లలో 2/49) మాత్రమే కొంత నియంత్రణతో బౌలింగ్‌ చేసింది. దీప్తి శర్మ (2/73) కూడా రెండు వికెట్లు సాధించినా, ఖరీదైన వ్యవహారంగా మారింది.

భారత్​ – బరి దాటిన పోరాటం

Jemimah Rodrigues and Harmanpreet Kaur discuss strategy during their match-winning partnership in the India vs Australia semi-final

భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌ తొలుత కొంత ఒత్తిడిలో కనిపించింది. స్మృతి మంధాన త్వరగా ఔట్‌ అయిన తర్వాత జెమిమా రోడ్రిగ్స్‌ క్రీజులోకి వచ్చి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టింది. ఆత్మవిశ్వాసంతో ఆడిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌తో కలిసి 178 పరుగుల కీలక భాగస్వామ్యం నిర్మించింది. హర్మన్‌ప్రీత్‌ 88 బంతుల్లో 89 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేసింది. కానీ, కౌర్​ అవుటవగానే భారత శిబిరంలో ఆందోళన. కానీ, అన్నీ తానే అయి, జెమీమా విజయ భారాన్ని తన భుజాల మీద వేసుకుని ఇన్నింగ్స్‌ను పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంది. జెమిమా తన ఇన్నింగ్స్‌లో 134 బంతుల్లో 127 పరుగులు సాధించింది.
ఆమె ఆటలో ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, స్ట్రోక్‌ సెలక్షన్‌ అన్నీ సరిగ్గా అమిరాయి. దీప్తి శర్మ (24), రిచా ఘోష్‌ (26) అవసరమైన సమయాల్లో వేగంగా రన్స్‌ సాధించారు. భారత్‌ 48.3 ఓవర్లలోనే 339/5 సాధించి, వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని చేధించిన జట్టుగా నిలిచింది.

ఆస్ట్రేలియా బౌలర్లలో కిమ్‌ గార్త్‌ (2/46), అన్నాబెల్‌ సదర్లాండ్‌ (2/69) మాత్రమే కొంత ప్రభావం చూపించారు. కానీ మధ్య ఓవర్లలో భారత బ్యాటర్లను అడ్డుకోవడంలో వారు విఫలమయ్యారు.

జెమిమా రోడ్రిగ్స్‌ శతకం సాధించిన తర్వాత బ్యాట్‌ ఎత్తి ప్రేక్షకులకు అభివాదం చేస్తున్న దృశ్యం – మహిళల వరల్డ్‌కప్‌ 2025 సెమీఫైనల్‌

ఈ విజయంతో భారత్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు చేరి దక్షిణాఫ్రికాతో తలపడనుంది. జెమిమా రోడ్రిగ్స్‌ ఇన్నింగ్స్‌ దేశవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించింది. ఇంతవరకు మహిళల వన్డే వరల్డ్‌కప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లలో 300 పరుగుల పైగా లక్ష్యాన్ని ఎవరూ చేధించలేదు. భారత్‌ ఈ విజయంతో ఆ చరిత్రను తిరగరాసింది.

English Summary:
Jemimah Rodrigues produced a stunning unbeaten 127 as India chased down 339 to beat Australia by five wickets in the Women’s World Cup 2025 semi-final at Navi Mumbai.
Harmanpreet Kaur struck a vital 89, guiding India to their first-ever ODI World Cup final, where they will face South Africa.