Women’s T20 World Cup: దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం(Dubai International Stadium)లో జరిగిన మహిళల టి20 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో భారత్(India Women) పాకిస్తాన్(Pakistan Women)పై ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీలో ఇదే భారత్‌కు తొలి విజయం. గత మ్యాచ్‌లో న్యూజీలాండ్(Newzealand Women) చేతిలో ఘోర పరాజయం పాలై తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడే పాకిస్తాన్‌తో మ్యాచ్ రావడం భారత్‌కు ఇంకో టెన్షన్‌గా మారింది. అయినా ఒత్తిడిని అధిగమించి, బౌలర్లు రాణించడంతో పాక్‌ను కట్టడి చేయగలిగింది.
తొలుత టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్(Toss won by Pak) తనది ఎంత తప్పుడు నిర్ణయమో తొందరగానే తెలుసుకుంది. ఒక్క రన్‌కే తొలి వికెట్ చేజార్చుకున్న పాక్, ఇక క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. 52 పరుగులకే 5 వికెట్లు పడేసుకున్న పాక్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. భారత బౌలర్ అరుంధతి రెడ్డి మూడు వికెట్లతో చెలరేగిపోయింది. బౌలర్లందరూ వికెట్లు పంచుకోవడంతో, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 105 పరుగులు మాత్రమే చేయగలిగింది(105/8 in 20 overs). భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి(Arundhati Reddy) 3, శ్రేయాంక పాటిల్ 2, రేణుకాసింగ్, దీప్తి శర్మ, ఆశా శోభన తలో వికెట్ తీసుకున్నారు.
అనంతరం స్వల్ప లక్ష్యచేధనలో భారత్ కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. షెఫాలీ వర్మ(32), జెమీమా(23), కెప్టెన్ హర్మన్‌ప్రీత్(29) బ్యాటింగ్‌లో కీలకపాత్ర పోషించారు. స్మృతి మంధాన 7 పరుగులకే అవుటైనప్పటికీ, లక్ష్యం చిన్నదవడంతో భారత్ ఎక్కడా తడబడకుండా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించింది.
ఈ గెలుపుతో రెండు పాయింట్లు గెలుచుకున్న ఇండియా, –1.2 రన్‌రేట్‌తో ఉంది. అగ్రస్థానంలో న్యూజీలాండ్ 2 పాయింట్లతో, 2.9 రన్‌రేట్‌తో నిలబడింది.