ఒలింపియన్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు సుప్రీంకోర్టులో భారీ ఉరట లభించింది. వినేశ్ ఫొగట్‌ను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఎదురు దెబ్బ తగిలింది. 2026 ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు నిర్వహించే సెలక్షన్ ట్రయల్స్‌కు హాజరుకావచ్చని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ సందర్భంగా ప్రకటించింది. ఈ క్రీడాకారిణి రెజ్లింగ్‌లో తన ప్రతిభ చాటుకోవడం ద్వారా దేశానికి కీర్తిని తీసుకొచ్చిందని పేర్కొన్నది. ‘ఇంకా వేరెవరైనా మరోలా ఉండేది. ఆమె దేశం గర్వపడేలా చేసింది’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పారదర్శకత కోసం మొత్తం ఎంపిక ప్రక్రియను వీడియో రికార్డ్ చేయాలని, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నామినేట్ చేసిన ప్రతినిధులు ఈ ఎంపిక ప్రక్రియను పరిశీలించాలని పేర్కొన్నది.
ఆసియా క్రీడల్లో పాల్గొనేవారిని ఎంపిక చేసేందుకు మే 30, 31 తేదీల్లో సెలక్షన్స్ ఉన్నాయి. వాటిలో పాల్గొనేందుకు ఢిల్లీ హైకోర్టు వినేశ్ ఫొగట్‌కు అనుమతి ఇచ్చింది. కానీ.. ఆ అనుమతిని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
తన విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గర్భం కారణంగా పోటీలకు దూరంగా ఉంటున్నానని, తదుపరి కాలంలో మళ్లీ తిరిగి వస్తానని ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి 2024లో వినేశ్ ఫొగట్ సమాచారం ఇచ్చిన అంశాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రస్తావించింది. 2025లో ప్రసవం అనంతరం ఫొగట్ మళ్లీ శిక్షణను పునఃప్రారంభించింది. అదే సమయంలో ఇంటర్నేషనల్ ఏజెన్సీ.. ఆమె 2026 నుంచి బరిలోకి దిగవచ్చని అనుమతి కూడా ఇచ్చింది. ఆమె గర్భవతి అయి ఉన్న కారణంగా డబ్ల్యూఎఫ్‌ఐ పాలసీ కింద క్వాలిఫయింగ్ టోర్నమెంట్లలో పాల్గొనలేక పోయిన అంశాన్ని కోర్టు ప్రస్తావించింది.
ప్రాథమికంగా గమనిస్తే.. కొన్ని ప్రత్యేక టోర్నమెంట్లలో పతకాలు సాధించిన క్రీడాకారులకే అవకాశం కల్పించి, వినేశ్ ఫొగట్ వంటి రెజ్లర్లను అన్యాయంగా గెంటివేసినట్టు ఈ విధానం ఉందని కోర్టు అభిప్రాయపడింది. పారిస్ ఒలింపిక్స్‌లో బరువు వివాదంపై డబ్ల్యూఎఫ్‌ఐ ఇచ్చిన షోకాజ్ నోటీసులో చేసిన వ్యాఖ్యలను సైతం హైకోర్టు తప్పుపట్టింది. వినేశ్ ఎలాంటి తప్పు చేయలేదని కోర్ట్ ఆప్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ తేల్చి చెప్పిన తర్వాత కూడా ఆ ఘటన దేశానికి అవమానం అని షోకాజ్ నోటీసులో పేర్కొన్నడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇది ప్రతీకార ధోరణిలా ఉన్నదని వ్యాఖ్యానించింది.
ఢిల్లీ హైకోర్టు ఈ కేసును పరిశీలించిన విధానంపై కొన్ని సందేహాలను వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. అంతిమంగా.. ఆ కోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఇదేమీ మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్ల వ్యవహారం కాదు. ఇది జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు సంబంధించినది. ప్రతి దశలో కోర్టులు ఇలా జోక్యం చేసుకుని, మొత్తం షెడ్యూల్‌ను అస్తవ్యస్తం చేయలేవు’ అని జస్టిస్ పీఎస్ నరసింహ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు.
