SRH Beat RCB Despite Missing Top-2 Spot After Three Half-Centuries In IPL 2026
హైలైట్ పాయింట్స్
- ● ఆరెంజ్ తుఫాన్లో కొట్టుకుపోయిన ఆర్సీబీ
- ● 166 దాటి ఓడిపోయిన బెంగళూరు
- ● టాప్-2 మిస్ అయిన హైదరాబాద్
- ● మే 27న ఎలిమినేటర్ ఆడాల్సిందే
విధాత స్పోర్ట్స్ డెస్క్ | మే 22, 2026:
హైదరాబాద్: ప్లేఆఫ్స్‌లో 1వ లేదా 2వ స్థానంలో నిలబడాలనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశలు అడియాసలయ్యాయి. బెంగళూరుపై భారీ విజయం సాధించినా, మొదటి రెండు స్థానాల్లోకి చేరుకోవాలంటే 166 పరుగుల లోపే బెంగళూరును ఔట్ చేయాల్సివుంది. అది సాధ్యం కాకపోవడంతో 3వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సివచ్చిన సన్‌రైజర్స్ ఇక ఎలిమినేటర్ నాకౌట్ మ్యాచ్ ఆడక తప్పని పరిస్థితి నెలకొంది.
గెలిచి ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్
సన్‌రైజర్స్ విధించిన భారీ లక్ష్యమైన 256 పరుగులను సాధించలేక రాయల్ చాలెంజర్స్ 200 పరుగులకే పరిమితమై 55 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. హైదరాబాద్ తన మొదటి, చివరి మ్యాచ్‌లను బెంగళూరుతోనే ఆడి, ఒకటి గెలిచి మరొకటి ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో మూడు జట్లు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలా 18 పాయింట్లు సాధించి వరుసగా మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. ఇక మిగిలిన 4వ స్థానం గురించి 4 జట్లు కొట్లాడుతున్నాయి.
256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ మెరుపు ఆరంభాన్నిచ్చాడు. 4 సిక్సర్లు, 4 ఫోర్లతో 19 బంతుల్లో 44 పరుగులు చేసిన అయ్యర్ చలవతో పవర్‌ప్లేలోనే చాలెంజర్స్ 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 15 పరుగులే చేసి అభిమానులను నిరాశపర్చాడు. కాగా, కెప్టెన్ రజత్ పటీదార్, ఆల్‌రౌండర్ కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్ నింపాదిగా ఆడుతూ పాడుతూ 200 పరుగులు చేసి ఓడిపోయారు.
ఉప్పల్ స్టేడియంలో రైజర్స్ సిక్సర్ల మోత
కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ బ్యాటర్స్ బెంగళూరు బౌలర్లపై చెలరేగిపోయారు. హైదరాబాద్ బ్యాటింగ్ దుమ్మురేపింది. ఏమాత్రం తడబడకుండా బ్యాటింగ్ ఎంచుకున్న హైదరబాద్, 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది. 12.75 రన్‌రేట్‌తో సాగిన ఈ ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్ నుంచి చివరి ఓవర్ వరకు బ్యాటర్లందరూ దూకుడు మంత్రం పఠించారు.
అభిషేక్ మెరుపు ఆరంభం.. హెడ్ సపోర్ట్
ట్రావిస్ హెడ్ 16 బంతుల్లో 26 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ ఉప్పల్ స్టేడియంలో తుఫాన్‌లా విజృంభించాడు. కేవలం 22 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు చేసి, బెంగళూరు బౌలర్లపై తీవ్ర ఒత్తిడి పెంచాడు. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ 63 పరుగులు సాధించి భారీ స్కోరుకు బలమైన పునాది వేసింది.
ఇషాన్ కిషనే ఇన్నింగ్స్‌కు మూలస్థంభం
మధ్య ఓవర్లలో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా నడిపించాడు. 46 బంతుల్లో 79 పరుగులు చేసి హైదరాబాద్ స్కోరును 250 దాటించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇషాన్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. చివరి బంతికి ఔటైనా, అప్పటికే SRHను బలమైన స్థితిలో నిలబెట్టాడు.
మళ్లీ క్లాసెన్ క్లాసిక్.. నితీశ్ ఫినిషింగ్
హెన్రిచ్ క్లాసెన్ 24 బంతుల్లో 51 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు మరింత వేగం జోడించాడు. 2 ఫోర్లు, 5 సిక్సర్లతో క్లాసెన్ ఆర్సీబీ బౌలింగ్‌పై విరుచుకుపడ్డాడు. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి వేగంగా 12 బంతుల్లో 29 పరుగులు చేసి నాటౌట్‌గా ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఇషాన్–క్లాసెన్ జోడీ 48 బంతుల్లో 113 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం SRH ఇన్నింగ్స్‌లో కీలక మలుపు.
ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలాం దార్ 2 వికెట్లు తీయగా, సుయశ్ శర్మ, కృనాల్ పాండ్యా ఒక్కో వికెట్ తీశారు. కానీ హైదరాబాద్ బ్యాటింగ్ దూకుడు ముందు బెంగళూరు బౌలింగ్ పూర్తిగా తేలిపోయింది.
