హైలైట్‌ పాయింట్లు
వరుసగా రెండోసారి ఆర్సీబీ ఛాంపియన్‌
గుజరాత్‌ను 155కే కట్టడి
రషీఖ్‌ సలామ్‌కు మూడు వికెట్లు
టైటిల్‌ను నిలబెట్టుకున్న బెంగళూరు

 

మే 31, 2026 | లైవ్‌ అప్‌డేట్‌

అహ్మదాబాద్‌: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మరోసారి ఐపీఎల్‌ విజేతగా అవతరించింది. గత సీజన్‌లో తొలిసారి ట్రోఫీని అందుకున్న ఆర్సీబీ.. ఇప్పుడు వరుసగా రెండోసారి కప్‌ను సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్‌ 2026 ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

గుజరాత్‌ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలో 161 పరుగులతో ఛేదించింది. ఛేజ్​ మాస్టర్​ విరాట్​ కోహ్లీ(75*) అర్థ శతకంతో నాటౌట్​గా బెంగళూరు ఛేదనకు బలమైన పునాది వేయగా..టిమ్​ డేవిడ్​(24), జితేశ్​ శర్మ(11)  చివర్లో జట్టును విజయతీరాలకు చేర్చారు. వరుసగా రెండోసారి ట్రోఫీని అందుకున్న ఆర్సీబీ.. ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా టైటిళ్లు గెలిచిన అరుదైన జట్ల సరసన నిలిచింది.

ఛేదనలో బెంగళూరు జోరు

Royal Challengers Bengaluru players celebrate with the trophy after winning the IPL 2026 final

ఐపీఎల్‌ 2026 ఫైనల్లో విజయం సాధించిన అనంతరం ట్రోఫీతో సంబరాలు చేసుకుంటున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లు

156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. విరాట్​ కోహ్లీ, వెంకటేశ్​ అయ్యర్​  గుజరాత్‌ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. పవర్‌ప్లేలోనే పరుగుల వేగం తగ్గకుండా చూసుకున్నారు. మధ్య ఓవర్లలో కొన్ని వికెట్లు పడినా.. టార్గెట్​ పెద్దది కాకపోవడంతో బెంగళూరు బ్యాటర్లు  ప్రశాంతంగా ఆడారు.

గుజరాత్‌ బౌలర్లు మ్యాచ్‌ను మలుపు తిప్పేందుకు ప్రయత్నించినా ఆర్సీబీ బ్యాటింగ్‌ బలాన్ని నిలువరించలేకపోయారు. కింగ్​ కోహ్లీ మరోసారి జట్టుకు అవసరమైనప్పుడు ఆడే ఆపద్భాందవుడిగా 75 పరుగులతో నాటౌట్​గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరకు ఒక్క పరుగే అవసరం ఉన్నప్పుడు సిక్సర్​తో కోహ్లీ జట్టును విజయతీరాలకు చేర్చాడు. దాంతో బెంగళూరు శిబిరంలో సంబరాలు మిన్నంటాయి.

బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన గుజరాత్‌

టాస్‌ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్‌ రజత్‌ పటీదార్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. అతడి నిర్ణయాన్ని బెంగళూరు బౌలర్లు సమర్థించారు. గుజరాత్‌ టైటాన్స్‌ టాప్‌ ఆర్డర్‌ను ఆరంభంలోనే కుదిపేశారు. శుభ్‌మన్‌ గిల్‌ 8 బంతుల్లో 10 పరుగులు చేసి జోష్‌ హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. సాయి సుదర్శన్‌ 12 బంతుల్లో 12 పరుగులు చేసి భువనేశ్వర్‌ కుమార్‌కు చిక్కాడు.

నిశాంత్‌ సింధు 18 బంతుల్లో 20 పరుగులు చేసి రషీఖ్‌ సలామ్‌ దర్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో 8 ఓవర్లకు గుజరాత్‌ 55/3తో ఇబ్బందుల్లో పడింది. జోస్‌ బట్లర్‌ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. 23 బంతుల్లో 19 పరుగులు చేసిన అతడిని కృనాల్‌ పాండ్య బోల్తా కొట్టించాడు. ముందుకొచ్చి భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన బట్లర్‌ను వికెట్‌కీపర్‌ జితేశ్‌ శర్మ స్టంపౌట్‌ చేశాడు.

ఒకవైపు వికెట్లు పడుతున్నా వాషింగ్టన్‌ సుందర్‌ మాత్రం చివరి వరకు పోరాడాడు. 37 బంతుల్లో ఐదు ఫోర్లతో అజేయంగా 50 పరుగులు చేసి గుజరాత్‌ను గౌరవప్రదమైన స్కోరుకు చేర్చాడు. మొహమ్మద్‌ అర్షద్‌ ఖాన్‌ 6 బంతుల్లో 15 పరుగులు చేశాడు. చివర్లో రషీద్‌ ఖాన్‌ మూడు బంతుల్లో 7 పరుగులు సాధించాడు. దీంతో గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులు చేసింది.

ఆర్సీబీ బౌలర్లలో రషీఖ్‌ సలామ్‌ దర్‌ నాలుగు ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. జోష్‌ హేజిల్‌వుడ్‌ 37 పరుగులకు రెండు వికెట్లు, భువనేశ్వర్‌ కుమార్‌ 29 పరుగులకు రెండు వికెట్లు తీశారు. కృనాల్‌ పాండ్య 23 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన బట్లర్‌ వికెట్‌ను పడగొట్టాడు.

అరుదైన ఘనత : వరుస టైటిళ్లు గెలిచిన జట్ల సరసన రాయల్​ చాలెంజర్స్​

గత సీజన్‌లో తొలి ఐపీఎల్‌ కప్‌ను అందుకున్న ఆర్సీబీ.. ఇప్పుడు టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకుంది. వరుసగా రెండు సీజన్లలో ట్రోఫీని గెలుచుకుని చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ సరసన నిలిచింది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తొలి కప్‌ను అందుకున్న బెంగళూరు.. ఏడాది వ్యవధిలోనే మరో ట్రోఫీని ఖాతాలో వేసుకుని ఐపీఎల్‌లో కొత్త శకానికి నాంది పలికింది.

156 పరుగుల లక్ష్యం పైకి సాధారణంగానే కనిపిస్తున్నా.. ఫైనల్‌ ఒత్తిడిలో ఛేదన అంత సులభం కాదు. రషీద్‌ ఖాన్‌, కగిసో రబాడా, మొహమ్మద్‌ సిరాజ్‌ వంటి బౌలర్లను ఎదుర్కొంటూ ఆర్సీబీ బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాల్సి ఉంది. గత సీజన్‌లో తొలిసారి ఐపీఎల్‌ ట్రోఫీని అందుకున్న బెంగళూరు.. ఈ లక్ష్యాన్ని ఛేదిస్తే వరుసగా రెండోసారి విజేతగా నిలిచి చరిత్ర సృష్టిస్తుంది.

 

సంక్షిప్త స్కోరు

రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు: 157/5

  1. విరాట్​ కోహ్లీ: 70 నాటౌట్​ (42)
  2. వెంకటేశ్​ అయ్యర్​: 32(16) 
  3. టిమ్​ డేవిడ్​: 24(17)

 

గుజరాత్​ బౌలింగ్​:

  1. రషీద్​ ఖాన్​: 2/25
  2. సిరాజ్​: 1/36
  3. రబాడ: 1/44
  4. అర్షద్​: 1/21

 

గుజరాత్‌ టైటాన్స్‌: 155/8 — 20 ఓవర్లు

  1. వాషింగ్టన్‌ సుందర్‌: 50 నాటౌట్‌ (37)
  2. నిశాంత్‌ సింధు: 20 (18)
  3. జోస్‌ బట్లర్‌: 19 (23)
  4. మొహమ్మద్‌ అర్షద్‌ ఖాన్‌: 15 (6)

 

 

బెంగళూరు బౌలింగ్​:

  1. రషీఖ్‌ సలామ్‌ దర్‌: 3/27
  2. జోష్‌ హేజిల్‌వుడ్‌: 2/37
  3. భువనేశ్వర్‌ కుమార్‌: 2/29
  4. కృనాల్‌ పాండ్య: 1/23