Team India | టీమిండియాకు ఘన స్వాగతం.. ముంబైలో జన నీరాజనం

టీ 20 ప్రపంచ కప్ సాధించిన టీమిండియా జట్టు ఆటగాళ్లకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ ఇండియా ఆటగాళ్లు స్వదేశానికి చేరుకున్న క్రమంలో ఢిల్లీ విమానాశ్రయంలో అభిమానులు. అధికారులు ఘన స్వాగతం పలికారు

Team India | టీమిండియాకు ఘన స్వాగతం.. ముంబైలో జన నీరాజనం

ప్రధాని మోదీ అభినందనలు

విధాత : టీ 20 ప్రపంచ కప్ సాధించిన టీమిండియా జట్టు ఆటగాళ్లకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ ఇండియా ఆటగాళ్లు స్వదేశానికి చేరుకున్న క్రమంలో ఢిల్లీ విమానాశ్రయంలో అభిమానులు. అధికారులు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11 గంటలకు రోహిత్ సేన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. టీమిండియా ఆటగాళ్లను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా క్రికెటర్లను మోదీ అభినందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన రాహుల్ ద్రావిడ్‌లను ప్రశంసించారు. విజేతగా నిలిచేందుకు ప్రతి ఒక్కరు అద్భుతంగా ఆడారని ఆటగాళ్లను కొనియాడారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కార్యదర్శి జైషా కూడా ప్రధాని కలిశారు.

ఈ సందర్భంగా ప్రధానికి వారిద్దరూ ప్రత్యేకంగా భారత జెర్సీని అందజేశారు. ఇంగ్లీషులో నమో అని ఒకటో నెంబర్‌తో కూడిన జెర్సీని బహుకరించారు. ఈ ఫోటోలను బీసీసీఐ షేర్ చేసింది. ప్రధాని అభినందనలు స్ఫూర్తివంతమైన మాటలను ఆచరణలోకి తీసుకొస్తామని మీ అమూల్యమైన మద్దతు ఇలానే టీమిండియా పై ఉండాలని కోరుకుంటున్నామని క్యాప్షన్ జోడించారు. భారత జట్టులోని ప్రతి ఒక్కరితో ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఫోటోలు దిగారు. వెంట వచ్చిన కుటుంబ సభ్యులను, వారి పిల్లలను సరదాగా మోదీ పలకరించారు. బూమ్రా కొడుకు అంగద్‌ను ఎత్తుకుని బుజ్జగించారు. ప్రధానితో సమావేశం ముగిశాక ప్రత్యేక విమానంలో టీమిండియా ముంబైకి బయలుదేరింది.

ముంబైలో జన నీరాజనం

ఢిల్లీ నుంచి ముంబైకు చేరుకున్న వెంటనే విమానాశ్రయంలో టీమిండియా ఆటగాళ్లకు అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌ పోర్టులో వాటర్‌ కేనాన్‌ స్వాగతం తెలిపారు. నారీమన్‌ పాయింట్‌ నుంచి వాంఖడే స్టేడియం వరకు సాయంత్రం రెండున్నర గంటల పాటు సాగిన రోడ్ షోలో రోహిత్ బృందం ఓపెన్ టాప్ బస్సులో కప్పుతో అభిమానులకు అభివాదం చేస్తూ సాగింది. టీం ఇండియా ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు అభిమానులు విమానాశ్రయం నుంచి స్టేడియం వరకు రోడ్ల వెంట వేలాదిగా బారులు తీరారు. రాత్రి వాంఖడే స్టేడియంలో బీసీసీఐఆధ్వర్యంలో భారత జట్టును ఘనంగా సన్మానించారు. అభిమానులు, ప్రజల నుంచి టీమిండియాకు లభించిన అపూర్వ ఆదరణతో ఆటగాళ్లంతా ఉబ్బితబ్బిబ్బయ్యారు. అపూర్వ స్వాగతం పలికిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. జీవితంలో తామందరికి ఇవి మరిచిపోలేని మధుర జ్ఞాపకాలని చెప్పారు.