Therapist Attacks Woman : మసాజ్‌ సర్వీస్‌ రద్దు చేసుకున్నందుకు మహిళపై థెరపిస్ట్‌ దాడి.. షాకింగ్‌ వీడియో

ముంబైలో దారుణం! మసాజ్ సర్వీస్ రద్దు చేసినందుకు మహిళపై థెరపిస్ట్ దాడి. జుట్టు లాగి ముఖంపై పిడిగుద్దులు కురిపించిన వీడియో వైరల్. అర్బన్ కంపెనీపై నెటిజన్ల ఫైర్..

Therapist Attacks Woman : మసాజ్‌ సర్వీస్‌ రద్దు చేసుకున్నందుకు మహిళపై థెరపిస్ట్‌ దాడి.. షాకింగ్‌ వీడియో

ఈ కామర్స్‌ సంస్థలు అందుబాటులోకి వచ్చాకా మనం ఇంటికి కావల్సిన వస్తువులను ఆన్‌లైన్‌ ద్వారా ఆర్డర్‌ పెట్టుకుంటున్నాం. సరకులు కొనేందుకు ప్రత్యేకంగా సూపర్‌ మార్కెట్స్‌కు వెళ్లడం చాలా వరకూ తగ్గించాం. ఆఖరికి ఫుడ్‌ కావాలన్నా స్విగ్గీ, జొమాటో వంటి యాప్స్‌ ద్వారా ఆర్డర్‌ పెట్టుకుంటున్నాం. అలానే చాలా మంది హోమ్‌ సర్వీసెస్‌, బ్యూటీ సర్వీసెస్‌ను కూడా ప్రముఖ యాప్స్‌ ద్వారా బుక్‌ చేసుకుంటున్నారు. వాళ్లు మన ఇంటి వద్దకే వచ్చిన మనకు కావల్సిన సర్వీస్‌ను అందించి వెళ్తున్నారు.

అయితే, తాజాగా మసాజ్ సర్వీస్‌ కోసం బుక్‌ చేసుకున్న మహిళకు షాకింగ్‌ అనుభవం ఎదురైంది. కొన్ని కారణాల వల్ల సర్వీస్‌ను రద్దు చేసుకున్నందుకు సదరు మహిళపై ఓ థెరపిస్ట్‌ దాడి చేసింది (Therapist attacks woman). జుట్టుపట్టుకుని దారుణంగా కొట్టింది. పంచులు విసిరింది. ఈ ఘటన మహారాష్ట్ర ముంబైలో (Mumbai) వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

ముంబైలోని వడాలా (Wadala) ప్రాంతంలో నివసించే 46 ఏండ్ల మహిళ.. అర్బన్‌ కంపెనీ ద్వారా తన ఫ్రోజెన్ షోల్డర్ సమస్యకు చికిత్స కోసం మసాజ్ సర్వీస్ బుక్ చేసుకుంది. బుక్‌ చేసుకున్న టైమ్‌కే ఓ మహిళా థెరపిస్ట్ ఆమె ఇంటికి వచ్చింది. అయితే, ఆ థెరపిస్ట్ ప్రవర్తన బాధిత మహిళకు నచ్చలేదు. అసౌకర్యంగా భావించింది. అంతేకాదు, మసాజ్‌ కోసం తెచ్చిన బెడ్‌ కూడా గదిలో పట్టలేదు. దీంతో ప్రైవసీ సమస్యలు తలెత్తడంతో సదరు మహిళ సర్వీస్‌ను రద్దు చేసుకుంది.

మహిళ నిర్ణయం థెరపిస్ట్‌కు ఆగ్రహం తెప్పించింది. మహిళతో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగి దాడి చేసుకునే వరకూ వచ్చింది. ఆగ్రహంతో ఉన్న థెరపిస్ట్.. మహిళపై దాడి చేసింది. జుట్టు పట్టుకుని కొట్టడమే కాకుండా.. ముఖంపై పిడిగుద్దులు కురిపించింది. థెరపిస్ట్‌ దాడిలో సదరు మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ మేరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి :

Viral Video | అమెజాన్ అడవుల్లో అతిపెద్ద అనకొండ వీడియో వైరల్
2nd National Highway | భద్రాద్రి కొత్తగూడెంకు వరం.. రెండో జాతీయ రహదారి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్