India Vs England | జడేజా పోరాటం వృథా – మూడో టెస్ట్‌లో భారత్ గెలుపు ముంగిట ఓటమి
లార్డ్స్ మైదానంలో జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా (61 నాటౌట్) ఒంటరిగా పోరాడినా భారత్‌కు విజయాన్ని అందించలేకపోయాడు. బెన్ స్టోక్స్, ఆర్చర్ నేతృత్వంలో ఇంగ్లండ్ విజయం సాధించి సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.

Adharva / Sport News / 15 July 2025
లండన్, జూలై 14: ప్రపంచ క్రికెట్‌కు పుట్టినిల్లు లార్డ్స్ మైదానం మరోసారి టెస్ట్ క్రికెట్‌కు న్యాయం చేసింది. ఐదు రోజుల నాటకం, అసాధారణ తపన, ఆటగాళ్ల కఠిన శ్రమ, తుదకు శ్వాస ఆపేసే ముగింపు… ఇది నిజమైన టెస్ట్ క్రికెట్! కానీ భారత అభిమానులకు మాత్రం ఇదో బాధాకరమైన రోజు. రవీంద్ర జడేజా చివరి వరకు పోరాడినా భారత్‌కి విజయాన్ని అందించలేకపోయాడు. ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-1తో ముందంజలో నిలిపింది.
చివరి రోజు ఉదయం నుంచే ఒత్తిడి
మ్యాచ్ ఐదవ రోజు ఉదయం భారత్‌కు 135 పరుగులు అవసరంగా ఉండగా, జట్టులో నాలుగు వికెట్లు మాత్రమే మిగిలి ఉండడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన సైనికులను ముందుకు నడిపించగా, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ తదితర బౌలర్లు భారత మిడిలార్డర్‌ను వరుసగా కూల్చేశారు. ప్రారంభంలోనే కేఎల్ రాహుల్ (100, తొలి ఇన్నింగ్స్), రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్ వికెట్లు కోల్పోవడంతో భారత్ తడబడింది. ఆర్చర్ వేయించిన బంతి పంత్ ఆఫ్ స్టంప్‌ను చీల్చడం, ఆపై అతని సంబరాలు మైదానంలో ఉద్రిక్తతలు రేపాయి. తొలినుండి ఒత్తిడిలో ఉన్న జడేజా, మరోసారి తన ఒత్తిడి స్థితిలో శాంతంగా వ్యవహరించగల సామర్థ్యాన్ని నిరూపించాడు. ఇది అతని వరుసగా నాలుగవ అర్ధశతకం కావడం విశేషం. తొలుత నితీష్ కుమార్ రెడ్డితో కలిసి 89 బంతుల్లో 30 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే వోక్స్ వేసిన బంతిని రెడ్డి గ్లవ్స్‌కు తాకడంతో మరో కీలక వికెట్ కోల్పోయింది. ఇక్కడే భారత్ ఓటమికి బీజం పడింది. ఆ తర్వాత బుమ్రా జతకాగా, అతను తన సహనానికి మరోసారి నిదర్శనం అయ్యాడు. జడేజా–బుమ్రా కలిసి 131 బంతుల పాటు పోరాడారు. బంతి పాతబడిన తరుణంలో ఇంగ్లండ్ బౌలర్లు అలసిపోతుండగా, భారత్ ఒక్కో పరుగుగా గమ్యాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది. అయితే స్టోక్స్ మరొకసారి అద్భుతమైన స్పెల్‌తో బుమ్రాను హుక్‌కి ప్రేరేపించి టాప్ ఎడ్జ్ ద్వారా ఔట్ చేసాడు. బుమ్రా ఔట్ కావడంతో భారత్‌కు చివరి గడియలు మొదలయ్యాయి. చివరికి షోయబ్ బషీర్ వేసిన బంతిని మొహమ్మద్ సిరాజ్ అండర్ ఎడ్జ్ అయ్యి బౌల్డ్ కావడంతో మ్యాచ్ ముగిసింది.
జడేజా – కేవలం ఆల్‌రౌండర్ కాదు, యోధుడు
వరుసగా వికెట్లు కూలిపోతున్నా, మహా మహా బ్యాటింగ్ వీరులు పెవిలియన్‌కు చేరుకున్నా, జడేజా పోరాటం మాత్రం అసామాన్యం. బౌలర్ల ఓపికకు పరీక్ష పెడుతూ, తన డిఫెన్స్‌తో వారికి తీవ్ర అసహనాన్ని కలిగించాడు. అడపాదడపా, సింగిల్స్ తీస్తూ, రెండో పక్క ఉన్న బ్యాటర్‌కు చాన్స్ ఇవ్వకుండా, తానే రెండు పక్కలా అయి, అద్భుతంగా రాణించాడు. 181 బంతులెదుర్కొని 61 పరుగులు చేసాడంటేనే ఎంత ఓపిగ్గా ఉన్నాడో అర్థమవుతుంది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తనే బౌలింగ్ తీసుకుని శతవిధాలా ప్రయత్నించినా, జడేజాను వెనక్కి పంపలేకపోయారు. నైట్ వాచ్‌మన్ ఆకాశ్‌దీప్‌కు సింగిల్ తీసుకుని ఔటయ్యే అవకాశమిచ్చిన మేటి బ్యాటర్ కేఎల్ రాహుల్ కంటే జడేజా ఎంతో పరిణితిని కనబర్చాడు.
స్కోరు వివరాలు సంక్షిప్తంగా:
⦁ ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్: 387/10 (రూ. రూట్ 104, బుమ్రా 5/74)
⦁ భారత్ మొదటి ఇన్నింగ్స్: 387/10 (కేఎల్ రాహుల్ 100, వోక్స్ 3/84)
⦁ ఇంగ్లండ్ రెండవ ఇన్నింగ్స్: 192/10 (రూ. రూట్ 40, వాషింగ్టన్ 4/22)
⦁ భారత్ రెండవ ఇన్నింగ్స్: 170/10 (జడేజా 61*, స్టోక్స్ 3/48, ఆర్చర్ 3/55)
మ్యాచ్ ముగింపు – భావోద్వేగాల సంధి
మ్యాచ్ చివర్లో సిరాజ్ ఔట్ అయిన తరువాత స్టోక్స్ నేరుగా జడేజా వద్దకు వెళ్లి మెచ్చుకోలుగా హగ్ ఇచ్చాడు. గత రెండు రోజుల్లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ , ఆటలో ఉన్న నిజమైన హుందాతనం అక్కడ కనిపించింది. ఇది కేవలం ఓటమి కాదు – ప్రతి భారత క్రికెట్ అభిమానికి గుండె పగిలే అనుభూతి. కానీ ఇదే సమయంలో ఇది టెస్ట్ క్రికెట్ మజా అంటే ఏమిటో ప్రపంచానికి చూపించిన గొప్ప ఉదాహరణ కూడా.