Asteroid 2022 YS5 | పదంతస్థుల బిల్డింగ్​ సైజులో ఆస్టరాయిడ్​ – జూలై 17న భూమికి చేరువగా..!

120 అడుగుల పొడవున్న 2022 YS5 అనే గ్రహశకలం జూలై 17న భూమికి అత్యంత సమీపంగా 22,500 కిమీ వేగంతో దాటనుంది. నాసా మరియు ఇస్రో ప్రకటన ప్రకారం ఇది ప్రమాదకరం కాదు కానీ, భవిష్యత్తు ఖగోళ ప్రమాదాలపై హెచ్చరికగా మాత్రం ఉంటుంది.

Asteroid 2022 YS5 | పదంతస్థుల బిల్డింగ్​ సైజులో ఆస్టరాయిడ్​ – జూలై 17న భూమికి చేరువగా..!

Adharva / Science & Tech / 17-July 2025

Asteroid 2022 YS5 | ఈ మధ్యకాలంలో ఖగోళ విశ్వంలో జరిగే ప్రతి కదలిక మనకు తెలిసిపోతోంది. ఖగోళ శిలలు, గ్రహశకలాలు, ఉల్కాపాతం వంటి పదాలు ఇక మనకు కొత్తగా అనిపించవు. కానీ తాజాగా భూమికి అత్యంత సమీపంగా వచ్చిన ఒక గ్రహశకలం — 2022 YS5 — శాస్త్రవేత్తలను మరింతగా ఆకర్షించింది. ఈ గ్రహశకలాన్ని సాధారణంగా చురుకైన శోధక వ్యవస్థల ద్వారా గుర్తించారు. దీని పొడవు సుమారు 120 అడుగులు, అంటే సగటున పది అంతస్తుల భవనమంత ఉంటుంది. అంతేకాదు, ఇది గంటకు 22,500 కిలోమీటర్ల రికార్డ్ వేగంతో భూమిని దాటి పోతుంది. భూమికి చేరువగా వచ్చినప్పుడు దూరం 4.15 మిలియన్ కిలోమీటర్లు. మనకు ఇది చాలా దూరంగా అనిపించవచ్చు, కానీ ఖగోళ పరంగా చూస్తే ఇది చాలా దగ్గరే.

భూమికి ముప్పు ఉందా?

NASA మరియు ISRO రెండూ ఈ గ్రహశకలంపై పరిశీలన జరిపాయి. NASA ప్రకారం, భూమికి 7.4 మిలియన్ కిమీ లోపలికి రాకపోతే, అలాగే పరిమాణం 85 మీటర్ల కంటే చిన్నగా ఉంటే, అది “ప్రమాద హేతువు()గా పొటెన్షియల్ హాజర్డస్” గాపరిగణించబడదు. ఈ మేరకు 2022 YS5 ప్రస్తుతం ముప్పుగా పరిగణించబడడం లేదు. కానీ ఇది భవిష్యత్‌కి సంబంధించి శాస్త్రవేత్తలకు ఒక మేలుకొలుపు వంటిది.

ఎందుకంత జాగ్రత్త అవసరం?

గ్రహశకలాలు చాలా వేగంగా పయనిస్తూ ఉంటాయి. అంతరిక్షంలోని గురుత్వాకర్షణ క్షేత్రాలు, సూర్యరశ్మి ప్రభావం, ఇతర గ్రహాల ఆకర్షణలు వంటివి వాటి మార్గాన్ని కొద్దకొద్దిగా మార్చే అవకాశముంది. అటువంటి ఒక చిన్న దారి మార్పు, గ్రహశకలాన్ని భూమి వైపు తిప్పగలదు. ఇంతకంటే చిన్న పరిమాణం ఉన్న శిలలు కూడా భూమి వాతావరణంలోకి ప్రవేశించి ఎయిర్‌బస్ట్ (వాతావరణంలో పేలిపోవడం) రూపంలో హాని కలిగించే అవకాశముంది. ఉదాహరణకి, 2013లో రష్యాలోని చెలియాబిన్స్క్ వద్ద జరిగిన ఎయిర్‌బస్ట్ వలె:
⦁ 30 మీటర్ల పరిమాణం ఉన్న శిల వాతావరణంలో పేలిపోయింది.
⦁ 1,600 మందికి పైగా గాయాలయ్యాయి.
⦁ కిటికీలు పగిలిపోయాయి.
⦁ పేలుడు శబ్దం చాలా ప్రాంతాల వరకూ వినిపించింది.

2022 YS5 కూడా ఇదే తరహాలో ఒకరోజు భూమిని తాకితే, అది 1200–2400 అడుగుల వ్యాసంతో పెద్ద గొయ్యిని సృష్టించగలదు. ఇది భూమిపై అయితే భూకంపాలు, సముద్రంలో అయితే సునామీలుగా మారే ప్రమాదం ఉంటుంది.

గ్రహరక్షణ వ్యవస్థలపై ISRO, NASA దృష్టి

ISRO ఛైర్మన్ ఎస్​. సోమ్​నాథ్​ (S. Somanath) పేర్కొన్నట్లు, ఇది ప్రత్యక్ష ముప్పు కాకపోయినా, ముందుజాగ్రత్త చర్యలకు ఇది సరైన సమయం. 2029లో భూమిని మరింత సమీపంగా దాటనున్న అపోఫిస్​(Apophis) అనే భారీ గ్రహశకలాన్ని దృష్టిలో పెట్టుకుని:
⦁ ISRO ఇప్పటికే గ్రహరక్షణ వ్యవస్థల (Planetary Defense ) కోసం ప్రణాళికలు రూపొందిస్తోంది.
⦁ NASA, ESA, JAXA వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తోంది.
⦁ గ్రహశకలాలపై ల్యాండింగ్, వాటి మార్గం మార్చే గతి ప్రభావం, గురుత్వాకర్షణతో లాగడం వంటి సాంకేతికతలపై ప్రయోగాత్మక పరిశోధన జరుగుతోంది.

శాస్త్రవేత్తల హెచ్చరిక: ఈ రోజు చిన్నది, రేపు పెద్దది కావచ్చు

2022 YS5 ఇప్పుడు ముప్పుగా పరిణమించకపోయినా, ఇది మనకు చెప్పేది ఒక్కటే – ఖగోళశిలలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పటివరకు గుర్తించిన Near-Earth Objects (NEOs) సంఖ్య లక్షలలో ఉంది. వాటిలో ఏ ఒక్కటైనా మార్గం తప్పితే, అది మానవాళికి పెనుముప్పుగా మారొచ్చు. దాంతోపాటు, చిన్న గ్రహశకలాలను గుర్తించడంలో టెలిస్కోప్‌లు, డేటా మోడలింగ్, క్రమబద్ధమైన అబ్జర్వేషన్, ఇవన్నీ కీలకంగా మారుతున్నాయి. 2022 YS5 ఇప్పుడు మనల్ని వదిలేయవచ్చు. కానీ ఇదే తరహా శిలలు గతంలో నిశ్శబ్దంగా భూమిని చేరిన సందర్భాలు చరిత్రలో ఉన్నాయి. మానవాళి ఇప్పుడు పరిశీలన, సాంకేతికత, అంతర్జాతీయ భాగస్వామ్యం అనే మూడు ఆయుధాలతో ఇటువంటి ఖగోళ ముప్పులను ఎదుర్కొవాలి.