కన్నీటి కిన్నెర.. కూలీగా మారిన పద్మశ్రీ మొగులయ్య, కేటీఆర్ రియాక్షన్!
కిన్నెర అంటే మొగులయ్య.. మొగులయ్య అంటే కిన్నెర.. తెలుగు రాష్ట్రాల్లో కిన్నెర వాయిద్యానికి తన గాత్రంతో విశేష గుర్తింపు తీసుకొచ్చారాయన. అందుకే ఆయన సేవలకుగానూ పద్మశ్రీ అవార్డు సైతం వరించింది

కిన్నెర అంటే మొగులయ్య.. మొగులయ్య అంటే కిన్నెర.. తెలుగు రాష్ట్రాల్లో కిన్నెర వాయిద్యానికి తన గాత్రంతో విశేష గుర్తింపు తీసుకొచ్చారాయన. అందుకే ఆయన సేవలకుగానూ పద్మశ్రీ అవార్డు సైతం వరించింది. అయితే దర్శనం మొగులయ్యకు జీవనోపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ప్రస్తుతం ఆయన కూలీగా మారి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుంచి గౌరవ వేతన అంతకపోవడం వల్లనే కూలీగా మార్చాల్సి వచ్చిందని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొగిలయ్య తొమ్మిది మంది పిల్లల తండ్రి. మొగులయ్య కుమారుల్లో ఒకరు మూర్ఛతో బాధపడుతున్నారు. మందులకు కోసం నెలకు కనీసం రూ.7,000 కావాల్సి ఉంటుది. ఇక క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే ముగ్గురు పిల్లలు అనారోగ్యంతో చనిపోయారు. ముగ్గురికి పెళ్లయింది. మరో ముగ్గురు ఇప్పటికీ మొగులయ్యపై ఆధారపడి జీవిస్తున్నారు. భార్య నాలుగేళ్ల క్రితం చనిపోయింది.
2022లో మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు రావడంతో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను సన్మానించి కోటి రూపాయల రివార్డు, హైదరాబాద్ లో ఇంటి స్థలం ప్రకటించారు. ఆ డబ్బును పిల్లల పెళ్లిళ్లకు ఉపయోగించాడు. తుర్కయంజాల్ లో ఇల్లు కట్టుకోవడం ప్రారంభించినా నిధులు లేకపోవడంతో మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. అయితే 2015లో తెలంగాణ ప్రభుత్వం మొగిలయ్యకు రాష్ట్ర అత్యున్నత పురస్కారం ఉగాది పురస్కారంతో పాటు నెలకు రూ.10 వేల పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆ వేతనం ప్రస్తుతం ఆగిపోయింది. దీంతో కూలీ పనులకు వెళ్లాల్సిన దయనీయ పరిస్థిత నెలకొంది.
కాగా మొగులయ్యను ఆదుకుంటామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. మొగిలయ్య దయనీయ పరిస్థితిపై మీడియాలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ ఎక్స్ లో పెట్టిన పోస్టుకు స్పందించి మొగిలయ్య కుటుంబాన్ని వ్యక్తిగతంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు కేటీఆర్. “ఈ వార్తను నా దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు సుచేతా గారూ, మొగిలయ్య కుటుంబాన్ని నేను వ్యక్తిగతంగా చూసుకుంటాను. నా టీమ్ వెంటనే ఆయనను సంప్రదిస్తాం’ అని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ప్రస్తుతం మొగులయ్య పరిస్థితి దుర్భరంగా మారడంతో ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని తోటి కళాకారులు కోరుతున్నారు.