Constable Family Attack On Old Woman At Madannapet | కానిస్టేబుళ్ల కుటుంబాల వీరంగం..వైరల్ గా వీడియోలు

తెలంగాణలో కానిస్టేబుళ్ల కుటుంబం వివాదాస్పద దాడులు, సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి.

Constable Family Attack On Old Woman At Madannapet | కానిస్టేబుళ్ల కుటుంబాల వీరంగం..వైరల్ గా వీడియోలు

విధాత : శాఖపరంగా క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే పోలీసులు..వారి కుటుంబ సభ్యులు ఇటీవల అనుచిత చర్యలకు పాల్పడుతూ వివాదాల పాలవుతున్నారు. తాజాగా రెండు వేర్వేరు జిల్లాల్లో పోలీసు కుటుంబాలు చేసిన దౌర్జన్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నల్లగొండ జిల్లా కేంద్రం క్లాక్ టవర్ సెంటర్ లో తమ కారుకు బస్సు తగిలిందన్న కోపంతో బస్సు డ్రైవర్ పై విజిలెన్స్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు దాడి చేసి చితక బాదారు. ఈ ఘటనను వృత్తి పరంగా వీడియో తీసిన భవాని మాతా మాల దీక్షలో ఉన్న జర్నలిస్టుపై కూడా అసభ్యకర బూతులపై చెలరేగిపోయారు. మేం పోలీసు కుటుంబమని..పెద్ద అధికారులకు చెప్పిన మాకేం కాదంటూ కానిస్టేబుల్ భార్య, కొడుకు రెచ్చిపోయారు. ఈ ఘటనపై జర్నలిస్టు, బస్సు డ్రైవర్ తో పాటు కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులుసీసీ ఫుటేజు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

వృద్ధురాలిపై దౌర్జన్యం

కుక్కను తీసుకొచ్చి తమ ఇంటి ముందు మలవిసర్జన చేయిస్తున్నారని ప్రశ్నించిన వృద్ధురాలిపై ఓ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు దారుణంగా దాడి చేసిన ఘటన హైదరాబాద్‌ మాదన్నపేటలో చోటుచేసుకుంది. తన ఇంటి ముందు పోలీస్ కానిస్టేబుల్ కుక్కకు మలవిసర్జన చేయిస్తున్నాడని వృద్ధురాలి ప్రశ్నించింది. దీంతో ఆ కానిస్టేబుల్ తన భార్య, సోదరిని పిలిచి వృద్ధురాలి మీద దాడి చేయించాడు. 60ఏళ్ల వృద్దురాలని కూడా చూడకుండా పిడిగుద్దులు గుద్దుతూ, కర్రతో దాడి చేశారు. ఈ ఘటనపై మాదన్నపేట పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.