Adilabad | విశ్వాసానికి మారు పేరుగా శునకాన్ని పోల్చుతుంటారు. ఎందుకంటే అది నమ్మిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అవసరమైతే శత్రువుతో పోరాడి.. తన ప్రాణాలను పణంగా పెడుతుంది. అయితే ఓ శునకం కూడా తన ఆకలి తీర్చిన భక్తుల పట్ల తన విశ్వాసాన్ని ప్రదర్శించింది. భక్తులతో కలిసి ఆ కుక్క 130 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ నుంచి హనుమాన్ భక్తులు కొండగట్టుకు పాదయాత్రగా బయల్దేరారు. మాల విరమణ చేసేందుకు వెళ్తున్న ఆ భక్తులకు ఉట్నూర్ వద్ద ఓ శునకం తోడైంది. శునకం ఆకలితో బాధపడుతున్నట్లు భక్తులు గమనించారు. తక్షణమే ఐదు రూపాయాల విలువ చేసే బిస్కెట్ ప్యాకెట్ కొని దాని ఆకలి తీర్చారు.
కుక్క మనసులో ఏమనుకుందో ఏమో తెలియదు కానీ.. ఆ భక్తులతో కలిసి ఐదు రోజులుగా పాదయాత్ర చేస్తుంది. ఏకంగా 130 కిలోమీటర్ల మేర భక్తులతో పాటు పాదయాత్ర చేసింది. ఈ క్రమంలో కుక్క కాళ్లకు నొప్పులు రాగా.. దానికి సాక్సులు తొడిగి.. ప్రేమగా సపర్యలు చేశారు దీక్షాపరులు.
