TELANGANA | స్పీకర్‌తో భేటీయైన బీఆరెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల ఫిరాయింపులు..ప్రోటోకాల్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు
అసెంబ్లీ లో స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో బీఆరెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మంగళవారం స్పీకర్‌ను కలిసిన బీఆరెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు తీసుకోవాలని, అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు

చేతుల్లో రాజ్యాగం. .చేతల్లో ఫిరాయింపులంటూ కేటీఆర్ విమర్శలు
స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే రాజ్యాంగ వ్యవస్థల ద్వారా న్యాయపోరాటం
విధాత, హైదరాబాద్ : అసెంబ్లీ లో స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో బీఆరెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మంగళవారం స్పీకర్‌ను కలిసిన బీఆరెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు తీసుకోవాలని, అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలు టి.హరీశ్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డిల ఆధ్వర్యంలో బీఆరెస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిశారు. స్పీకర్‌తో భేటీ అనంతరం బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ చేతుల్లో రాజ్యాంగం పట్టుకుని పార్లమెంటులో ఫోజులు కొడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్నారు. తుక్కుగూడ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఫిరాయింపులకు వ్యతిరేకంగా హామిలిచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో ఫిరాయింపులు కొనసాగిస్తుందని కేటీఆర్ విమర్శించారు. హర్యానాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరితే అనర్హత వేటు కోసం డిమాండ్ చేస్తుందని, కర్ణాటకలో బీజేపీ మా ఎమ్మెల్యేలను 50కోట్ల చొప్పున కొంటుందని సీఎం సిద్ధరామయ్య ఆరోపించిన సంగతిని కూడా స్పీకర్‌కు గుర్తు చేశామన్నారు. గోవాలో రాహుల్‌గాంధీ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయించబోమని శపథం చేయించారన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మల్యేలు బీజేపీకి ఓటు వేస్తే స్పీకర్ అనర్హత ఓటు వేశారని, దానిపై ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు వెళితే స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతించిందని తాము స్పీకర్‌కు గుర్తు చేశామన్నారు. మహారాష్ట్రలో జరుగుతున్న ఫిరాయింపుల పరిణామాలను కూడా స్పీకర్‌కు నివేదించామన్నారు. స్పీకర్ సుప్రీం మార్గదర్శకాల మేరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలన్నారు. ఈ విషయంలో స్పీకర్ ప్రసాద్ మాటలకు పరిమితం కాకుండా చర్యలు చూపించాలన్నారు. బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి, ప్రజాక్షేత్రంలో వారి బలాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. స్పీకర్‌ను కొంతమంది అనర్హత అంశంపై ఎలాంటి ఇబ్బంది ఉండదని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. స్పీకర్‌పై తమకు విశ్వాసం ఉందని, లేదంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై రాజ్యాంగ బద్ధ సంస్థలు, కోర్టుల ద్వారా పోరాడుతామన్నారు. పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గంలోని డీఎస్పీలు ఫోన్ చేసి మీరు పార్టీ మారండి లేదంటే ప్రాణగండం ఉందని భయపెట్టారని కేటీఆర్ ఆరోపించారు.
ప్రోటోకాల్ ఉల్లంఘనలపై చర్యలకు వినతి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల ప్రోటోకాల్ విషయంలో జరుగుతున్న ఉల్లంఘనలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. గత ఆరు నెలలుగా ప్రతి నియోజకవర్గంలో ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులకే ప్రభుత్వ అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రోటోకాల్ పాటించకుండా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల చేత ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. నిన్న మహేశ్వరంలో నియోజకవర్గలో ఎన్నికల్లో ఓడిపోయి మూడో స్థానంలో నిలిచిన అభ్యర్థిని స్టేజి పైన కూర్చొబెట్టారని,
పార్టీ కండువాలు వేసుకొని ప్రభుత్వ కార్యక్రమాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పాల్గొంటున్నారని సబితా పేర్కోన్నారు. గెలిచిన ఎమ్మెల్యేల హక్కులను కాపాడాలని మేము స్పీకర్‌ను కోరామని, నా నియోజకవర్గంలో ఎండో మెంట్ అధికారులతో పాటు పోలీసు అధికారులు కూడా సర్దుకు పొమ్మని ఎమ్మెల్యేకే చెప్పే పరిస్థితిని ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందన్నారు. ఇదేనా ప్రజా పాలన అంటే? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే ? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష శాసన సభ్యుల నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్థులను తీసుకువచ్చి కూర్చొబెడుతున్న మాదిరిగానే అధికార పార్టీ నియోజకవర్గాల్లోనూ ఓడిపోయిన అభ్యర్థులను వేదికపైన కూర్చోబెట్టుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పైన ఓడిపోయిన మా పార్టీ అభ్యర్థిని కూడా పక్కన కూర్చోబెట్టుకోవాలని, అవసరమైతే ఈ మేరకు చట్టాన్ని కూడా సవరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మా పార్టీకి చెందిన హుజురాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, అసిఫాబాద్, మహేశ్వరం వంటి అనేక నియోజకవర్గాల్లో పోలీసులు ప్రభుత్వ అధికారులు స్థానిక ఎమ్మెల్యేలపైనే కేసులు పెడుతున్నారని, ప్రజా సమస్యలను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్తే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఉన్న హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్వీకర్‌పై ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేసి ఈ దిశగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరామని తెలిపారు.
ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గతంలో నియోజకవర్గానికి సంబంధించి అనేక అంశాల పైన ప్రభుత్వానికి విజ్ఞాపనలు ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వ కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యేలను కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఇష్టానుసారంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు.
కాంగ్రెస్ నాయకులను ప్రత్యేక అతిథులుగా పిలుచుకొని మరి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఓడిపోయిన ఎమ్మెల్యేలు తమ వాహనాలపైన ఎర్రబుగ్గలు వేసుకొని తిరుగుతున్నారన్నారు. జిల్లా యంత్రాంగానికి ఆ విధంగానే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లుగా కనిపిస్తున్నదని, మా హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత మీ పైన ఉందన్నారు. స్పీకర్ కి తెలియకుండా ఎమ్మెల్యేల పైన కేసులో నమోదు చేస్తున్న విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ ప్రోటోకాల్ ఉల్లంఘనలు, పోలీస్ కేసుల పైన ఎమ్మెల్యేల హక్కులను స్పీకర్ కాపాడుతారని విశ్వాసం ఉందన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఓడిపోయిన వారిని అనుమతిస్తూ ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహిస్తున్నదన్నారు. ఓడిపోయిన ఎమ్మెల్యేలను కూడా శాసనసభకు అనుమతించాలని స్పీకర్‌కు సూచించామని, రానున్న శాసనసభ సమావేశాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులను కూడా శాసనసభలోకి ప్రభుత్వం తీసుకురావాలని కోరామని, ఇలాగే ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగితే న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.