నిజాం షుగర్స్ పునరుద్దరణకు వేయి కోట్లు కేటాయించండి
నిజాం షుగర్స్ పునరుద్దరణకు ఈ బడ్జెట్‌లో వేయి కోట్లు కేటాయించాలని తెలంగాణ చెరుకు రైతు వేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది

మంత్రి శ్రీధర్‌బాబును కోరిన చెరుకు రైతులు
సీఎంతో మాట్లాడి నిధులు కేటాయించేలా చూస్తా నన్న మంత్రి
విధాత: నిజాం షుగర్స్ పునరుద్దరణకు ఈ బడ్జెట్‌లో వేయి కోట్లు కేటాయించాలని తెలంగాణ చెరుకు రైతు వేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు గురువారం అసెంబ్లీలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో కలిసి చెరుకు రైతులు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కలిశారు. గత ప్రభుత్వం నిజాం షుగర్స్‌ను పునరుద్దరించకుండా చెరుకు రైతులకు తీరని అన్యాయం చేసిందని తెలిపారు. నిజాం షుగర్స్‌కు ఈ బడ్జెట్‌లో రూ. 1000 కోట్లు కేటాయిస్తే బోధన్, సారంగపూర్, ముత్యంపేట, మమ్మోజిపల్లి, జహీరాబాద్ చెక్కర కర్మాగారాలను పునరుద్దరించ వచ్చునన్నారు. దీంతో కార్మికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలుగడంతో పాటు చెరుకు రైతులకు మంచి గిట్టు బాటు అవుతుందని తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ చెరుకు రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని, దీనిపై సానుకూలంగా నిర్ణయం తీసుకొని నిజాం షుగర్స్ పునరుద్దరణ చర్యలు చేపట్టాలని రైతుల తరపున కోరారు. దీనికి సానుకూలంగా స్పంధించిన మంత్రి శ్రీధర్ బాబు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నిధులు కేటాయించేలా చూస్తానన్నారు. టెక్నికల్ వాళ్లను తీసుకొని ఫ్యాక్టరీని సందర్శిస్తామన్నారు. నిజాం పునరుద్దరణకు సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా ఉన్నాడని తెలిపారు.