Nagarjuna Sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లపై మళ్లీ ఏపీ దౌర్జన్యం

నాగార్జున సాగర్ డ్యామ్ క్రస్ట్‌గేట్ల వివాదంలో మరోసారి ఏపీ ఇరిగేషన్ అధికారులు దౌర్జన్యంగా వ్యవహరించారు. నాగార్జునసాగర్ డ్యామ్ పైనుంచి క్రస్ట్ గేట్ల సమీపానికి వెళ్లడానికి ఏర్పాటు చేసిన గేటు తాళాన్ని ఆంధ్రా అధికారులు ధ్వంసం చేశారు.

Nagarjuna Sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లపై మళ్లీ ఏపీ దౌర్జన్యం

వాక్ వే బ్రిడ్జి తాళం పగులగొట్టిన ఏపీ అధికారులు

విధాత, హైదరాబాద్ : నాగార్జున సాగర్ డ్యామ్ హక్కుల వివాదంలో మరోసారి ఏపీ ఇరిగేషన్ అధికారులు దౌర్జన్యంగా వ్యవహరించారు. నాగార్జునసాగర్ డ్యామ్ పైనుంచి క్రస్ట్ గేట్ల సమీపానికి వెళ్లడానికి ఏర్పాటు చేసిన గేటు తాళాన్ని ఆంధ్రా అధికారులు ధ్వంసం చేశారు. క్రస్ట్ గేట్ల సమీపానికి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన వాక్ వే బ్రిడ్జికి ఆంధ్రా, తెలంగాణ రెండు వైపులా గేట్లు ఏర్పాటు చేయగా నిర్వహణ పూర్తిగా తెలంగాణ అధికారులు చేపడుతున్నారు. ఆదివారం ఆంధ్రాకు సంబంధించిన సుమారు 20 మంది అధికారులు ఏపీ సీఎం పేషీ నుంచి వచ్చారు. వాక్ వే బ్రిడ్జి గేటు తాళం వేసి ఉండటంతో తెలంగాణ ఎన్నెస్పీ అధికారులను తాళం చెవి అడిగారు. తాళం చెవి ఇచ్చేందుకు కొంత సమయం పడుతుందని చెప్పడంతో ఆంధ్రా అధికారులు దౌర్జన్యంతో గేట్ తాళం పగులగొట్టి వాక్ వే బ్రిడ్జి మీదికి వెళ్లిపోయారు. గేటుకు కొత్త తాళం వేసి తాళం చేవి తమ వెంట తీసుకుపోయారు ఈ వివాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను తెలంగాణ అధికారులు ఉన్నతాధికారులకు పంపించారు.

ఈ ఘటనపై ఈఈ మల్లికార్జునరావును వివరణ కోరగా ఆంధ్రా అధికారులు తాళం పగులగొట్టిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఉన్నతాధికారులకు, కేఆర్‌ఎంబీకి నివేదించామని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. డ్యామ్ పహారా కాస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది ఆంధ్రా నుంచి ఎవరు వచ్చినా అనుమతిస్తున్నారని, ఐనప్పటికి వారు దౌర్జన్యంగా వ్యవహరించడం విచారకమన్నారు 13వ గేట్ వరకు తమ ఆధీనంలో ఉన్నదంటూ తరుచు ఏపీ అధికారులు తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని తెలంగాణ ఉద్యోగులు వాపోతున్నారు. డ్యామ్ కంట్రోల్ రూమ్ 26వ గేట్ అవతల ఉన్నదని అక్కడికి వెళ్లి డ్యూటీ చేసే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 18 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువలకు వదులుతున్నారు.