HYDRAA | హైడ్రా కీలక నిర్ణయం.. నివాసం ఉంటున్న ఏ ఇంటినీ కూల్చబోమని రంగనాథ్ ప్రకటన
HYDRAA | హైడ్రా( HYDRAA ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలో ఉన్న ఏ ఇంటినీ కూల్చబోమని ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం.. ఎఫ్‌టీఎల్( FTL ), బఫర్ జోన్( Buffer Zone )లో ఉన్న స్థలాలు, ఇండ్లు మాత్రం కొనుగోలు చేయొద్దని ప్రజలకు ఏవీ రంగనాథ్( AV Ranganath ) సూచించారు.

HYDRAA | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) నగరంలోని చెరువులు, నాలాలపై అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలు, ఇండ్లపై హైడ్రా( HYDRAA ) కొరడా ఝులిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. పలు వాణిజ్య భవనాలతో పాటు విల్లాలకు, ఇళ్లకు హైడ్రా నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్( AV Ranganath ) ఆదివారం కీలక ప్రకటన చేశారు. ఎఫ్‌టీఎల్( FTL ), బఫర్ జోన్( Buffer Zone )లో వచ్చే కొత్త నిర్మాణాలను మాత్రమే కూల్చుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఇప్పటికే నిర్మించి, అందులో ఎవరైనా నివాసం ఉంటే ఆ ఇండ్లను కూల్చబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంటేనే కూల్చేస్తామన్నారు. మల్లంపేట చెరువులో కూల్చివేస్తున్న భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఎలాంటి అనుమతుల్లేకుండా బఫర్ జోన్‌లో భవనాలు నిర్మిస్తున్నారు. సున్నం చెరువులో నిర్మించిన కొన్ని షెడ్లు వాణిజ్యపరంగా వినియోగిస్తున్నారు. గతంలో కూడా వాటిని కూల్చేశారు. మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతోనే ఇప్పుడు కూల్చివేస్తున్నాం. బిల్డర్ విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే కాటసాని భూపాల్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. ఆక్రమణలో ఉన్న ఏ ఇంటినీ కూల్చబోమని ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్న స్థలాలు, ఇండ్లు మాత్రం కొనుగోలు చేయొద్దని ప్రజలకు ఏవీ రంగనాథ్ సూచించారు.