సిద్దిపేటలో బర్డ్ ఫ్లూ పంజా.. వేల‌ల్లో కోళ్ల మృత్యువాత‌! పరిసరాల్లో పోలీసుల పికెటింగ్

సిద్దిపేటలో బర్డ్ ఫ్లూ పంజా.. వేల‌ల్లో కోళ్ల మృత్యువాత‌! పరిసరాల్లో పోలీసుల పికెటింగ్

విధాత : కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న బర్డ్ ఫ్లూ వైరస్ మరోసారి పంజా విసిరింది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం కాన్గల్‌లో బర్డ్ ఫ్లూ వెలుగుచూసింది. కాన్గల్ శివారులోని లేయర్ కోళ్ల ఫామ్ లలో బర్డ్ ఫ్లూతో ఇప్పటికే 20 వేలకు పైగా కోళ్లు మృతి చెందాయి. మిగిలిన 50 వేల కోళ్లను చంపేయాలని అధికారుల నిర్ణయించారు. 20 టీములుగా ఏర్పడి కోళ్లను చంపేసి పూడ్చేస్తున్నారు. కోళ్ల ఫామ్ పరిసరాల్లో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. కోళ్ల ఫామ్‌లో పని చేస్తున్నవారికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఈ నెల 4న శాంపిల్స్ సేకరించి భోపాల్ ల్యాబ్ కు పంపించగా.. వచ్చిన రిపోర్టులో బర్డ్ ఫ్లూగా తేలింది. దీంతో ఆయా ఫామ్ లలో ఉన్న 1.45లక్షలు కోళ్లను చంపి పూడ్చిపెట్టనున్నారు. సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ బర్డ్ ఫ్లూ పరిస్థితులపై అధికారులతో సమీక్ష చేశారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జిల్లాలో మొదటిసారిగా బర్డ్ ఫ్లూ కేసులు నమోదైనట్లుగా తెలిపారు. వ్యాధి విస్తరించకుండా, మనుషులకు సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లుగా చెప్పారు. కిలోమీటర్ లోపు కోళ్లను, గుడ్లను విక్రయించకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏదైన బర్డ్ ఫ్లూ అనుమానిత సమాచారం ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 8500404016కు ఫోన్ చేయాలని సూచించారు.