బీజేపీ, బీఆరెస్ క‌లిసి కూల్చుతాయా?

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుట్రలు పన్నుతున్నారని, లోకసభ ఎన్నికల తరువాత తన ప్రయత్నాలను

బీజేపీ, బీఆరెస్ క‌లిసి కూల్చుతాయా?

– బండి సంజయ్ వ్యాఖ్యల మర్మమేంటి?

– కర్ణాటక, మహారాష్ట్ర కుట్రలు పునరావృతం అవుతాయా

– దేశమంతా కాషాయం చేస్తారా?

విధాత‌, హైద‌రాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుట్రలు పన్నుతున్నారని, లోకసభ ఎన్నికల తరువాత తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తారని రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. అధికారం కోసం చంద్రశేఖర్ రావు ఎంతకైనా తెగిస్తాడని, మందికి పుట్టినవాళ్లను (ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు) కూడా తనవాళ్లని చెప్పుకుంటాడని సంజయ్ తూర్పారబట్టారు.


మూడోసారి అధికారంలోకి రావాలని సర్వశక్తులు ఒడ్డినప్పటికీ తెలంగాణలో బీఆరెస్ విజయతీరాలకు చేరుకోలేకపోయింది. తన చిరకాల ప్రత్యర్థి ఏ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగడం కష్టమని, మూడునాళ్ల ముచ్చట అని, లోకసభ ఎన్నికల తరువాత ఏ క్షణమైనా కూలిపోతుందని, కాంగ్రెస్ లో 20 మంది వరకు కేసీఆర్ ఎమ్మెల్యేలు ఉన్నారనే గుసగుసలు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందే వారికి అవసరమైన నిధులు (పెట్టుబడులు) సమకూర్చారని, కేసీఆర్ కనుసైగ చేస్తే చాలు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్ చేస్తారని, వారితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇబ్బందులు ఉండవనే వాదనలు విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చాయి. తెలంగాణ సచివాలయంలో చక్రం తిప్పుతున్న ఉద్యోగ సంఘం నాయకుడు కూడా ఈ ప్రభుత్వం మనుగడ 6 నెలలు మాత్రమేనని, ఆ తరువాత కేసీఆర్ సీఎం అవుతారని తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. సచివాలయం బయటకు బదిలీపై వెళ్లిన ఆయన మళ్ళీ బీఆరెస్ ప్రభుత్వం రాగానే వెనక్కి వస్తారా అని ఉద్యోగులు చర్చించుకోవడం కన్పించింది. ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ బలం 64 స్థానాలు కాగా, బీఆరెస్ బలం 39 స్థానాలు. కాంగ్రెస్ నుంచి 20 మంది వస్తే బీఆరెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం.


ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఆదివారం నాడు కరీంనగర్ లో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో బీఆరెస్ రెండుగా చీల్చుతుందని తనతో పలువురు చెప్పారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం బీఆరెస్ వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు. అయితే ముందస్తు కుట్రలో భాగంగానే బీజేపీ బండి సంజయ్ తో లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నదనే అనుమానాలను కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో బీజేపీ సర్కార్ ఏర్పాటు అయ్యింది. కర్ణాటక, మహారాష్ట్రలో సంకీర్ణ కాంగ్రెస్ సర్కార్ లను బీజేపీ కూల్చిన విషయాన్ని నాయకులు ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఏర్పాటు అయిన ప్రభుత్వాలను బతకనీయకుండా బీజేపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నదని, దానిలో భాగంగానే బండి సంజయ్ ముందస్తు విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కూల్చివేస్తారని లేనిపోని భ్రమలు కల్పించి, ఆ ప్రక్రియను బీజేపీనే పూర్తి చేస్తుందనే అనుమానాన్ని కాంగ్రెస్ పెద్దలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ను బూచిగా చూపించి బీజేపీ తన పని పూర్తి చేస్తుందని, ఇందుకోసం బీఆరెస్ లోని ఒక వర్గం వారిని లాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఇదే తరహాలో కాంగ్రెస్ లో ఉన్న కొందరిని ఈడీ, సీబీఐలను బూచిగా చూపించి తమవైపు తిప్పుకుని కలగూర గంప సర్కార్ ను ఏర్పాటు చేసే ప్రమాదముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే బీఆరెస్, కాంగ్రెస్ నుంచి జంప్ అయిన సభ్యులతో బీజేపీ సంకీర్ణ సర్కార్ కొలువుదీరుతుందనేది ఇక్కడ అర్థమవుతుంది. మహారాష్ట్ర లో ఏకనాథ్ షిండే మాదిరి తెలంగాణలో సర్కార్ ఏర్పాటుకు బీజేపీ స్కెచ్ వేసిందని, అందులో భాగంగానే బండి సంజయ్ ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.