విధాత : వానకాలం సీజన్ లో అటవీ అందాలు రెట్టింపు అవుతుంటాయి. ముఖ్యంగా జలపాతాలు పరవళ్లు కనువిందు చేస్తుంటాయి. . ఎత్తైన కొండల్లో నుంచి.. ధట్టమైన అడవుల్లో నుంచి పాలధారాలతో దిగువకు జాలువారుతుంటే జలపాతాల అందాలు సందర్శకులను ఆహ్లాదపరుస్తుంటాయి. తాజాగా తెలంగాణలోని ములుగు జిల్లాలో తెలంగాణ ‘నయాగరా’గా పేరొందిన బొగత జలపాతం మళ్లీ ఉరకలెత్తింది. నెలలపాటు నీరు లేక బోసిపోయిన ఈ జలపాతం, ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో సరికొత్త జలకళను సంతరించుకుంది. ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్న ఈ దృశ్యాలు పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
తెలంగాణలోని ప్రముఖ జలపాతాలు
తెలంగాణలోని జలపాతాలు పచ్చని అడవుల మధ్య, ఎత్తైన కొండల నుంచి కిందికి దూకుతూ కశ్మీర్ అందాలను మరిపిస్తాయి. వర్షాకాలంలో ఈ జలపాతాలు తెల్లటి నురగలు కక్కుతూ చూపరులకు కనువిందు చేస్తుంటాయి.
కుంతల జలపాతం: తెలంగాణలోనే అతి పెద్ద ఎత్తైన జలపాతం కుంతల జలపాతం. ఇది నిర్మల్ జిల్లాలోని నేరడిగొండ మండలంలో దట్టమైన అడవులలో, సహ్యాద్రి పర్వత శ్రేణిలో గోదావరికి ఉపనది అయిన కడెం నది పై ఈ జలపాతం ఉంది. కడెం నది 150 అడుగుల ఎత్తు నుంచి రెండు అంచెలుగా కిందికి పడుతుంది. హైదరాబాద్ నుంచి దీని దూరం 260 కిలోమీటర్లు. కుంటాల గ్రామానికి సమీపంలోని అభయారణ్యంలో ఉంది.
ఇవి ఆదిలాబాదు జిల్లాలోని సహ్యాద్రి పర్వత పంక్తుల్లో కడెం నదిపై . 45 మీటర్ల ఎత్తు నుంచి జలజల పారే నీళ్ళు, ఆ చప్పుడు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
బొగత జలపాతం: ‘తెలంగాణ నయాగరా’ అని పిలిచే బొగత జలపాతం ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉంది. దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఉండే ఈ జలపాతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. బొగతను చీకులపల్లి ఫాల్స్ అనికూడా అంటారు.
మల్లెల తీర్థం: నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అడవుల్లో ఉన్న మల్లెల తీర్థం ఒక సుందర సహజ జలపాతం. దట్టమైన చెట్ల గుండా ప్రవహించే ఈ జలపాతం 150 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడుతుంది
పొచ్చెర జలపాతం: ఇది నిర్మల్ జిల్లాలో కడెం నదిపై ఉంది. ఇది 40 అడుగుల ఎత్తు ఉండి, చాలా అందమైన గుండంలా ప్రవహిస్తుంది
భీముని పాదం జలపాతం: ఇది మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం, సీతానగరం దగ్గర ఉంది. ఇది 70 అడుగుల ఎత్తు నుంచి పాలధారలా కిందకు పడుతుంది.
మరిన్ని జలపాతాలు వివరాలు :
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ జలపాతం, కొమరంభీం జిల్లా లింగాపూర్ మండలంలోని పిట్టగూడ సప్తగుండాల జలపాతం, నిర్మల్ జిల్లా గాయత్రి జలపాతాలు, ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం బలన్‌పూర్ గ్రామ సమీపంలోని కనకాయ్(కనకదుర్గ జలపాతం), ఇది కనకాయ్, బండ్రేవు, చీకటిగుండం అనే మూడు జలపాతాల సముదాయాలు కనువిందు చేస్తుంటాయి. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని మాన్కాపూర్ గ్రామ సమీపంలోని పారకాపి జలపాతం, నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని అజలాపురం జలపాతం, మహబూబ్ నగర్ జిల్లా, ఆత్మకూరు మండలంలోని గుండాల గ్రామం జలపాతం, పెద్దపల్లి జిల్లాలో గుండారం-సబ్బితం సరిహద్దుల్లోని గుట్టపై నుంచి జాలువారే గౌరీగుండం, నిజామాబాదు జిల్లాలోని ధర్పల్లి మండలం సిర్నాపల్లి గ్రామంలోని సిర్నాపల్లి జలపాతం, భూపాలపల్లి జిల్లాలోని చెర్ల-వెంకటాపురం డివిజన్‌లోని గద్దల సరి జలపాతం, ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో రాజురా గుట్టల నుండి వచ్చే నీరు వాంకిడి వాగు గుండా ప్రవహించే కొరటికల్ జలపాతాలు కూడా సందర్శకలను ఆకర్షిస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధి మంచాల మండల కేంద్రంలోని బోడకొండ గుట్టల జలపాతం, ఆసిఫాబాద్ జిల్లా సముతుల జలపాతం, ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్‌లో మిట్టె జలపాతం, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని చింతలమాదర మందగుడ గ్రామం మాధార జలపాతం, ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని బాబేఝరి జలపాతం, ఆదిలాబాద్ జిల్లా బోథ్ సమీపంలోని ఇచ్చోడ మండలం పెద్దగుండం జలపాతం, నిర్మల్ జిల్లా గోదావరి నది ఉపనది కడెం పరిసరాల్లోని ముక్తిగుండం(గాడిద గుండం) జలపాతం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని రథంగుట్ట వద్ద జలపాతం, పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని జాఫర్‌ఖాన్‌పేట గ్రామంలో ఉన్న పాండవలొంక జలపాతాలు సందర్శకును మైమరిపిస్తూ ఆకట్టుకుంటున్నాయి.
#Info ములుగు జిల్లాలో తెలంగాణ ‘నయాగరా’గా పేరొందిన బొగత జలపాతం మళ్లీ ఉరకలెత్తింది. నెలలపాటు నీరు లేక బోసిపోయిన ఈ జలపాతం, ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో సరికొత్త జలకళను సంతరించుకుంది. ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్న ఈ దృశ్యాలు పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను విశేషంగా… pic.twitter.com/ErpSlur7AJ
— TG Govt Updates (@TGGovtUpdates) July 2, 2026
