తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుతుంది జాగ్రత్త : మంత్రి సీతక్క

అవినీతి సీతక్క అంటూ నాపై తప్పుడు నిరాధారమైన తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుతుంది జాగ్రత్త అంటూ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క బీఆర్ఎస్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుతుంది జాగ్రత్త : మంత్రి సీతక్క

విధాత, హైదరాబాద్ : అవినీతి సీతక్క అంటూ నాపై తప్పుడు నిరాధారమైన తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుతుంది జాగ్రత్త అంటూ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క బీఆర్ఎస్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో జరిగిన ములుగు జిల్లా కార్యవర్గ సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడారు. అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు పంచుతుంటే స్కాం జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు దీర్ఘాలు తీస్తున్నారు అని, రూ. 11650 మొబైల్ కొనుగోలు చేస్తే రూ. 14500 కి కొనుగోలు చేశామని, రూ.30కోట్ల స్కామ్ జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తక్కువ ధరకు మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేస్తే… ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని.. అందులో కోట్ల కుంభకోణం జరిగిందని ఊహాజనిత కథనాలు అల్లుతున్నారన్నారు. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. అవినీతి సీతక్క అని తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుతుంది జాగ్రత్త అంటూ హెచ్చరించారు.

అణగారిన వర్గాలు, సామాన్యులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేరు అని, కేంద్రం ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారమే, కేంద్రం నిర్దేశించిన ధరలకు లోబడే థర్డ్ పార్టీ ద్వారా మొబైల్స్ ఓపెన్ టెండర్ విధానంలో కొనుగోలు చేశాం అని సీతక్క స్పష్టం చేశారు. సాంకేతిక సామర్థ్యం ఉన్న ఐటీ శాఖ పరిధిలోని టీజీటీఎస్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆన్లైన్ పోర్టల్ GeM ద్వారా కొనుగోలు చేయడం జరిగిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు మనం కొనుగోలు చేసిన మోడల్ మొబైల్ లను ఇంకా ఎక్కువగా కొనుగోలు చేశారని తెలిపారు.

ఏ మంచి పని చేసినా బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, రాష్ట్రం పచ్చబడుతుంటే బీఆర్ఎస్ నాయకుల కండ్లు ఎర్రబడుతున్నాయని సీతక్క విమర్శించారు. బీఆర్ఎస్ నిరాధార ఆరోపణలతో బురద రాజకీయాలు చేస్తోందన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే లీగల్ చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ఏ పని చేసిన అవినీతి ముద్ర వేస్తున్నారు అని, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్తు ఇచ్చినా సహించలేకపోతున్నారన్నారు. రూ.200 కోట్లతో మేడారాన్ని అభివృద్ధి చేస్తే అవినీతి జరిగిందంటూ కారు కూతలు కుస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ దుష్ప్రచారంపై కాంగ్రెస్ శ్రేణులు ఓపిక పట్టింది ఇక చాలు అని, మన మీద తప్పుడు ఆరోపణలు చేస్తే దీటుగా తిప్పి కొట్టండి అని సీతక్క సూచించారు.