BRAOU | అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్.. ఏపీ విద్యార్థులకు నో ఛాన్స్.. ఎందుకంటే..?
BRAOU | హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతో పాటు సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. అయితే ఈ ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు అనర్హులు.

BRAOU | హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ( BRAOU )లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతో పాటు సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. అయితే ఈ ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రానికి చెందిన విద్యార్థులు అనర్హులు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2014 నుండి 10 సంవత్సరాల పాటు తప్పనిసరిగా తెలంగాణ, ఏపీ విద్యార్థులకు కలిపి ఉమ్మడి ప్రవేశాలను నిర్వహించింది. రాష్ట్ర విభజన చట్టంలో హైదరాబాద్‌ను తెలంగాణకు శాశ్వత రాజధానిగా, ఏపీ రాష్ర్టానికి పదేండ్ల పాటు తాత్కాలిక, ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గడువు 2024, జూన్ 2తో ముగిసింది.
దీంతో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ కేవలం తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులకే ప్రవేశాలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కొత్త నిబంధనలతో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతో పాటు సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది.
ఆయా కోర్సుల్లో చేరేందుకు అర్హతలు ఇవే..
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారు ఇంటర్ లేదా నేషనల్ ఓపెన్ స్కూల్, టీఎస్ ఓపెన్ స్కూల్ సోసైటీలో తత్సమాన కోర్సు పాసై ఉండాలి. పీజీ కోర్సుల్లో చేరాలనుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 18. ఆయా కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అనే www.braouonline.in or www.braou.ac.in వెబ్‌సైట్స్‌ను లాగిన్ అవొచ్చు. మరిన్ని వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 18005990101, 7382929570, 7382929580 లేదా 040-23680290/291/294/295 నంబర్లను సంప్రదించొచ్చు.